- పొత్తు ధర్మం పాటించిన టీడీపీ
- ఐదు స్థానాల్లో జనసేన, బీజేపీకి చెరొకటి
- ఒక ఎస్సీ, ఇద్దరు బీసీలకు టీడీపీ టిక్కెట్లు
- ఆ వర్గాలపై పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనం
- ప్రాంతాల మధ్య సమతూకం, మూడు ప్రాంతాలనుంచి ఒక్కొక్కరు ఎంపిక
అమరావతి (చైతన్యరథం): టీడీపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఉత్కంఠకు తెరపడిరది. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు తీవ్ర కసరత్తు తర్వాత మూడు స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు. కావలి గ్రీష్మ (ఎస్సీ), బీద రవిచంద్ర (బీసీ), బీటీ నాయుడు (బీసీ)కు అవకాశం కల్పించారు. సోమవారంతో నామినేషన్ గడువు ముగియనుండటంతో ఎంపికైన అభ్యర్ధులు తమ నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.
ఎమ్మెల్సీలుగా యనమల రామకృష్ణుడు, పర్చూరి అశోక్‌బాబు, జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు పదవీకాలం ముగియనుండటంతో ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదుగురిలో బీటీ నాయుడికి మాత్రమే పొడిగింపు లభించింది.
ఎమ్మెల్యే కోటాలో మొత్తం ఐదు స్థానాలకు ఎన్నిక జరగనుండగా.. ఒక స్థానాన్ని ఇప్పటికే మిత్రపక్షం జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ తరపున కొణిదెల నాగబాబు నామినేషన్ కూడా వేశారు. మిగిలిన నాలుగు స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు చంద్రబాబు కసరత్తు చేస్తున్న క్రమంలో.. బీజేపీకి ఒక స్థానం కేటాయించాలని ఆ పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. ఆశావహుల సంఖ్య భారీగానే ఉన్నప్పటికీ పొత్తులో భాగంగా బీజేపీకి ఒక స్థానం కేటాయిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది.
ఈ సారి బీజేపీకి ఒక సీటు ఇచ్చినందున సర్దుబాటు చేయలేకపోతున్నామని, 2027లో మరోమారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయిని.. వాటిలో ఛాన్స్ ఇస్తామని పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పమన్నారంటూ ఆశావహులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వయంగా ఫోన్ చేసి సర్దిచెప్పారు. ఆ కొద్ది సేపటికే పార్టీ అధిష్టానం ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మ, అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన బీదా రవిచంద్రతోపాటు కర్నూలు జిల్లాకు చెందిన బీటీ నాయుడు పేర్లను ఖరారు చేశారు.
అభ్యర్థుల ఎంపికలో ప్రాంతాల మధ్య సమతూకం పాటించారు. ఉత్తరాంధ్ర నుంచి ఎస్సీ, యువత కోటాలో కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. రాయలసీమ నుంచి బీసీ వర్గానికి చెందిన బీటీ నాయుడుకు, కోస్తా జిల్లాల నుంచి బీసీ వర్గానికి చెందిన బీదా రవిచంద్రను ఎంపిక చేశారు. దీంతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి ముగ్గురిని ఎంపిక చేసినట్లు అయింది.
టీడీపీ ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాలను బడుగు, బలహీన వర్గాలకే కేటాయించింది. వెనకబడిన వర్గాలను ఆది నుంచి ఆదరిస్తున్న టీడీపీ తాజాగా ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాలను కూడా బీసీ, ఎస్సీ వర్గాలకే కేటాయించింది. ఎన్నికలు జరుగుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాలకుగాను పొత్తులో భాగంగా రెండు సీట్లు జనసేన, బీజేపీకి కేటాయించగా మిగిలిన 3 సీట్లకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. అందులో రెండు బీసీలకు, ఒకటి ఎస్సీకి కేటాయిస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన బీసీ సామాజికవర్గ నేత బీటీ నాయుడుకి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. పార్టీలో మొదటి నుంచీ అంటిపెట్టుకుని ఉన్న బీదా రవిచంద్రకు కూడా పార్టీ ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించింది. యువతను ప్రోత్సహించడం, మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చే క్రమంలో ఎస్సీ సామాజికవర్గం నుంచి శ్రీకాకుళానికి చెందిన మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మకు పార్టీ అవకాశం ఇచ్చింది. టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికైన ముగ్గురు నేతలూ బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన వారిని బట్టి చూస్తే ఆ వర్గాలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యత ఏంటనేది మరోసారి స్పష్టమైంది.
ఈ నెల 20వ తేదీన ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక కూటమిలోని మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనకు రెండు ఎమ్మెల్యే స్థానాలను కేటాయించారు. బీజేపీకి చివరి నిమిషంలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి ఆంధ్రప్రదేశ్ ఓటరు అఖండ విజయం అందించారు. కూటమి 164 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. బీజేపీ, జనసేనతో కలిసి వెళుతున్న టీడీపీ అన్ని విషయాల్లోనూ మిత్ర ధర్మం పాటిస్తోంది.