- ఇందుకోసం అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి
- రూ.9.23 కోట్లతో నంద్యాల జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతులు
- పేద విద్యార్థుల కోసం మా ప్రభుత్వం ఎంత ఖర్చునైనా భరిస్తుంది
- గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ
- మంత్రి డా. డోలా శ్రీ వీరాంజనేయ స్వామి
నంద్యాల (చైతన్యరథం): వసతి గృహాల్లో వంద శాతం సామర్థ్యం మేరకు పిల్లలు ఉండేలా చర్యలు తీసుకోవాలని.. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పూర్తి స్థాయిలో పిల్లలు ఉండేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని అధికారులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ వీరాంజనేయ స్వామి ఆదేశించారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సంక్షేమ, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ, ఎస్సీ కార్పొరేషన్, గ్రామ, వార్డు సచివాలయాల అంశాలపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ…. నంద్యాల జిల్లాలో వసతి గృహాల మరమ్మత్తులకు సంబంధించి రూ.9.30 కోట్ల నిధులను విడుదల చేశామన్నారు. పనులన్నీ నాణ్యతగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఉన్న పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లో కొన్నిచోట్ల వంద శాతం పైగా సీట్లు భర్తీ చేసినందుకు జిల్లా కలెక్టర్‌ను, యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు.
ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ పోస్ట్, ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లో పిల్లలను చేర్చడం శుభపరిణామం అన్నారు. అదే విధంగా ఇంకా ఎక్కువ సీట్లు కావాలని కూడా దరఖాస్తులు వస్తున్నాయని, అందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో వేల్పనూరు, వెంకటాపురం, శ్రీశైలం, ఆత్మకూరు, నందికొట్కూర్, డోన్, బనగానపల్లి, నంద్యాల, కోవెలకుంట్ల వసతి గృహాల్లో తక్కువ శాతం అడ్మిషన్స్ ఉన్నాయని, స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వంద శాతం విద్యార్థులు ఉండేలా చూడాలన్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి వసతి గృహ సంక్షేమ అధికారులు కట్టుబడి ఉండాలన్నారు. అదే విధంగా ఉపాధ్యాయులు కూడా స్పెషల్ క్లాసులు నిర్వహించి చదువులో వెనుకబడి ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ముఖ్యంగా వసతి గృహాల్లో రాత్రి వేళల్లో పోలీసు పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు జిల్లా ఎస్పీకి లేఖ రాయాలని కలెక్టర్‌కు మంత్రి సూచించారు. అదే విధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిర్వహిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్‌ల వివరాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా విద్యార్థినిల వసతి గృహాల్లో మగవారు పని చేస్తుంటే వెంటనే తొలగించాలని, కేవలం మహిళా సిబ్బంది మాత్రమే విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనారోగ్యం లేదా ఇతరత్రా కారణాలతో వసతిగృహాల్లోని విద్యార్థులు ఇంటికి వెళ్లే సమయంలో వారు ఇంటికి చేరుకునే వరకు వసతి గృహాల వార్డెన్లు, ఏఎస్‌డబ్ల్యుఓలు బాధ్యత తీసుకోవాలన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులకు మెసేజ్ ఇవ్వాలని సూచించారు. డా.బీఆర్ అంబేద్కర్ గురుకులానికి సంబంధించి వసతి గృహాల్లో రక్త హీనత ఉన్న విద్యార్థినిలకు సరైన పోషకాలు అందజేయాలన్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖకు సంబంధించి ప్రతి సోమవారం ఉమ్మడి జిల్లాలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలని సంబంధిత శాఖ అధికారిని మంత్రి ఆదేశించారు. అదే విధంగా గురుకులం పాఠశాలలో డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
త్వరితగతిన నిర్మాణాలు
వసతి గృహాల్లో సంబంధిత శాఖలు చేపడుతున్న నిర్మాణాలపై పూర్తి స్థాయిలో మంత్రి సమీక్ష నిర్వహించి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు. అదే విధంగా అన్ని వసతి గృహాలకు దోమ తెరలు ఏర్పాటు చేయడంతో పాటు వాష్ రూమ్స్‌లో లైట్లు, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. వసతి గృహాల ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. వసతి గృహాలకు ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేసి, కాంపౌండ్ వాల్ ఎత్తు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. వసతి గృహాల్లో చదువుకునే పదో తరగతి విద్యార్థులు 5 మంది, జూనియర్ ఇంటర్మీడియట్ లో 124 మంది, ద్వితీయ ఇంటర్లో 31 మంది ఫెయిల్ అయ్యారని, దీనిపై హాస్టల్ వార్డెన్స్, ఏఎస్‌డబ్ల్యూఓ లను కారణాలు అడిగి తెలుసుకుని తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. పిల్లలను ఉత్తీర్ణులను చేసే బాధ్యత మీపై ఉందని పేర్కొన్నారు. ఇటీవల ఇంటర్, టెన్త్‌లో మార్కులు బాగా వచ్చిన పిల్లలకు నగదు పురస్కారం అందజేశామని, ఇది ఇతర పిల్లలకు ప్రోత్సాహంగా పనిచేస్తుందన్నారు. వసతి గృహాల్లో ఉండే వారికి రక్తహీనత లేకుండా చూడాలని, వ్యాధులు సోకకుండా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించి చర్యలు తీసుకోవాలని, అలాగే పాముకాటు, కుక్క కాటు, ఎలుక కాటులకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో ఉన్న షాపు కాంప్లెక్స్ భవనాలన్నింటికీ పెయింటింగ్స్ వేయించి రెంట్లకు ఇవ్వాలన్నారు. జిల్లాలో మొత్తంగా ఏడు షాపింగ్ కాంప్లెక్సులు, 57 షాప్స్ ఉన్నాయని, ఇందులో 46 నిర్వహణలో ఉన్నాయన్నారు.
మిగిలిన వాటిని కూడా అవసరమైన మరమ్మత్తులు చేయించి నిర్వహణలోకి తీసుకురావాలని చెప్పారు. జిఎస్‌డబ్ల్యూఎస్ కు సంబంధించి ఏబీసీ కేటగిరీలో డిజిగ్నేటెడ్ పోస్ట్‌లన్నీ భర్తీ చేశామన్నారు. వికలాంగ శాఖ ద్వారా త్రీ వీలర్ ట్రై సైకిల్ ఇస్తున్నామని, అవే కాకుండా ఆర్టిఫిషియల్ కాళ్లు, చేతులు, వినికిడి మిషన్లు కూడా ప్రభుత్వం అందజేస్తుందని ఈ విషయంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని వికలాంగ శాఖ అధికారులను ఆదేశించారు. చెవిటి, మూగ పాఠశాలల్లోని బాత్రూంల్లో కాలింగ్ బెల్స్ ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. గురుకుల విద్యార్థులకు ప్రమాదం జరిగితే సాంత్వన పథకం కింద మూడు లక్షలు ఇస్తున్నామని, సంక్షేమం కింద హెల్త్ వింగ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వసతిగృహాల్లోని పిల్లల సంక్షేమంపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిధులు కేటాయిస్తున్నారని వాటిని సద్వినియోగం చేసి ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకంగా నిలిపేందుకు అధికారులు బాధ్యతాయుతంగా కృషి చేయాలని మంత్రి డా. స్వామి పేర్కొన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో ఫీడర్ స్కూల్స్ కాలేజీలను కోఆర్డినేట్ చేసి వాటిని బలోపేతం చేసేందుకు ఎమ్మెల్యేతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు