- మనం సాధించిన విజయాలు వివరించండి
- ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలి
- కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తాం
- భిన్నాభిప్రాయాలు ఉన్నా అందరూ కలసికట్టుగా ముందుకుసాగాలి
- టీడీపీలో కార్యకర్తకే అగ్రతాంబూలం, ఆ తర్వాతే ఎవరైనా
- ఉత్తమ కార్యకర్తల సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్
- 3సార్లు ఉత్తమ కార్యకర్త అవార్డు అందుకున్న ఆదిరెడ్డికి ప్రత్యేక అభినందన
యలమంచిలి (చైతన్యరథం): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై జూన్ నుంచి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించాలి.. పెన్షన్లు, అన్న క్యాంటీన్, స్టీల్ సిటీ, ఎన్‌టీపీసీ, బల్క్ డ్రగ్ పార్కు వంటి విజయగాథóలను ప్రజల్లోకి తీసుకెళ్లండి..చేసిన పనులు చెప్పుకోకపోతే ప్రత్యర్థులు చెప్పే అబద్ధాలు జనంలోకి వెళ్తాయి..ఈ విషయంలో పార్టీ కేడర్ అప్రమత్తంగా వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపు ఇచ్చారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో సోమవారం నిర్వహించిన ఉత్తమ కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ…. ఇటీవల నేను ఢల్లీిిలో ఒక ఫంక్షన్‌కు వెళ్లాను, అక్కడ మన సభ్యత్వం గురించే చర్చ జరుగుతోంది. 5 లక్షలు చేయలేకపోతున్నాం, కోటి సభ్యత్వాలు ఎలా చేశారని ఇతర పార్టీల నేతలు అడిగారు, ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు హయాం నుంచి సభ్యత్వం మనకు ఒక ఎమోషన్, యలమంచిలి నియోజకవర్గంలో 41వేల సభ్యత్వం చేసినందుకు అభినందనలు. యువగళం పాదయాత్రలో కష్టపడిన కార్యకర్తలను గుర్తించాలని ఇక్కడ కార్యకర్తలు నాకు చెప్పారు. బాబు ష్యూరిటీ ` భవిష్యత్తుకు గ్యారంటీ, సోషల్ మీడియా, సభ్యత్వ నమోదులో మెరుగైన పనితీరు కనబర్చిన వారి వివరాలను ఆన్‌లైన్ లో పెట్టా. ఎవరు పనిచేస్తున్నారో తెలుసుకునేందుకు ఈ విధానం అమలుచేస్తున్నాం. టీడీపీలో కష్టపడిన కార్యకర్తలకే నామినేటెడ్ పదవులు ఇస్తాం, ఈ విషయంలో స్పష్టతతో ఉన్నాం, కష్టపడి పార్టీకోసం పనిచేయండి. ప్రస్తుత మన ప్రభుత్వం అయిదేళ్లు ఉంటుంది. తొలిసారి అవకాశం రాకపోయినా మూడువిడతల్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తాం, అధైర్యపడవద్దని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.
అలకలు మాని పార్టీకోసం పనిచేయండి
మే తర్వాత కేడర్ అంతా ప్రజల్లోకి వెళ్లాలి, మే నెలలో కడపలో మహానాడు నిర్వహించబోతున్నాం. ఈ లోగా కుటుంబ సాధికార సమితులు, బూత్, క్లస్టర్ కమిటీలు, అనుబంధ సంఘాలు, జిల్లా కమిటీల నియామకాన్ని పూర్తిచేస్తాం. మహానాడులో జాతీయ అధ్యక్షుడి ఎన్నిక తర్వాత రాష్ట్ర కమిటీ నియమాకం చేపడతాం. పార్టీ కేడర్ అంతా ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రజల్లోకి వెళ్లాలి. జగన్‌పై కంటే పార్టీ కార్యకర్తల కోసమే నేను ఎక్కువగా పోరాడుతుంటాను. సమస్యలపై నిర్ణయం తీసుకునే వరకు అందరం కూర్చుని చర్చిద్దాం, ఒకసారి నిర్ణయం తీసుకున్నాక అందరం కలిసి పనిచేయాల్సిందే. అలకలు మాని నమ్ముకున్న సిద్ధాంతం కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని మంత్రి లోకేష్ ఉద్బోధించారు.
