- వివిధ సంస్థల పెట్టుబడులకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్
- ఎస్ఐపీబీ నిర్ణయాలకూ కేబినెట్ ఆమోదం.
- పర్యాటకాభివృద్ధికి భారీగా పెట్టుబడుల ఆకర్షణ
- రూ.87 వేల కోట్లతో విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటు
- గూగుల్ డేటా సెంటర్ కు 480 ఎకరాల కేటాయింపు
- ప్రకాశం జిల్లా దొనకొండ వద్ద బీడీఎల్ ఏర్పాటు
- రూ.1,200 కోట్లతో నెలకొల్పే ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్
- గ్రామ పంచాయతీల పునఃవర్గీకరణకు నిర్ణయం
- స్వతంత్ర యూనిట్లుగా 13,351 పంచాయతీలు.
- ఆదాయాన్నిబట్టి పంచాయతీలను 4 గ్రేడ్లుగా విభజన
- పంచాయతీ సెక్రెటరీలను.. డీవోలుగా మార్చేందుకు ఓకే
- అమరావతిలో రూ.212 కోట్లతో రాజ్భవన్ నిర్మాణం
- కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి కొలుసు
అమరావతి (చైతన్య రథం): మొత్తం రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల 78,771 ఉద్యోగాలకు అవకాశం ఏర్పడుతుంది. శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఇవాళ జరిగిన క్యాబినెట్ మీటింగ్ రాష్ట్ర ఆర్థిక పురోగతి, ఏఐ అభివృద్ధికి ఉపయోగపడుతుందని అన్నారు. ఎస్ఐపీబీ మీటింగ్లో చర్చించిన నిర్ణయాలకూ క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు స్పష్టం చేశారు. గడిచిన 15 నెలల కాలంలో రాష్ట్రాభివృద్ధి, పజల శ్రేయస్సుకు అనేక పాలసీలు ఇచ్చామని కొలుసు పార్థసారథి వెల్లడించారు. వివిధ పాలసీలకు అనుగుణంగా ప్రోత్సాహకాలు ఇచ్చి రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు చెప్పారు. సుమారు 70వేల ఉద్యోగాలు వచ్చేలా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. అలాగే టాటా పవర్ రెన్యూవబుల్ లిమిటెడ్ ప్లాంటు, చింతా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు పేర్కొన్నారు.
అనకాపల్లి జిల్లాలో అధునాతన కార్బన్ కాంప్లెక్స్ తయారీ, పలనాడు జిల్లాలో సిమెంట్ ప్లాంట్ మరియు గుడిపల్లి మరియు టేకులోడు (అనంతపురం జిల్లా)లో ఏరోస్పేస్ అండ్ ఆటోమోటివ్ కాంపోనెంట్ తయారీ పరిశ్రమల స్థాపనకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందన్నారు.
ఈ ప్రాజెక్టులు మొత్తం రూ.5,800 కోట్ల రూపాయల పెట్టుబడి లక్ష్యంకాగా.. 6,646మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయన్నారు. ప్రకాశం జిల్లాలో ప్రొపెల్లెంట్ ప్లాంట్కు, కర్నూలు జిల్లాలో పారిశ్రామిక ఎస్టేట్ అభివృద్ధికి, విశాఖపట్నం జిల్లాలో పారిశ్రామిక మరియు లాజిస్టిక్స్ హబ్కు, కర్నూలు జిల్లాలో ఇన్నోవేషన్ సెంటర్కు, విజయనగరం జిల్లాలో ప్రయివేట్ మెగా పార్కు భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదించిందన్నారు. 56,353 ఉద్యోగావకాశాల కల్పన లక్ష్యంగా రూ.8,186 కోట్ల రూపాయల పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ కేటాయింపులు జరిగాయన్నారు. ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులలో విశాఖపట్నంలో డేటా సెంటర్, ఐటీ క్యాంపస్ను ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. అమరావతిలో ఫోర్ స్టార్ హెూటళ్లు, విశాఖపట్నం జిల్లా అరకు వ్యాలీలో లగ్జరీ రిసార్ట్, శ్రీశైలం (నంద్యాల జిల్లా)లో త్రీ స్టార్ హెూటల్, కాకినాడ జిల్లాలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం లభించింది. సౌర విద్యుత్ మరియు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు అనంతపురం, విజయనగరం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోను, కర్నూలు, ఏలూరు మరియు చిత్తూరు జిల్లాల్లో ఆహార ప్రాసెసింగ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ ఓకే చెప్పింది. జూన్ 2024లో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర మంత్రివర్గం 149 ప్రతిపాదనలను ఆమోదించి.. 7.37 లక్షల కోట్ల పెట్టుబడులకు, 6.97 లక్షలమంది ఉపాధి కల్పనకు అవకాశం కల్పించినట్టు వివరించారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి పెద్దపీట వేశామన్నారు. వాటికి కావలసిన ప్రోత్సాహకాలను అందజేయటం, భూములను తక్కువ ధరలకే కేటాయించడం ద్వారా ఈ రంగ అభివృద్ధికి ప్రభుత్వం దోహదపడుతుందని వివరించారు. ఏడు పర్యాటక ప్రాజెక్టులకు రాష్ట్రమంత్రి మండల ఆమొదించిందని, ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు రూ.1,628.8 కోట్ల పెట్టుబడులకు అవకాశం కలిగిందన్నారు. అలాగే, 4,398 మందికి ప్రత్యక్షంగాను, కొన్ని వేలమందికి పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగునున్నాయని మంత్రి కొలుసు వివరించారు.
