- మహిళల ఆర్థిక అభ్యున్నతి కోసమే సీఎం చంద్రబాబు డ్వాక్రా తెచ్చారు
- పథకాలు అమలు చేయకుండా మోసం చేసిన గత పాలకులు
- అందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
- 3వ రోజు కుప్పం నియోజకవర్గ పర్యటనలో నారా భువనేశ్వరి
కుప్పం (చైతన్యరథం): ప్రజాసేవకే తమ కుటుంబం అంకితమైందని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. గత పాలకులు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. 3వ రోజు కుప్పం నియోజకవర్గం పర్యటనలో భాగంగా శుక్రవారం శాంతిపురం మండలం నక్కలపల్లి, రామకుప్పం మండలం కొంగనపల్లిలో నారా భువనేశ్వరి పర్యటించారు. నక్కలపల్లిలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామంలోని రాములవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మల్బరీ తోటలను నారా భువనేశ్వరి పరిశీలించారు. ఆ తర్వాత పట్టు పరిశ్రమలను సందర్శించారు. పట్టు పురుగుల నుంచి దారం తయారీ విధానంపై అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు.
పట్టు మహిళా రైతులతో భేటీ
నక్కలపల్లిలో పట్టు మహిళా రైతులతో సమావేశమైన నారా భువనేశ్వరి మట్లాడుతూ మహిళలు భయాన్ని వదిలి ధైర్యంగా ముందడుగు వేస్తే సాధించలేనిది ఏమీ లేదన్నారు. నిజం గెలవాలి యాత్ర చేయడానికి నేను భయపడ్డాను. నిత్యం ప్రజా సేవలో ఉండే చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు మేము చాలా బాధపడ్డాము. ఆ సమయంలో ప్రపంచంలోని తెలుగువారంతా ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. టీడీపీ కుటుంబసభ్యులు ముఖ్యంగా మహిళలు అందించిన ప్రోత్సాహం, ధైర్యంతో నేను యాత్రను కొనసాగించాను. యాత్ర చేసేప్పుడు అన్ని వర్గాల ప్రజలను కలిసే అవకాశం, వారి కష్టసుఖాలను ప్రత్యక్షం చూసే అవకాశం నాకు కలిగింది. చంద్రబాబు మహిళల కోసం రూపొందించి అమలు చేసిన పథకాల గురించి వారు నాకు చెబుతుంటే ఆశ్చర్యపోయానని భువనేశ్వరి తెలిపారు.
ఎలీప్ ద్వారా మహిళలకు నాణ్యమైన శిక్షణ
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం సీఎం చంద్రబాబు 32 ఏళ్ల క్రితం ఎలీప్‌ను స్థాపించారు. దీని ద్వారా ఎంతోమంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడమే కాకుండా పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి వెళ్లారు. ఇదే ఎలీప్‌ను ఇప్పుడు మన కుప్పంలో ఏర్పాటు చేశాం. నేను కుప్పం నియోజకవర్గ మహిళలను కోరేది ఒక్కటే. ఎలీప్ ద్వారా నాణ్యమైన శిక్షణ పొంది పారిశ్రామికవేత్తలుగా ఎదగండి. అలాగే చంద్రబాబు స్థాపించిన డ్వాక్రా ద్వారా మహిళలు ఆర్థికంగా ఉన్నతి సాధించాలని కోరుకుంటున్నాను. బ్యాంకు రుణాలను డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. పేదరికం లేని సమాజం సీఎం చంద్రబాబు లక్ష్యం. పేదలందరికీి సొంతిళ్లు, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నారా భువనేశ్వరి సూచించారు.