- తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడు
- సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ది చెరగని ముద్ర
- జాతీయ భావాలతో ప్రాంతీయ పార్టీ నడిపిన నేత
- ఎన్టీఆర్‌కు భారతరత్న సాధించి తీరుతాం..
- ఎన్టీఆర్ స్ఫూర్తితోనే స్వర్ణాంధ్ర-2047 డాక్యుమెంట్
- ప్రగతి కలను సాకారం చేసి చూపిస్తా..
- ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలో చంద్రబాబు ఉద్ఘాటన
- సినీ ప్రస్థానంపై రూపొందించిన ‘తారక రామం’ ఆవిష్కరణ
అమరావతి (చైతన్య రథం): ‘తెలుగుజాతి ఆత్మగౌరవం, పౌరుషం అంటే గుర్తొచ్చేది ఎన్టీఆర్. ఎన్టీఆర్ స్ఫూర్తితో స్వర్ణాంధ్ర విజన్ `2047 కల సాకారం చేసుకుందాం. మనకు తెలిసిన, మనం చూసిన ఏకైక యుగపురుషుడు ఎన్టీఆర్’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. పోరంకిలో శనివారం సాయంత్రం ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వేదికపై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి, ఎన్టీఆర్ సినీ ప్రస్థానంపై రూపొందించిన ‘తారకరామం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి వచ్చిన అతిధులు, సినీ ప్రముఖులను ఆప్యాయంగా పలకరించారు. అనంతర సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
చరిత్ర ఉన్నన్నాళ్లు ఎన్టీఆర్ ఉంటారు
‘ఎన్టీఆర్ సినీ ప్రస్థానానికి నేటితో 75 ఏళ్లు. ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుక అపూర్వ ఘట్టం. గతేడాది ఎన్టీఆర్ శతజయంతి జరుపుకున్నాం. ఏడాది మొత్తం ప్రపంచమంతా ఉత్సవాలు చేసుకున్నాము. యుగపురుషుడు పుట్టినప్పుడు చరిత్ర మర్చిపోదు అనడానికి ఎన్టీఆర్ ఉదాహరణ. 75ఏళ్ల సినీ వజ్రోత్సవ వేడుక చేసుకోవడం, వేదికపై అందరం కలుసుకోవడం సంతోషాన్నిస్తోంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లిన తెలుగుజాతి పేరువింటే ముందుగా మనకు గుర్తొచ్చేది ఎన్టీఆర్. చరిత్ర ఉన్నంతవరకూ తెలుగువారి గుండెల్లో ఆయన ఉంటారు. చిన్నరైతు బిడ్డనుంచి తెలుగు సినీ చరిత్రలో ఎవరెస్టు శిఖరంగా ఎదిగి, పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి కావడం చరిత్రలో ఎక్కడా జరగలేదు. భవిష్యత్‌లోనూ జరగదు. ఇటు వెండితెర, అటు రాజకీయాలను ఏలిన ఏకైక నాయకుడు దేశ చరిత్రలో ఒక్క ఎన్టీఆర్ మాత్రమే. రంగంఏదైనా ఆయన అడుగుపెట్టిన ప్రతిచోటా సువర్ణాధ్యాయమే’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
తెలుగు సినీ పరిశ్రమపై చెరగని సంతకం
‘ఎన్టీఆర్ తొలిసారి నటించిన మనదేశం చిత్రం విడుదలైన 75 ఏళ్లు. ఎన్టీఆర్ మొదటి సినిమా హీరోయిన్ కృష్ణవేణి. 102 సంవత్సరాల వయసులోనూ ఈ వేడుకకు ఆమె హాజరుకావడం ఎంతో గొప్పవిషయం. కారణజన్ముల చరిత్ర మనం గుర్తు చేసుకోని స్ఫూర్తి పొందాలి. నిమ్మకూరులో వెంకట్రావమ్మ, లక్ష్మయ్యచౌదరి దంపతులకు 1923, మే 25న జన్మించిన కారణ జన్ముడు ఎన్టీఆర్. నేను ఆయన్ను కలిసి మాట్లాడినప్పుడు ఎన్నో విషయాలు చెప్పేవారు. చదువుకోసం విజయవాడకు రావడం తల్లికి సాయంగా పాలు అమ్మడం, గుంటూరుకు వెళ్లి చదువుకున్న విషయాలు నాతో పంచుకునేవారు. 1945లో మద్రాసు రైలు ఎక్కాక ఎన్టీఆర్ జైత్ర యాత్ర ప్రారంభమైంది. నెలవారీ జీతం కోసమే ఆయన మొదట ఆలోచించారు. తర్వాత ఎల్వీ ప్రసాద్, నాగిరెడ్డి, చక్రపాణి సహకారంతో సినీ అవకాశాలు వచ్చాయి. ఆపై ఎన్టీఆర్ సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రల్లో నటించి ప్రాణం పోశారు. 300 సినిమాల్లో నటించారు. ఏడాదికి 10నుంచి 15 సినిమాల్లో నటించారు. ఇప్పుడైతే ఒక్కో సినిమా మూడేళ్లుపడుతోంది. భారతదేశ సినీ చరిత్రలో ఎన్టీఆర్‌లాగ విభిన్న పాత్రలు పోషించిన నటుడు లేరు. ప్రతి పాత్రలోనూ ఆయన జీవించారు’ అంటూ ఎన్టీఆర్ పట్ల ఆరాధన వ్యక్తం చేశారు.
