- ప్రతి ఒక్కరికీ జీఎస్టీ-2.0 సంస్కరణల ఫలాలు
- విస్తృత ప్రచారానికి కెబినెట్ సబ్ కమిటీ వేస్తాం
- జీఎస్టీ సంస్కరణలతో ఏపీ పథకాలకు లబ్ది
- కొన్ని రాజకీయ పార్టీలకు సంస్కరణలు అర్థం కావు
- ప్రగతి సంస్కరణకు ఆ పార్టీలు సహకరించవు
- తొలిరోజు సభలో జీఎస్టీ సంస్కరణలపై సీఎం చంద్రబాబు
- జీఎస్టీ-2.0 సంస్కరణలను స్వాగతిస్తూ తీర్మానించిన తొలి రాష్ట్రంగా ఏపీ
- సంస్కరణలతో దేశాభివృద్ధికి కృషి చేస్తున్నారు..
- నరేంద్ర మోదీ, నిర్మలా సీతారామన్‌కు శాసనసభ అభినందనలు
అమరావతి (చైతన్య రథం): ప్రపంచంలో దేశం నెంబర్-1 కావాలి. దేశంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉండాలి. దీనికి తాజాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జీఎస్టీ-2.0 సంస్కరణలు ఊతమిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాల తొలిరోజు సభలో జీఎస్టీ సంస్కరణలపై చర్చ జరిగింది. కేంద్రం చేపట్టిన సరళీకృత సంస్కరణ నేపథ్యంలో ఏయే వస్తువులకు ఎంతమేర ధరలు తగ్గుతాయనే అంశాన్ని ముఖ్యమంత్రి సభలో వివరించారు. జీఎస్టీ-2.0 సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈమేరకు జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను అభినందిస్తూ ఏపీ శాసన సభలో ముఖ్యమంత్రి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దేశంలోనే తొలిసారి జీఎస్టీ-2.0 సంస్కరణలను స్వాగతిస్తూ తీర్మానం చేసిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘గతంలో సీఎస్టీ, వ్యాట్‌లాంటి సంక్లిష్టమైన పన్నుల వ్యవస్థ ఉండేది. 17 రకాల పన్నులు, 13 రకాల సెస్సులు, సర్చార్జిలు ఉండేవి. డబ్బు కావాలంటే సర్‌ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వాలు విధించేవి. ఒక ఉత్పత్తికి అనుబంధ ఉత్పత్తులు వచ్చినా పన్నులు వేసే పరిస్థితి ఉండేది. అలాంటి వాటికి చెక్‌పెడుతూ జీఎస్టీని 2017లో ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చింది. వాజ్‌పేయి హయాంలోనే జీఎస్టీ తీసుకురావాలని ప్రయత్నించినా కుదరలేదు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ మోదీ తొలిసారి ప్రధాని కాగానే జీఎస్టీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు 140 కోట్లమంది ప్రజలకు ప్రయోజనం కలిగేలా జీఎస్టీ విధానాన్ని మరింత సరళతరం చేస్తూ రెండు స్లాబులతోనే కేంద్రం సంస్కరణలు తీసుకువచ్చింది. ప్రభుత్వానికి ఆదాయం వస్తే అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది. రెండోతరం జీఎస్టీ అమలు దేశ ఆర్థికాభివృద్ధికి కీలక మలుపు కాబోతోంది. సంపద సృష్టించ లేనివారికి సంక్షేమం గురించి మాట్లాడే అధికారం లేదు. కేంద్రం తీసుకువచ్చిన ఈ సంస్కరణలతో ముందుగానే దీపావళి, దసరా పండుగల బోనస్ ఇచ్చారు. 99 శాతంమేర వస్తువులన్నీ 5 శాతం పన్ను పరిధిలోకే వచ్చాయి. పేద-మధ్యతరగతి సహా అందరికీ లబ్ది కలుగుతుంది’’ అని చంద్రబాబు వివరించారు.
వన్ నేషన్- వన్ ట్యాక్స్ విధానంతో ఎంతో అభివృద్ధి
‘‘వన్‌నేషన్ -వన్ ట్యాక్స్ విధానం సక్రమంగా అమలు కావటంవల్ల ప్రయోజనం చేకూరుతోంది. జీఎస్టీ వల్ల పన్ను చెల్లింపుదారుల సంఖ్య 1.51 కోట్లకు పెరిగింది. అలాగే జీఎస్టీ వసూళ్లు రూ.22 లక్షల కోట్లకు పెరిగాయి. ఇక ప్రస్తుతం కేంద్రం చేపట్టిన జీఎస్టీ-2.0 సంస్కరణలవల్ల డబుల్ డిజిట్ గ్రోత్ సాధించే దేశంగా భారత్ అవతరిస్తుంది. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జీఎస్టీ సంస్కరణలు తెచ్చారు. దీని ప్రయోజనాలను ప్రజలందరికీ చేరువ చేసే బాధ్యత అందరం తీసుకోవాలి. జీఎస్టీ సంస్కరణలతో ప్రాథమికంగా కొద్ది ఇబ్బందులు వచ్చినా… దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జీఎస్టీ విధానాన్ని స్వాగతిస్తున్నాం. దీర్ఘకాల సంస్కరణలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి’’ అని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.