పర్యాటకరంగానికి సంబంధించి నేడు కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు కొత్త శకానికి నాంది పలుకుతున్నాయన్నారు. మారియట్, హిల్టన్, దస్పల్ల, ఓబెరాయ్, తాజ్వంటి అంతర్జాతీయ బ్రాండ్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంవల్ల ఏపీ పర్యాటక రంగానికి ప్రపంచస్థాయి గుర్తింపు లభిస్తుందని అభిప్రాయపడ్డారు. అమరావతి, శ్రీశైలం, విశాఖపట్నం, అరకు వ్యాలీ, తిరుపతివంటి ముఖ్యమైన పర్యాటక కేంద్రాలలో హోటళ్లు, రిసార్ట్స్ు అభివృద్ధి చేయడం ద్వారా దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఏపీ టూరిజం పాలసీ 2024-29 ప్రకారం అందించబడుతున్న ప్రోత్సాహకాలు, సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థ మరియు పారిశ్రామిక రేట్లలో యుటిలిటీ సేవలు పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని మంత్రి కొలుసు వివరించారు.
తోటపల్లి బ్యారేజినుంచి 24 ఎంసీఎం నీటిని ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. దీనితోపాటు ఎవాపరేషన్ లాసెసూ నీటిని కేటాయించినట్టు తెలిపారు. రిలయన్స్ కన్స్యూమర్ ప్రాడెక్ట్ల కింద కర్నూలు జిల్లాలో రూ.758 కోట్లతో ఫ్యాక్టరీ నెలకొల్పడానికి ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. దీనిద్వారా 500మందికి ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకోనున్నట్టు వివరించారు. టూరిజం పాలసీ ఒక గేమ్ ఛేంజర్. అందుకే దానిపై కేబినెట్ ప్రత్యేక దృష్టిపెట్టినట్లు చెప్పుకొచ్చారు. దాని కోసం ప్రత్యేకమైన ల్యాండ్ పార్సిల్స్ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. శ్రీశైలం ఆలయాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. పలు సంస్థలకు భూ కేటాయింపులు, సబ్సిడీలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
మంత్రివర్గం నాలుగు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీలను ఆమోదించింది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్క కర్నూల్ బ్రహ్మణపల్లిలో 90 ఎకరాల్లో ఫుడ్ పార్క్ స్థాపనకు రూ.758 కోట్ల పెట్టుబడితో 500 ఉద్యోగావకాశాల కల్పనకు ఆమోదం లభించింది. గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్కు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో క్రూడ్ పామ్ కెర్నల్ ఆయిల్ రిఫైనరీ, స్పెషాలిటీ ఫ్యాట్స్ యూనిట్ కోసం 20 ఎకరాల్లో రూ.208 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. సోయా ప్రైవేట్ లిమిటెడ్కు చిత్తూరు జిల్లా గుదుపల్లె మండలంలో రిఫైన్డ్ నూనెలు, సోయా ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ కోసం రూ.201 కోట్ల పెట్టుబడితో 436 మందికి ఉద్యోగాలను కల్పించనున్న యూనిట్ ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఫ్రెష్ బౌల్ హార్టికల్చర్ ప్రైవేట్
లిమిటెడ్కు కర్నూలు ఓర్వకల్లులో మష్రూమ్ యూనిట్ విస్తరణకు రూ.33 కోట్ల పెట్టుబడితో 200 మందికి ఉద్యోగావకాల కల్పనకై ప్రత్యేక ప్రోత్సాహకాల
మంజూరుకు కేబినెట్ ఓకే చెప్పిందని మంత్రి వివరించారు. గ్రామ పంచాయతీల పునర్ నిర్మాణం, పునఃవర్గీకరణ చేపట్టేందుకు చేసిన ప్రతిపాదనకు
మంత్రిమండలి ఆమోదించిందన్నారు. ఈ నిర్ణయం గ్రామ పంచాయతీ పరిపాలనలో 48 ఏళ్ల తరువాత జరుగుతున్న అతిపెద్ద సంస్కరణగా నిలుస్తుందని
మంత్రి కొలుసు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 7,244 గ్రామ పంచాయతీ క్లస్టర్లను రద్దుచేసి.. మొత్తం 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా పరిగణించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఓకే చెప్పింది. పంచాయత్ సెక్రటరీ పోస్టులను స్పెషల్ గ్రేడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా, డిప్యూటీ మండల్ పరిషత్ అభివృద్ధి అధికారి కేడర్లో అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. ఐదు ఉన్న గ్రేడ్లను మూడు గ్రేడ్లుగా కలపడం ద్వారా పంచాయత్ సెక్రటరీ పోస్టుల హేతుబద్ధీకరణ జరుగుతుంది. పంచాయత్ సెక్రటరీ పదనామాన్ని పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పునఃనామకరణం చేయడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. సమావేశంలో సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు ప్రకర్ జైన్ పాల్గొన్నారు.