ఇకపై నిరంతరం యువరక్తం ఎక్కిస్తాం
ఇకపై పార్టీలో నిరంతరం యువరక్తం నింపాలని నిర్ణయించాం. యువత రాజకీయాల్లోకి రావాలి. ఏ నాయకుడు కూడా ఒకే పదవిలో మూడుసార్లకు మించి ఉండకూడదని ప్రతిపాదిస్తున్నాం. గ్రామస్థాయి అధ్యక్షుడికి కూడా పొలిట్‌బ్యూరోలో స్థానం లభించే పరిస్థితి రావాలి. పార్టీలో కరుడుగట్టిన కార్యకర్తలంతా వైసీపీ పాలనలో అయిదేళ్లు నరకం అనుభవించారు, ఎన్నో కేసులుపెట్టి హింసించారు. హోంమంత్రి అనితపై కూడా 23 కేసులు ఉన్నాయి. పాదయాత్ర సమయంలో పోలీసులు నాకు సెక్యూరిటీ అడిగితే ఇవ్వలేదు, ఇప్పుడు వద్దంటే వస్తున్నారు. రామతీర్థం వెళ్లడానికి చంద్రబాబు విశాఖ ఎయిర్ పోర్టుకు వస్తే రోడ్డుకు అడ్డుగా పొక్లయినర్లు పెట్టారు. పాదయాత్ర సమయంలో నా స్టూల్, మైక్ లాక్కున్నారు. ఈ రోజు టైం బాగుంది కదా అని గతాన్ని మర్చిపోవద్దు. కుటుంబంలో మాదిరి పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయి, పరిష్కరించుకొని ముందుకు సాగాలని మంత్రి లోకేష్ సూచించారు.
ఓర్పు, సహనంతో ప్రజల్లోకి వెళ్లండి
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే ఫస్ట్, కార్యాలయాలకు వెళ్లి చట్టపరంగా పరిష్కరించరించగలిగిన సమస్యలను స్థానికంగానే పరిష్కరించేందుకు కేడర్ చొరవ చూపాలి. మే నెల నుంచి ప్రతిరోజూ 300 మందికి చొప్పున పార్టీ కేడర్‌కు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తాం. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించుకోవాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10నెలలు అయింది. మరో రెండునెలల్లో మహానాడు నిర్వహించుకోబోతున్నాం. ఇతర పార్టీ ఎమ్మెల్యే ఉన్నచోట సమన్వయ లోపం కారణంగా సమస్యలు వస్తున్నాయి. ఎమ్మెల్యే లేనిచోట అక్కడ ఇన్‌ఛార్జి ప్రతివారం కార్యకర్తలతో కూర్చుని మాట్లాడుకోవాలి. చట్టపరిధిలోని పనుల కోసం కార్యకర్తలు కార్యాలయాలకు వెళితే పనులు చేయాల్సిందే. ఓర్పు, సహనంతో ప్రజల్లోకి వెళ్లాలని కార్యకర్తలను మంత్రి లోకేష్ కోరారు. ఈ సందర్భంగా ఉత్తమ కార్యకర్తలను మంత్రి లోకేష్ అభినందించారు. సభ్యత్వం, మన టీడీపీ, భవిష్యత్తుకు గ్యారంటీ వంటి అంశాల్లో అవార్డు అందుకున్న ధర్మాల ఆదిరెడ్డి అనే కార్యకర్తను ప్రత్యేకంగా అభినందించారు.
తప్పుడు కేసుల ఎత్తివేతకు చర్యలు
ఈ సమావేశంలో పలు సమస్యలను కార్యకర్తలు మంత్రి లోకేష్ దృష్టికి తెచ్చారు. వైకాపా సర్పంచ్‌లతోపాటు 10శాతం వైసీపీి వారు కూడా టీడీపీ సభ్యత్వ కార్డులు తీసుకున్నారని తెలిపారు. అచ్యుతాపురం సెజ్‌కు సంబంధించి ఆర్ అండ్ ఆర్ లో ఇంకా 200 మందికి స్థలాలు ఇవ్వలేదు, ఆ సమస్యను పరిష్కరించండి. పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ నిర్మించండి. ఉపాధి హామీ, నీరు-చెట్టు బిల్లులు చెల్లించండి, కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని కోరారు. ఉపాధి హామీ, నీరు-చెట్టు బిల్లులు, తప్పుడు కేసులకు సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని సంప్రదించాలని మంత్రి లోకేష్ కోరారు.
ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ దామచర్ల సత్య, యలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.