రాముడైనా ..కృష్ణుడైనా ఎన్టీఆరే
‘ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక వెంకటేశ్వర స్వామి అంటే మనకు గుర్తొచ్చేది ఎన్టీఆరే. ఎన్టీఆర్ రూపంలో మనం దేవుణ్ణి చూస్తున్నాము. అందరి ఇళ్లలోనూ ఆయన ఫోటోలు ఉంటాయి. వెంకటేశ్వరస్వామి, శ్రీకృష్ణుడు పాత్రలు వేసినప్పుడు ఆయన క్రమశిక్షణగా ఉండేవారు. మాంసాహారం ముట్టేవారు కాదు. ఇంట్లో నేలపై పడుకునేవారు. ఒకవైపు శ్రీరాముడు, మరోవైపు రావణుడిగా… అలాగే ఓవైపు శ్రీకృష్ణుడిగా మరోవైపు దుర్యోధనుడిగా కూడా చేశారు కదా…. దీన్ని ఎలా సమర్థిస్తారు అని నేను ఎన్టీఆర్‌ను అడిగాను. ఏ పాత్ర గొప్పతనం దానిదేనని ఆయన చెప్పారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసేవారు. దాన వీర శూర కర్ణలో మూడు పాత్రల్లో నటించి ఆ సినిమాకు దర్శకత్వం వహించారు. నిర్మాతగా, ఎగ్జిబిటర్‌గా వ్యహరించారు. ఆల్ ఇన్ వన్ అని నిరూపించుకున్నారు. సినిమాలో 24 ఫ్రేమ్స్ చూపించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. నేను చిన్నతనంలో లవకుశ చూశాను. ఆ సినిమా కోసం ఎడ్లబండ్లు కట్టుకుని వచ్చి చూసేవారు. పోతులూరి వీరబ్రహ్మంగారి చరిత్ర, శ్రీనాథ కవి సార్వభౌమ వంటి సినిమాల కోసం ఆయన ఎంతో రీసెర్చ్ చేశారు. తోడుదొంగలు సినిమాకు రాష్ట్రపతి అవార్డు వచ్చింది’ అని వివరించారు.
సినిమాల్లోనే కాదు… రాజకీయాల్లోనూ నిజమైన హీరో
‘సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో నిజమైన హీరో ఎన్టీఆర్. 60ఏళ్లు కుటుంబం కోసం బతికాను. ప్రజలు నన్నుఆదరించారు. నా ఈ శేష జీవితం తెలుగు ప్రజలకు అంకితం చేయాలని చెప్పి ఆచరణలో చూపించారు. 9 నెలలు ఇల్లు, కుటుంబాన్ని వదిలేసి ప్రజల్లో తిరిగారు. ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ తెలుగుజాతి ఉన్నంతవరకూ చిరస్థాయిగా ఉంటుంది. ఆన్‌లైన్‌లో 73 లక్షలమంది పార్టీ సభ్యత్వాలు తీసుకున్నారంటే అదీ టీడీపీ సామర్థ్యం. తెలుగుజాతి ఆత్మగౌరవం, పౌరుషం అంటే గుర్తొచ్చేది ఎన్టీఆరే. మహిళలకు మొదటిసారి ఆస్తిహక్కు ఇచ్చింది ఎన్టీఆరే. తల్లిదండ్రుల నుంచి ఆస్తి న్యాయపరంగా రాకుంటే న్యాయపోరాటం చేసే హక్కు ఆడపిల్లలకు ఉంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు సంక్షేమం లేదు. ప్రభుత్వం అంటే పెత్తందారీగా ఉండేది. కూడు, గూడు, గుడ్డ నినాదం అమలు చేశారు. రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లకు నాంది పలికింది ఎన్టీఆర్. మండల వ్యవస్థ తీసుకొచ్చి పాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికలకు శ్రీకారం చుట్టారు. కేజీ రూ.2 బియ్యం ఆయన తెచ్చిందే. ఆగస్టు సంక్షోభంలో ఆనాడు ఎన్టీఆర్‌ను దించేస్తే వెంకయ్యనాయుడు సహా ఎందరో 30 రోజులు రోడ్లపైకి వచ్చి ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేశారు. ఆనాడు ఎన్నో పార్టీలను వెంకయ్యనాయుడు కూడగట్టారు. మా అందరి కంటే వెంకయ్యనాయుడుని ఎన్టీఆర్ అభిమానించేవారు. జాతీయభావాలతో ప్రాంతీయ పార్టీలను నడిపిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. రాయలసీమలో కరువు వచ్చినా దివిసీమలో విపత్తు వచ్చినా అగ్రనటుడు అయ్యుండీ జోలి పట్టాడు. సమాజమే దేవాలయం -ప్రజలే దేవుళ్లని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. నాకు ఇజాలు తెలీదు… హ్యూమనిజమే నా సిద్ధాంతం అని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. ఇప్పుడు అన్ని ఇజాలూ పోయాయి. మెరుగైన జీవన ప్రమాణాలు కావాలి. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్నాము. అమెరికాలో తెలుగును ఒక అధికార భాషగా ప్రకటించారంటే అదీ మన సత్తా’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
