దీపావళి నుంచే సిలిండర్ల హామీ అమలు
మహిళలకు ముఖ్యమంత్రి కానుక
‘సూపర్ సిక్స్’లో ఎన్డీయే తొలి సిక్సర్
మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..
అర్హులందరికీ మూడు ఉచిత సిలిండర్లు
‘దీపం’.. గొప్ప ముందడుగు: సీఎం చంద్రబాబు
24నుంచే బుకింగులకు ముఖ్యమంత్రి ఆదేశం
ఏటా ప్రభుత్వంపై రూ.2,684 కోట్ల భారం
ఐదేళ్లలో రూ.13.423 వేల కోట్లు..
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపావళి కానుక ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఐదు సంతకాలతో మేనిఫెస్టో హామీలను, అన్న క్యాంటీన్ల వంటి కార్యక్రమాలను అమల్లోకి తెచ్చిన కూటమి ప్రభుత్వం… ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాల అమలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా 31నుంచి దీపావళి సందర్భంగా దీపం పథకాన్ని మహిళలకు అందించనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటిగా దీపం పథకం కింద ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా దీపం పథకాన్ని దీపావళి సందర్భంగా ప్రారంభించనున్నారు. మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని…. దీపావళి నుంచి సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో భాగమైన దీపం పథకం అమలు గొప్ప ముందడుగని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీపం పథకంతో ఈ దీపావళి పండుగ ఇళ్లల్లో వెలుగులు తెస్తుందని సీఎం అన్నారు. కార్యక్రమంపై సోమవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, ఆ శాఖ అధికారులు, చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులతో సీఎం సమీక్షించారు. దీపం పథకం అమలు, విధివిధానాలపై సమీక్ష నిర్వహించారు. ఆర్థిక సమస్యలు ఉన్నా…. పేదలకు మేలు చేసే సంక్షేమ పథకాలు విషయంలో ప్రభుత్వం ముందడుగు వేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందులోభాగంగా ఈనెల 31న దీపావళి పథకం ప్రారంభించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అర్హులైన మహిళలందరికీ పారదర్శక విధానంలో ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించడం జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కలిగి, అర్హతగల ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని వర్తింప చేయాలన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం అమలులో భాగంగా ప్రతి నాలుగు నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఆయా లబ్దిదారు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ఈనెల 24 నుండి బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని, ఈనెల 31నుంచి గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభించడం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్ తీసుకున్న లబ్దిదారులకు రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీని జమచేయాలని, ఆవిధంగా ప్రణాళిక సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు. మహిళలకు ఇంటి ఖర్చులు తగ్గించాలనే ఆలోచనతో ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చామని…. ఇప్పుడు మళ్లీ మూడు గ్యాస్ సిలిండర్ల ద్వారా వారికి ఎంతో మేలు జరుగుతుందని సీఎం వ్యాఖ్యానించారు. వంట గ్యాస్ కోసం వెచ్చించే ఖర్చును గృహిణులు ఇతర అవసరాలకు వాడుకోవచ్చని సీఎం అన్నారు. పేదల జీవన ప్రమాణాలు పెంచడంలో ఇలాంటి పథకాలు దోహదం చేస్తాయన్నారు. అందుకే ఆర్థిక కష్టాలున్నా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని సీఎం అన్నారు. అర్హతగల ఏ ఒక్క లబ్దిదారునికి ఈ పథకం వర్తింపచేయలేదన్న విమర్శ రాకుండా కట్టుదిట్టంగా కార్యక్రమాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సమావేశంలో తొలుత రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్యదర్శి వీరపాండ్యన్ ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి పవర్ పాంయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ రిటైల్ మార్కెట్ ధర రూ.876లు కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్‌కు రూ.25ల సబ్సిడీ ఇస్తుండగా, ప్రస్తుతం ప్రతి సిలిండర్ ధర రూ.851లుగా ఉందని వివరించారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వల్ల ప్రభుత్వంపై రూ.2 వేల 684 కోట్ల భారం పడుతుందని, అదే ఐదేళ్ళకు కలిపి రూ.13వేల 423 కోట్ల భారం పడుతుందని వివరించారు.