- బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డారు
- ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదరికం లేని సమాజమే సీఎం చంద్రబాబు లక్ష్యం
- ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్
- మహిళలు తమ శక్తిని తెలుసుకుంటే అన్ని రంగాల్లో రాణిస్తారు
- 4వ రోజు కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి
కుప్పం (చైతన్యరథం): దివంగత ఎన్టీఆర్ పేదల పక్షపాతి అని ఆయన స్ఫూర్తితో పేదరికం లేని సమాజం కోసం సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని నారా భువనేశ్వరి అన్నారు. సామాజిక న్యాయం కోసం ఎన్టీఆర్ ఎనలేని కృషి చేశారని, ఆయన అడుగుజాడల్లో సీఎం చంద్రబాబు పయనిస్తున్నారని అన్నారు. 4వ రోజు కుప్పం పర్యటనలో భాగంగా శనివారం పలు కార్యక్రమాల్లో భువనేశ్వరి పాల్గొన్నారు. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కుప్పంలో కార్యకర్తల సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు.
సామాజిక న్యాయం టీడీపీతోనే సాధ్యం
బడుగు,బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసమే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. కేవలం 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతితో పాటు మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే సీఎం చంద్రబాబు పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారు. పేదలందరికీ సంక్షేమం అందేలా చర్యలు తీసుకుంటున్నారని భువనేశ్వరి అన్నారు.
కార్యకర్తలే టీడీపీ బలం
ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పార్టీని అంటిపెట్టుకుని, చంద్రబాబుకి తోడుగా నిలిచింది కార్యకర్తలే. కష్టాల్లో ఉన్నప్పుడు మాకు మనోధైర్యాన్ని ఇచ్చిందీ కార్యకర్తలే. గత ఐదేళ్ళలో ఎందరో కార్యకర్తలు పార్టీ కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. కొందరు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడారు. జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు విడిచారు. కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకుంటాం. వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా నిలబడతామని భువనేశ్వరి భరోసా ఇచ్చారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే పేదల ముఖాల్లో చిరునవ్వు
ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించి 28 సంవత్సరాలయింది. ఎన్టీఆర్ స్ఫూర్తితో, చంద్రబాబు ఆలోచనలు, సహకారంతో ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ట్రస్ట్ ద్వారా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి ఇప్పటి వరకూ 7,531 మందికి శిక్షణ అందించాం. వారిలో 2,500 మందికి ఉద్యోగాలు కూడా వచ్చాయని భువనేశ్వరి తెలిపారు.
ట్రస్ట్ ద్వారా సేవల విస్తరణ
ట్రస్ట్ ద్వారా సంజీవని ఆరోగ్య క్లినిక్‌లు నడుపుతున్నాం. ఈ క్లినిక్స్ వల్ల లక్షా 60 వేల 290 మందికి ఉచితంగా వైద్య సేవలు అందించాం. ఇందుకోసం రూ. 4 కోట్ల 2 లక్షల 50 వేలు ఖర్చు చేశాం. ట్రస్ట్ ద్వారా 14 వేల 56 హెల్త్ క్యాంప్స్ కూడా నిర్వహించాం. వీటి ద్వారా 20 లక్షలమందికి ప్రయోజనం కలిగింది. ఇందుకోసం రూ. 22.43 కోట్లు ఖర్చుయింది. ట్రస్ట్ ఆధ్వర్యంలో గండిపేటలో స్కూల్, మహిళల డిగ్రీ కాలేజ్ నిర్వహిస్తున్నాము. అందులో వచ్చిన లాభాలతో చల్లపల్లిలో స్కూలు నిర్వహిస్తున్నాం. విపత్తుల సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆపన్నులకు సేవలు అందించాం. ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చాం. కేరళలో వరదలు, హుద్ హుద్, తిత్లీ తుఫాన్, కర్నూలు వరదలు, విజయవాడ వరదల సమయంలో బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా నిలిచిందని భువనేశ్వరి వివరించారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మహిళలకు శిక్షణ
కుప్పంలో 150 మంది మహిళలకు టైలరింగ్, జ్యూట్ బ్యాగ్‌ల తయారీ, సిల్క్ దారంతో గాజుల తయారీ, చికెన్ కారీ ఎంబ్రాయిడరీలో శిక్షణ ఇచ్చాము. త్వరలో బ్యూటీషియన్ కోర్సులు, మగ్గం వర్క్‌లో ట్రైనింగ్ ఇస్తాము. మహిళలు వారు ఉపాధి పొందడమే కాకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదిగి పలువురికి ఉపాధి కల్పించాలని నారా భువనేశ్వరి అన్నారు. అంతకుముందు కుప్పంలో సీఎం చంద్రబాబు తెచ్చిన షాహీ గార్మెంట్స్‌ను నారా భువనేశ్వరి సందర్శించారు.