అమరావతి (చైతన్యరథం): ఈ నెల 9న విశాఖ డెయిరీని సందర్శించాలని సభా సంఘం నిర్ణయించింది. విశాఖ డెయిరీలో అక్రమాలు, అవినీతిపై జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన సభా సంఘం ఏర్పాటయిన విషయం తెలిసిందే. ఈ సభా సంఘం మంగళవారం సచివాలయంలో సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ఈ నెల 9న విశాఖ డెయిరీని సందర్శించాలని సభా సంఘం సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సంఘం చైర్మన్ జ్యోతుల నెహ్రూ తెలిపారు. అదే రోజు సాయంత్రం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమై వివరాలు తెలుసుకుంటామన్నారు. విశాఖ డెయిరీ యాజమాన్యం.. రైతుల సంక్షేమం వదిలి సొంత లాభం చూసుకుంటోందనే ఆరోపణలు, ఇతర అభియోగాలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. విచారణ ఏ విధంగా ప్రారంభించాలనే అంశంపై ప్రాథమికంగా చర్చించామని తెలిపారు. సభా సంఘం విచారణకు విశాఖ డెయిరీ ఎండీ, ఆర్థిక లావాదేవీలు చూసే అధికారులు రావాల్సి ఉంటుందన్నారు. కంపెనీస్ యాక్ట్‌పై అవగాహన ఉన్నవారిని కూడా మా బృందంలో చేర్చుకుంటామని తెలిపారు. పాడి రైతులు నష్టపోకూడదనే కోణంలోనే మా సిఫార్సులు ఉంటాయని స్పష్టం చేశారు. కాగా సభా సంఘం సభ్యుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే డెయిరీలో అవకతవకలు జరగాయనే ఆరోపణలున్నాయన్నారు. విశాఖ డెయిరీ కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా నష్టనివారణ చర్యలు తీసుకుంటామన్నారు. ట్రస్ట్ నిధుల మళ్లింపుపైనా సమగ్ర నివేదికను సభ ముందు ఉంచుతామని తెలిపారు.