సంస్కరణలతో లబ్ది చేకూరిదిలా…
‘‘నిత్యావసర వస్తువులు, సబ్బులు, టూత్ పేస్టు, షాంపూలు, నెయ్యిలాంటి వస్తువులన్నీ 5 శాతానికి వచ్చాయి. ఏసీలు, ఫ్రిడ్జ్‌ల ధరలు కూడా గణనీయంగా తగ్గుతాయి. జీవిత బీమా, ఆరోగ్య బీమాలకు కూడా జీఎస్టీ సున్నా శాతానికి వెళ్లింది. యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రూ.750 కోట్ల వరకూ ఏపీకి ఆదా అవుతుంది. అగ్రిటెక్ యంత్రాలకు కూడా గణనీయంగా పన్ను తగ్గింది. రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఇళ్ల నిర్మాణానికి వినియోగించే వస్తువుల ధరలు కూడా 5 శాతం శ్లాబ్‌లోకి వచ్చాయి. నిర్మాణ రంగం పుంజుకుంటుంది. సాధారణ ప్రజలు కూడా వినియోగించుకునేలా ఎలక్ట్రానిక్స్ వస్తువులపై జీఎస్టీ తగ్గింది. అగ్రిటెక్, వ్యవసాయ పరికరాలపైనా పన్ను తగ్గింది. తక్కువ వ్యయంతో రైతులు ఉత్పత్తి సాధించగలుగుతారు. ఫార్మా సహా వివిధ రంగాలకు ఊతమిచ్చేలా ఈ సంస్కరణలున్నాయి. ఎంఎస్‌ఎంఈలకూ ప్రత్యేకంగా ఈ నిర్ణయం లబ్ది కలిగిస్తుంది. టాక్స్ రీఫండ్‌ల ద్వారా ఆర్ధిక ఉపశమనం కలుగుతుంది. లాజిస్టిక్స్ వ్యయం కూడా తగ్గి ధరలు మరింత దిగివచ్చే అవకాశం ఉంటుంది. ఏపీలో వన్ ఫ్యామిలీ- వన్ ఎంట్రప్రెన్యూర్ విధానానికి కూడా ఈ సంస్కరణలు ఎంతో ఉపయోగపడతాయి’’ అని సీఎం వివరించారు.
ప్రతి ఒక్కరికీ సంస్కరణల ఫలాలు దక్కాలి
‘‘రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలు దక్కాలి. చిట్టచివరి వ్యక్తికి ఈ అంశాలు తెలియాలి. పేదలు, మధ్యతరగతి సామాన్యులకు లబ్ది కలిగేలా తీసుకున్న సంస్కరణలు ఇవి. పౌరులందరికీ జీఎస్టీ 2.0 సంస్కరణల ఫలాలు దక్కాలి. వినియోగదారులు- వ్యాపారులకూ ఈ సంస్కరణల వల్ల లాభమే. సెప్టెంబరు 22 దసరానుంచి జీఎస్టీ 2.0 సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయి. దీనిపై ప్రజలకు మరింతగా అవగాహన కల్పించేందుకు పెద్దఎత్తున ప్రచారం చేపడతాం. దసరా నుంచి దీపావళీ వరకు ఈ ప్రచారం నిర్వహిస్తాం. దీనికోసం మంత్రివర్గ ఉప సంఘం వేస్తాం. ఈ సంస్కరణలతో రెండంకెల వృద్ధి రేటు సాధించగల ఏకైక దేశంగా భారత్ నిలుస్తుంది. ఈ సంస్కరణలవల్ల నాలుగింతల మేర వస్తు వినియోగం పెరుగుతుంది. కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. రూ.2 లక్షల కోట్లమేర దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఉపశమనం కలుగుతోంది. ఆ మేర వ్యవస్థలో ఆర్ధిక లావాదేవీలు కూడా పెరుగుతాయి. సంక్లిష్టమైన పరిస్థితులు ఉండవు. మొత్తంగా ఆర్ధిక వ్యవస్థకు చోదకశక్తిగా జీఎస్టీ 2.0 రిఫార్మ్స్ మారుతాయి’’ అని చంద్రబాబు వివరించారు.
