- మంత్రి లోకేష్‌కు మహిళా వర్సిటీ విద్యార్థినుల కృతజ్ఞతలు
- రీసెర్చి, ఇన్నొవేషన్స్‌పై దృష్టి పెట్టి మంచి పేరు తేవాలన్న లోకేష్
- ఇకపై సెమిస్టర్ వారీగా రీయింబర్స్‌మెంట్ విడుదలకు హామీ
- సంస్కరణల కోసం చంద్రబాబుతో పోరాడుతున్నానంటూ ఛలోక్తి
- పద్మావతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినులతో మంత్రి లోకేష్ భేటీ
తిరుపతి (చైతన్య రథం): గత ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వస్తాయో, రావోనన్న ఆందోళనతో చదువుపై దృష్టిపెట్టలేని పరిస్థితులు ఉండేవి. మీరు అధికారంలోకి వచ్చాక బకాయిలు లేకుండా రీయింబర్స్‌మెంట్ సొమ్ము జమ చేస్తుండటంతో టెన్షన్ లేకుండా చదువుకోగలుగుతున్నాం’ అని పద్మావతి మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పద్మావతి యూనివర్సిటీ అధునాతన ఇండోర్ స్టేడియంను ప్రారంభించిన అనంతరం ట్రిపుల్ ఈ థర్డ్ ఇయర్ విద్యార్థినుల తరగతి గదిని సందర్శించిన లోకేష్… వారి సాదకబాధకాలు తెలుసుకున్నారు. చంద్రగిరికి చెందిన మేఘన మాట్లాడుతూ… ‘మీ తాతగారు ఎన్టీఆర్ హయాంలో తిరుపతిలో మహిళా వర్సిటీ ఏర్పాటుచేశారు. రాష్ట్ర విద్యా మంత్రిగా మా సమస్యలపై మీరు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నందుకు ఆనందంగా ఉంది. గతంలో రీయింబర్స్‌మెంట్ సొమ్ము ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో, రాదోనన్న ఆందోళనకు గురయ్యేవాళ్లం. కూటమి ప్రభుత్వం వచ్చిక మొదటి సెమిస్టర్‌కు సంబంధించిన సొమ్ము బకాయి పెట్టకుండా విడుదల చేయడం ఆనందంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలోని బకాయిలను కూడా విడుదల చేయండి’ అని కోరారు.
మంత్రి లోకేష్ స్పందిస్తూ… ఇకపై ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్మును సెమిస్టర్ వారీగా విడుదల చేస్తాం. గత ప్రభుత్వం సుమారు రూ.4వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టివెళ్లింది. రాష్ట్రం ఆర్థికంగా కుదుటపడ్డాక విడతలవారీ గత బకాయిలనూ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. తిరుపతికి చెందిన విజయలక్ష్మి అనే విద్యార్థిని మాట్లాడుతూ… ‘ఇంజనీరింగ్ పూర్తయ్యాక వివిధ అనుబంధ కోర్సులు నేర్చకోవడానికి పెద్దఎత్తున ఖర్చుచేయాల్సి వస్తోంది. యూనివర్సిటీలోనే ఉద్యోగాలకు అవసరమైన కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలి’ అని కోరారు. మంత్రి లోకేష్ స్పందిస్తూ… టెక్నాలజీలో ర్యాపిడ్‌గా మార్పులు వస్తున్నాయి. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా విద్యార్థినులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఉన్నత విద్యా విభాగాన్ని బలోపేతం చేస్తున్నాం. ఇటీవలే విద్యాధికుడైన చైర్మన్‌ను నియమించామని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఏపీ విద్యార్థులు రాణించేలా యూనివర్సిటీ విద్యావిధానంలో సమూల మార్పులు తెస్తామన్నారు. ప్రభుత్వంతోపాటు ప్రైవేటు ఇంజనీరింగ్ విద్యను కూడా సమాంతరంగా అభివృద్ధి చేసి, విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తామని లోకేష్ చెప్పారు. మౌనిక అనే విద్యార్థిని మాట్లాడుతూ… ‘విద్యతోపాటు స్పోర్ట్స్‌కు ప్రోత్సాహం కల్పించాలి’ అని కోరారు.
