- ఎంతో మంది నేతలుగా ఎదిగారంటే ఆయన చలవే
హైదరాబాద్: రాజకీయం, నాయకత్వంలో ఎన్టీఆర్ ఓ బ్రాండ్ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి నాయకులు ఉన్నారంటే ఆ రోజు ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశాలే కారణమన్నారు. ఎన్టీఆర్ రాజకీయంగాఎంతోమందికి అవకాశాలు ఇచ్చారు. ఎన్టీఆర్ తెచ్చిన సంకీర్ణ రాజకీయాలే నేడు దేశాన్ని ఏలుతున్నాయన్నారు. మాదాపూర్‌లో శనివారం నిర్వహించిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మహాసభల్లో పాలొన్న రెవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కమ్మ కుటుంబ సభ్యులను ఒక్క దగ్గర చేర్చడం అభినందనీయమన్నారు. ‘కమ్మ అంటే అమ్మలాంటి వారు. అమ్మ బిడ్డ కడుపు చూస్తుంది… కమ్మవారు వ్యవసాయం చేసి పదిమందికి అన్నం పెడుతున్నారు. వారు కష్టపడి పంటలు పండిరచాలి.
పది మందికి ఉపయోగపడాలి అనుకుంటారు. కమ్మవారు నేలను నమ్ముకుని కష్టపడి పనిచేస్తారు. ఎక్కడ సారవంతమైన నేల ఉంటే అక్కడ కమ్మవారు కనిపిస్తారు. కష్టపడటం… పదిమందికి సాయం చేయడం కమ్మవారి లక్షణం. నేను ఎక్కడ ఉన్నా… కమ్మవారు నన్ను ఎంతో ఆదరిస్తారు. అనర్గళంగా మాట్లాడటం ఎన్టీఆర్ నుంచే నేర్చుకున్నా. ఎన్టీఆర్ లైబ్రరీలో చదివిన చదువు మమ్మల్ని ఉన్నత స్థానాలకు చేర్చింది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే ప్రణాళికలో కమ్మవారు భాగస్వాములు కావాలి. మీలో ఉన్న ప్రతిభని అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మాకు భేషజాలు లేవు.. మేం కులాన్ని అభిమానిస్తాం.. ఇతర కులాలను గౌరవిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఎవరిపై వివక్ష ఉండదు.. అది మా ప్రభుత్వ విధానం కాదు. వివాదంలో ఉన్న 5ఎకరాల కమ్మ సంఘం భూ సమస్యను పరిష్కరిస్తాం. భూసమస్యను పరిష్కరించడంతో పాటు సంఘం భవన నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పదిమందికి సాయం చేసే కమ్మవారి సహజ గుణాన్ని వీడొద్దని రేవంత్ సూచించారు.
నిరసన తెలిపే హక్కు లేదంటే ఎలా?
పన్నులు కట్టే ప్రాంతంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉంటుందని, నిరసనలను అణచివేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో గత ఏడాది డిసెంబర్ 3న చూశామని రేవంత్ రెడ్డి అన్నారు. గత ఏడాది ఏపీలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో హైదరాబాద్‌లో నిరసనలు వద్దని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు. అమెరికాలో తెలంగాణ కోసం నిరసనలు తెలుపవచ్చునని… కానీ ఏపీలోని అక్రమ అరెస్ట్‌లపై మాత్రం హైదరాబాద్‌లో నిరసన తెలపనీయలేదని నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నిరసన ప్రాథమిక హక్కు… కానీ ఏపీలో అక్రమ అరెస్టులపై తెలంగాణలో నిరసనలు తెలపాలనుకుంటే అడ్డుకున్నారని… ఇదే వారి పతనానికి దారి తీసిందన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన ఒక పద్ధతి అన్నారు. ఢిల్లీలో ఇప్పుడు నాయకత్వ లోపం కనిపిస్తోంది. వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి, పీవీ లాంటి తెలుగు వారు లేరు. కులమతాలకు అతీతంగా ఢల్లీిలో మన తెలుగు వారు రాణించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మా ప్రభుత్వం నుంచి మీకు సంపూర్ణ సహకారం ఉంటుందని రేవంత్‌రెడ్డి అన్నారు.