- అదే మన లక్ష్యం
- అందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి
- ఐటీఐల అభివృద్ధికి మిషన్ మోడ్లో చర్యలు
- స్కిల్ డెవలప్మెంట్ సమీక్షలో మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్యరథం): ఓం క్యాప్ ద్వారా రాబోయే అయిదేళ్లలో లక్ష బ్లూ కాలర్ ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వలక్ష్యమని, ఇందుకు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు రూట్ మ్యాప్ రూపొందించి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి నారా లోకేష్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… నర్సింగ్, వెల్డర్స్, ట్రక్కర్స్, బిల్డింగ్ వర్కర్లకు యూరప్ తోపాటు జర్మనీ, జర్మనీ, ఇటలీల్లో మంచి డిమాండ్ ఉందని తెలిపారు. నర్సింగ్, ఐటిఐ, పాలిటెక్నిక్ విద్యనభ్యసించిన యువతీయువకులకు ఆయా భాషల్లో శిక్షణ ఇచ్చి, విదేశాల్లో ఉద్యోగాలు లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి కేరళ మోడల్ను అధ్యయనం చేయాలన్నారు. యూరప్ జీసీసీల్లో డిమాండ్ ఉన్న ఉద్యోగాలపై దృష్టిసారించి, అందుకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం ఓంక్యాప్ ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 2,774 మంది నర్సింగ్ అభ్యర్థులు విదేశీభాషల్లో శిక్షణ పొందుతున్నారని అధికారులు తెలిపారు. జర్మనీ, ఇతర విదేశీ భాషల్లో శిక్షణ కోసం DEFA, TELC (The European Language Certification) జర్మన్ లాంగ్వేజెస్ ఎసెస్మెంట్ సెంటర్ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఎంఓయూ చేసుకున్నట్లు చెప్పారు. నైపుణ్యం పోర్టల్పైనా మంత్రి లోకేష్ సమీక్షించారు. ఇందులో 23 విభాగాల డేటా బేస్ ను ఇంటిగ్రేట్ చేసినట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో నెలకొని ఉన్న 4,639 భారీ, మధ్యతరహా పరిశ్రమలతో సంప్రదించి వారికి అవసరమైన విధంగా వర్క్ ఫోర్స్ను సిద్ధం చేయాలని సూచించారు. వచ్చేనెలలో పోర్టల్ ప్రారంభించే సమయానికి ఉద్యోగాలకు సంబంధించి సంపూర్ణ సమాచారాన్ని యువతకు అందుబాటులోకి తేవాలని చెప్పారు.
మిషన్ మోడ్లో ఐటీఐల అభివృద్ధి రాష్ట్రంలోని 83 ప్రభుత్వ ఐటీఐలను మిషన్ మోడ్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఐటీఐల్లో మౌలిక సదుపాయాలు, ఆధునీకరణ పనుల కోసం రూ.322 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఐటీఐలల్లో ప్రస్తుతం అడ్మిషన్లు పెరిగాయని, అయితే సిబ్బంది కొరత ఉన్నట్లు మంత్రి దృష్టికి తెచ్చారు. మంత్రి మాట్లాడుతూ పీఎం వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన, పీఎం ఇంటర్న్ షిప్ ల్లో ఏపీని నెం.1గా నిలపాలన్నారు. ఐటీఐల్లో కరిక్యులమ్, టెస్టింగ్, ఇంటర్న్ షిప్, సర్టిఫికేషన్, ప్లేస్మెంట్స్ మెరుగుదలకు చర్యలు చేపట్టాలని సూచించారు. పీఎం సేతు పథకం కింద ఐటీఐల అప్ గ్రేడేషన్కు గల అవకాశాలపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో 87 పాలిటెక్నిక్ లకు సంబంధించి 646 టీచింగ్, 2183 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి దృష్టికి అధికారులు తెచ్చారు.
పాలిటెక్నిక్ కళాశాలలను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు దేశంలోని సక్సెస్ మోడల్ను అధ్యయనం చేయాలని మంత్రి ఆదేశించారు. హబ్ అండ్ స్పోక్ మోడల్లో విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 3 హబ్లు, వాటిని అనుబంధంగా 13స్పోక్స్ ల్లో ఐటీఐలను అభివృద్ధి చేయడానికి త్వరితగితిన ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి లోకేష్ చెప్పారు. ఆర్సెలర్ మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్స్ అనుబంధ సంస్థ నామ్ టెక్ (New Age Makersu Institute of Technology) రాష్ట్రంలో నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినట్లు చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర మానవవనరుల శాఖ కార్యదర్శి కోన శశిధర్, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సీఈఓ గణేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.