మంచి నాయకత్వంతోనే అభివృద్ధి
‘‘2027 నాటికి మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా… 2038నాటికి రెండో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ మారుతుంది. ప్రధానిగా మోదీ సరైన నేత సరైన సమయంలో సరైన చోట ఉన్నారు. మంచి నాయకత్వం ఉంటే రాష్ట్రం, దేశం బాగుపడతాయి. పవన్ కల్యాణ్‌తో కలిసి మంచి నాయకత్వాన్ని రాష్ట్రానికి అందిస్తున్నాం. దేశాన్ని నెంబర్ 1గా చూడాలన్నది నా ఆకాంక్ష, అందులోనూ తెలుగు జాతిని అగ్రస్థానంలో చూడాలన్నదే నా లక్ష్యం. ఈ ఏడాది 12 శాతం వృద్ధి రేటు సాధించటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. గత ఐదేళ్ల విధ్వంసంవల్ల తీవ్రంగా నష్టపోయాం. జీఎస్డీపీలో రూ.6 లక్షల కోట్లు కోల్పోయాం. తద్వారా రూ.70 వేల కోట్ల వరకూ ఆదాయం కూడా పోయింది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఇబ్బంది లేకుండా పాలసీలు తీసుకువచ్చి దీర్ఘకాలిక ప్రణాళికలు చేస్తున్నాం. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన చేస్తున్నాం. జీఎస్టీ సంస్కరణలతో ఆహర ఉత్పత్తుల, నిత్యావసరాల ధరలు ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గాయి. మందుల ధరలు తగ్గుతాయి. బీమాకు జీఎస్టీ లేకపోవటం వల్ల యూనివర్సల్ హెల్త్ పాలసీలో ప్రజాధనం ఆదా అవుతుంది. అగ్రిటెక్, వ్యవసాయరంగాల్లో జీఎస్టీ తగ్గటంవల్ల ఉత్పత్తి గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
కొన్ని పార్టీలకు అర్థం కావు… సహకరించవు
‘‘చరిత్రలో జరిగే మంచి అంశాల్ని కొన్ని రాజకీయ పార్టీలు అర్ధం చేసుకోలేవు, సహకరించవు కూడా. ప్రతిపక్ష హోదా అడుగుతున్న పార్టీది అదే పరిస్థితి. ఈ సంస్కరణల్ని స్వాగతించలేని పరిస్థితుల్లో ఆ పార్టీ ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో బాధ్యతగా వ్యవహరించాలి. ప్రజలపక్షాన పనిచేయాలి. ప్రజల ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు సహకరించాలి. ప్రజా సమస్యల్ని గుర్తించి భవిష్యత్తులో ప్రజలు ఎలా ఉండాలన్న దానిపై పాలసీలు రూపొందించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలది. ఈ తరహా సంస్కరణల్ని కనీసం స్వాగతించాలి. లేదా ఆర్ధం చేసుకోవడానికైనా ప్రయత్నించాలి. ఈ రెండూ కొందరు చేయలేకపోవటం బాధాకరం. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఎక్కువ సమయం అసెంబ్లీలో గడపాలి. మంత్రులు, అధికారులు బాధ్యతగా శాసనసభలో ఉండాలి. అసెంబ్లీ 175మంది ఎమ్మెల్యేల కోసం మాత్రమే కాదు… 5 కోట్లమంది ప్రజల కోసం. వారి భవిష్యత్ కోసం అసెంబ్లీ ఏర్పాటైంది. అసెంబ్లీ అనే దేవాలయంలో ప్రజాహితం కోసం చేసే నిర్ణయాలు జరుగుతాయి. ప్రజల జీవితాల్లో మార్పుల కోసం మనమంతా కూర్చుని చర్చించాలి. దేశాన్ని, భవిష్యత్ తరాన్ని ముందుకు నడిపించగలిగిన సంస్కరణ ఇది’’ అని చంద్రబాబు అన్నారు.
ప్రజలకు మేలు జరుగుతుందనేదే సీఎం ఆలోచన: పయ్యావుల
ఇక అసెంబ్లీలో మరో తీర్మానాన్ని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందిస్తూ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. జీఎస్టీ రెండోతరం సంస్కరణలకు మద్దతు తెలిపిన ముఖ్యమంత్రిని సభ అభినందించింది. జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్ర ఆదాయం కొంతమేర తగ్గుతున్నా… విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబే తొలిసారిగా సంస్కరణలను ఆమోదించారని పయ్యావుల అన్నారు. రాష్ట్రానికి ఆదాయం తగ్గినా, ప్రజలకు లబ్ది చేకూరుతుందనేదే ముఖ్యమంత్రి ఆలోచనని చెప్పారు. రూ.8వేల కోట్లు నష్టం వస్తుందని ఆర్థిక శాఖ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్తే… ప్రజలకు రూ.8 వేల కోట్ల లబ్ది చేకూరుతుంది కదా అని సీఎం అన్నారని పయ్యావుల గుర్తు చేసుకున్నారు. ప్రజల సంక్షేమాన్ని, ఆర్థిక సుస్థిరతను దృష్టిలో పెట్టుకుని సంస్కరణలను సీఎం మద్దతు తెలిపారన్నారు. జీఎస్టీ సంస్కరణలకు చంద్రబాబు మద్దతిచ్చారని తెలియగానే… జీఎస్టీ సంస్కరణలపై అందరిలోనూ ఓ పాజిటివ్ ధృక్కోణం ఏర్పడిరదని పయ్యావుల వివరించారు.