స్వర్ణాంధ్ర-విజన్ 2047
ఎన్టీఆర్ స్ఫూర్తితో స్వర్ణాంధ్ర `2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించాం. హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ మన నినాదం. 10 సూత్రాలు రూపొందించాం. పేదరికం లేని సమాజం సాధిస్తాము. ఇవాళ నేను మెగా కృష్ణారెడ్డి కట్టించిన డోకిపర్రులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లాను. మీ మండలంలో 14,821 వేలకు పైగా ఇళ్లు ఉన్నాయి. 51,571మంది జనాభా ఉన్నారు. ఇక్కడ జీరో పావర్టీ బాధ్యత మీరు తీసుకోవాలనని కృష్ణారెడ్డికి చెప్పాను. ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలి. సంపద ఒక్కరికే పరిమితం కాకూడదు. కొందరు పేదరికంలో ఉంటే కొందరు సంపదతో తులతూగుతున్నారు. ఆర్థిక సంస్కరణల ద్వారా పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ వచ్చింది. కంపెనీలకు యూజర్ చార్జీలు కడుతున్నారు. పేదలకు అందరం చేయూతనివ్వాలి. ధనవంతులు కిందివారికి ఆసరా ఇవ్వాలి. సమాజం మనకు గౌరవం ఇచ్చింది. తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో పేదరికాన్ని తరిమేయాలి. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. రాళ్లు, రప్పలున్న హైదరాబాద్‌ను సింగపూర్, న్యూయార్క్‌గా మార్చానని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు.
2047నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా భారత్
2047నాటికి భారతీయులు ప్రపంచంలో ఎక్కడున్న నెంబర్ వన్‌గా ఉంటారు. ఆయా దేశాల్లో పరపతి ఉందంటే మనవాళ్లకే సాధ్యం. భారతీయుల్లో అగ్రస్థానంలో తెలుగుజాతి ఉంటుంది. ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యసాధన కోసం మనందరం పనిచేయాలి. మన తలసరి ఆదాయం 3,200 డాలర్లు ఉంది. అదే అమెరికాలో మన తెలుగువాడు రూ.లక్షా 20 వేల డాలర్లు సంపాదిస్తున్నాడు. అదే అమెరికన్ ఆదాయం కేవలం రూ.60 వేల డాలర్లే . ఇక్కడితో పోల్చితే వారు 40 రెట్లు ఎక్కువ ఉన్నారు. రాబోయే 14 ఏళ్లలో 42 వేల డాలర్లుగా మన తలసరి ఆదాయం ఉండాలని నా కోరిక. ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదరిక నిర్మూలనతోపాటు ఆర్థిక అసమానతలు కూడా తగ్గించే బాధ్యత నేను తీసుకుంటాను. నిరంతరం కష్టపడే తత్వం, త్యాగనిరతి ఎన్టీఆర్‌ది. 60ఏళ్ల తర్వాత రాజకీయాల్లో వచ్చి రాక్షసుడిలా కష్టపడ్డారు. తెలుగుజాతి కోసం త్యాగం చేశాడు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడం దేశాన్ని గౌరవించడమే. ఆయనకు భారతరత్న సాధించితీరుతాం. ఎన్టీఆర్ బాటలో పయనిద్దాం. ప్రపంచంలోనే తెలుగుజాతిని నెంబర్ వన్‌గా చేసే బాధ్యత నాది. భారతదేశ అభివృద్ధిలో మన తెలుగుజాతి భాగస్వామి కావాలి. స్వర్ణాంధ్ర మన కల. ఎన్టీఆర్ వారసులమని గర్వంగా చెప్పుకునే రోజు దగ్గరలోనే ఉంది. కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన టీడీ జనార్ధన్, బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’ అని సీఎం చంద్రబాబు అన్నారు.