- ఫ్రెండ్లీ మ్యాచ్‌లపై దృష్టి సారించండి
- క్రికెట్ విక్టోరియా ఎగ్జిక్యూటివ్‌లకు మంత్రి లోకేష్ వినతి
- సానుకూలంగా స్పందించిన క్రికెట్ విక్టోరియా
- భారత్‌లో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడి
మెల్‌బోర్న్/ఆస్ట్రేలియా (చైతన్యరథం): ఏపీలో ప్రతిభగల క్రికెట్ క్రీడాకారులను గుర్తించడానికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యాన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)ను నిర్వహిస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఆరోరోజు శుక్రవారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో క్రికెట్ విక్టోరియా ఎగ్జిక్యూటివ్‌లతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఏపీ క్రీడాకారులను ఐపీఎల్ స్థాయికి తీసుకెళ్లడమే ఏపీఎల్ ముఖ్యోద్ధేశమని తెలిపారు. ఐపీఎల్`2025 మెగా వేలంలో ఆంధ్రప్రదేశ్ (ఏపీఎల్) నుండి షేక్ రషీద్, త్రిపూర్ణ విజయ్, నితీష్ రెడ్డి, సత్యనారాయణ రాజు, పైలా అవినాష్ ఎంపికయ్యారు. వీరితో పాటు గతంలో ఏపీఎల్‌లో ఆడిన ఇతర ఆటగాళ్లను కూడా వివిధ ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ జట్టులో చేర్చుకున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్/విక్టోరియాలలో క్రికెట్ క్రీడాకారుల నైపుణ్యాన్ని పెంచేందుకు ఉమ్మడి శిక్షణా శిబిరాలు, స్నేహపూర్వక మ్యాచ్‌లు నిర్వహించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. క్రికెట్ సౌకర్యాలు, ఈవెంట్ల నిర్వహణలో పర్యావరణ అనుకూల పద్ధతులను ప్రోత్సహించాలి. మహిళా క్రికెట్ క్రీడాకారులకు అవకాశాలను విస్తరించే కార్యక్రమాలపై దృష్టి సారించాలని కోరారు. లైవ్ స్ట్రీమింగ్, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అభిమానుల అనుభవాన్ని మెరుగుపర్చేందుకు చొరవచూపాలని మంత్రి లోకేష్ విజ్జప్తి చేశారు.
భారత్‌లో క్రికెట్ అకాడమీ
క్రికెట్ విక్టోరియా ప్రతినిధులు మాట్లాడుతూ… భారతదేశంలో జారీ చేయబోయే క్రికెట్ విద్య డిప్లొమాలు, డిగ్రీలపై తాము ఆసక్తిగా ఉన్నామన్నారు. భారత్‌లో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. మహిళల క్రికెట్ అభివృద్ధికి మా వంతు సహకారం అందిస్తాం. విక్టోరియా రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించడం, క్రీడాసౌకర్యాలను అభివృద్ధి చేయడం మా లక్ష్యం. విక్టోరియా పురుషుల జట్టు (విక్టోరియా బుష్‌రేంజర్స్), విక్టోరియన్ మహిళల జట్టు (విక్టోరియా స్పిరిట్)తో సహా విక్టోరియా ప్రొఫెషనల్ క్రికెట్ జట్లను క్రికెట్ విక్టోరియా పర్యవేక్షిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఔత్సాహిక క్రికెటర్ల ప్రోత్సాహానికి జూనియర్ క్రికెట్, స్కూల్ ఈవెంట్స్, కమ్యూనిటీ క్లబ్‌లకు మద్దతు ఇస్తున్నాం. అంతర్జాతీయంగా పేరొందిన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ సహా రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నాం. విక్టోరియా బుష్‌రేంజర్స్ షెఫీల్డ్ షీల్డ్ (ఫస్ట్-క్లాస్ క్రికెట్), మార్ష్ వన్-డే కప్ (దేశీయ వన్డే పోటీ)లో పోటీపడుతుడగా, విక్టోరియా స్పిరిట్ మహిళల జట్టు జాతీయ క్రికెట్ లీగ్ (డబ్ల్యూఎన్‌సీఎల్), మహిళల బిగ్ బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్)ల్లో తలపడుతున్నట్లు చెప్పారు.