విద్యాబోధన ఎలా ఉందని మంత్రి లోకేష్ ఆరాతీయగా, వర్సిటీలో టీచింగ్ చాలా బాగుందని విద్యార్థినులు చెప్పారు. రాజకుమారి అనే విద్యార్థిని మాట్లాడుతూ… వర్సిటీలో అందించే ఆహారం కొంచం ఇబ్బందికరంగా ఉంది. మార్పులు చేయాలని కోరారు. రెండు వారాల్లో సరిచేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. వర్సిటీలో ఏర్పాటు చేసిన కొత్త ఇండోర్ స్టేడియంలో 20రోజుల్లో అధునాతన పరికరాలు అందుబాటులోకి వస్తాయని హామీ ఇచ్చారు. వర్సిటీలో ట్రిపుల్ ఈ విద్యను అభ్యసించిన వారికి ప్లేస్‌మెంట్స్ 36శాతం మందికే వచ్చాయి. ఈ విషయంలో శ్రద్ధ వహించాలని విద్యార్థినులు కోరారు. ట్రిపుల్ ఈ విద్యార్థులకు ఐటిలో శిక్షణ ఇవ్వాలని విద్యార్థినులు విజ్ఞప్తిచేశారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌లో సైతం మంచి అవకాశాలు ఉన్నాయి. రీసెర్చి, ఇన్నొవేషన్స్‌పై దృష్టి పెట్టండి. యూనివర్సిటీకి అంతర్జాతీయస్థాయి ఖ్యాతి లభించేలా అధునాతన ఆవిష్కరణలు చేయాలని కోరారు. కడపకు చెందిన సరీమ్ మాట్లాడుతూ వర్సిటీ హెల్త్ సెంటర్‌లో జనరల్ డాక్టర్‌తోపాటు సైకాలజిస్ట్‌ను కూడా ఏర్పాటు చేయాలని కోరారు మంత్రి లోకేష్ మాట్లాడుతూ… జీవితం అంతా మనం అనుకున్నట్టు ఉండదు. ఒడిదుడుకులు, అవాంతరాలు ఉంటాయి. నేను 2019లో మంగళగిరిలో ఓటమి చెందినపుడు బాధపడ్డా. తర్వాత ప్రజలతో మమేకమై ఐదేళ్లు సేవచేశా. రాష్ట్రంలో 3వ అతిపెద్ద మెజారిటీతో అక్కడి ప్రజలు తనను గెలిపించారని అన్నారు.
శిరీష అనే విద్యార్థిని మాట్లాడుతూ… ట్రిపుల్ ఈలో 70మంది వరకు విద్యనభ్యసిస్తున్నాం. ఉద్యోగావకాశాలు తక్కువగా ఉంటున్నాయి. తాము 4వసంవత్సరం కోర్సు పూర్తిచేసే లోగానే వివిధ ఉద్యోగాలకు సంబంధించిన కోచింగ్ ఇప్పించండి. ప్లేస్‌మెంట్ కౌన్సిలింగ్‌కు ముందే తమకు శిక్షణనిస్తే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. లైబ్రరీలో సరిపడా పుస్తకాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తిచేశారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ట్రిపుల్ ఈ విద్యార్థినుల ప్లేస్‌మెంట్స్‌కు ఎటువంటి ఢోకా లేదు. రేణిగుంట, కడపల్లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఏర్పాటుచేశాం. కొత్తపరిశ్రమలు రావడానికి అవసరమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం. డిజైనింగ్‌కు సంబంధించిన యూనిట్లు కూడా వస్తున్నాయని వివరించారు. హాస్టల్‌లో సోలార్ వాటర్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని పలువురు విద్యార్థినులు కోరారు. హాస్టల్, తరగతి గదుల్లో మరమ్మతులు వచ్చినపుడు వెనువెంటనే చేపట్టాలని అన్నారు. విద్యార్థినులు చెప్పిన సమస్యలన్నింటినీ నోట్ చేసుకున్న మంత్రి లోకేష్ మాట్లాడుతూ… రాబోయే మూడునెలల్లో అన్ని యూనివర్సిటీల్లో నిర్మాణాత్మకమైన మార్పులు తెస్తామని, విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం తాను జగన్మోహన్‌రెడ్డిపై చేసిన పోరాటంకంటే మూడురెట్లు అధికంగా చంద్రబాబుతో పోరాడుతున్నానని చమత్కరించారు. సంస్కరణల అమలుకు విద్యార్థినులు అందించిన ఫీడ్‌బ్యాక్ తమకు ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు.