ఎన్టీఆర్... ఈ మూడక్షరాల పదం వింటే ప్రతి తెలుగు హృదయంలో తెలియని భావోద్వేగం ఉప్పొంగుతుంది. మిలీనియం తరానికి కూడా ఎన్టీఆర్ అన్న పేరు విన్నప్పుడల్లా... ఆ పేరుతో ఏదో కనెక్షన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కారణం... వాళ్ళ ఇళ్లల్లోని సినీ అభిమానం కలిగిన ఒక తరం ఎన్టీఆర్ సినిమాల గురించి పరవశిస్తూ మాట్లాడుతుంది. పురాణం పురుషుల పాత్రల్లో దైవత్వం, సౌజన్యం, రాజసం, పరాక్రమం... వీటన్నిటినీ కనబరచిన ఎన్టీఆర్ తేజోమయ రూపాన్ని వర్ణిస్తూ మాట్లాడుతుంది. రాజకీయ చైతన్యం కలిగిన ఇంకో తరం ఎన్టీఆర్ రాజకీయ సంచలనాల గురించి... తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ పరిరక్షించిన తీరు గురించి మాట్లాడుతుంది. పిల్లలకు స్ఫూర్తి పాఠాలు చెప్పాలనుకున్న మరో తరం
ఎన్టీఆర్ క్రమశిక్షణ, పట్టుదల, శ్రమ, నిజాయితీల గురించి వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్పినట్టుగా చెబుతుంది. ఇలా తెలుగునాట ప్రతి ఇంటా నిత్యం ఏదో ఒక రూపేణా వినిపించే పేరు ఎన్టీఆర్. ఇక రాజకీయాల్లో అయితే 90 ఏళ్ళ రాజకీయ కురువృద్ధుల నుండి ముప్పై ఏళ్ళ యువనేత వరకు పలవరించే మాట 'అన్నగారు'. అన్ని తరాలకు ఆయన అన్నగారే.
ఎన్టీఆర్ అని పిలువబడిన శ్రీ నందమూరి తారక రామారావుగారు 1923 మే 28 సోమవారం సాయంత్రం 4.40 నిమిషాలకు తెలుగు నేలపై గుడివాడ దగ్గర ఒక కుగ్రామమైన నిమ్మకూరులో శ్రీమతి వెంకట్రావమ్మ, శ్రీ లక్ష్మయ్యచౌదరి గార్లకు జన్మించారు.
ఎవరైనా తన జీవితంలో ఏదో ఒక రంగంలో విజయవంతమవుతారు. కానీ మన ఎన్టీఆర్ ముప్పై మూడేళ్ళ సినీ జీవితంలో ఎన్నో రికార్డులు సృష్టించారు. ప్రశంసలు అందుకున్నారు. వెండితెర వేలుపుగా పూజలు అందుకున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమునిగా కీర్తించబడ్డారు.
అటు తర్వాత తనను ఆదరించి అభిమానించిన తెలుగు ప్రజలకు సేవ చేసి వారి ఋణం తీర్చుకోడానికి ఆరుపదుల వయసులో రాజకీయాల్లోకి వచ్చి ఈ రంగంలోనూ అనితరసాధ్యమైన విజయాలను అందుకున్నారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం రగిలించారు. బడుగులకు రాజ్యాధికారం ఇచ్చారు. మహిళలకు హక్కులు పంచారు. పేదలకు సంక్షేమం అందించారు. అందరికీ ఆప్తుడైన "అన్నగారు" అయ్యారు. 1996 జనవరి 18న ఎన్టీఆర్ అనే తెలుగు వెలుగు అస్తమించింది. అప్పటికి ఆయన వయసు 73 ఏళ్ళు మాత్రమే. ఈ వ్యవధిలోనే ఎన్టీఆర్ రెండు సంచలన జీవితాలు జీవించారు. తెలుగు వారు ఉన్నంత కాలం, తెలుగువారి చరిత్ర చెప్పుకున్నంత కాలం తన గురించి చెప్పుకునేలా తనకంటూ ఒక శకాన్ని సృష్టించుకున్న 'శక పురుషుడు' ఎన్టీఆర్.
ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది 1982 మార్చి 29న అయినప్పటికీ... 'మహానాడు' పేరుతో పార్టీ పండుగ చేసుకునేది మాత్రం ఎన్టీఆర్ పుట్టినరోజైన మే 28న. పార్టీ శ్రేణులకు తమ ఆరాధ్య దైవం ఎన్టీఆర్ పుట్టిన రోజే అసలైన పండుగ. 2023 మే 28 నాటికి 'ఎన్టీఆర్' అనే కారణజన్ముని అవతరణకు వందేళ్లు నిండుతాయి. అందుకే 2022 మే 28 నుండి ఒక ఏడాది పాటు ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ... ఎన్టీఆర్ ఘన చరిత్రను ముందు తరాలు తెలుసుకునేలా... ప్రపంచవ్యాప్త తెలుగువారంతా 'ఎన్టీఆర్ శతజయంతి' ఉత్సవాలు నిర్వహించాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అద్వర్యంలో తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఆ ఉత్సవ విశేషాలను... ఎన్టీఆర్ జీవిత విశేషాలను... ఎన్టీఆర్ భావజాలాన్ని.. ఈ పేజీలో చూద్దాం.