ఖమ్మం (చైతన్య రథం): ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలం యజ్ఞ నారాయణపురంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎన్టీఆర్ తనయులు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యులు టిడి జనార్ధన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు, డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, కేతినేని హరీశ్, శ్రీయాస్ శ్రీనివాస్, మందలపు సుధాకర్, పోటు సరస్వతి, రంజిత్, నవీన్ చంద్ర, ఇతర రాష్ట్ర, జిల్లా, మండలస్థాయి టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పోలిట్‌బ్యూరో సభ్యులు టి.డి.జనార్ధన్ మాట్లాడుతూ… యజ్ఞ నారాయణపురం ఒక చిన్న గ్రామం. ఇలాంటి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఇంత భారీగా ప్రజలు తరలి వచ్చారంటే అన్నగారిపట్ల ప్రజలకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. ఆయన స్వర్గస్థులై 30 ఏళ్లవుతున్నా.. ఆయనపట్ల ప్రజలకు అదే అభిమానం. ఎన్టీఆర్‌లాంటి నాయకులు మరొకరిని ఊహించలేం. ఎన్నేళ్లయినా ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారు. ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి రాజకీయానికి సరికొత్త అర్థం చెప్పారు. వాటిని ఇప్పటికీ పాలకులు అనుసరించడం ఎన్టీఆర్ దార్శనికతకు నిదర్శనం. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిపిన యజ్ఞనారాయణపురం టీడీపీ నాయకులకు, ఖమ్మం జిల్లా టీడీపీ నాయకులకు కృతజ్ఞతలు. మేము ఎన్టీఆర్ శతజయంతి, ఇప్పుడు 75 ఏళ్ల సినీ స్వర్ణోత్సవం కార్యక్రమాన్ని ప్రపంచంలో దేశ, విదేశాల్లో జరుపుతున్నాం. అలాగే ఎన్టీఆర్ గురించిన సాహిత్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. తరతరాల ప్రజలు తెలుసుకోవాల్సిన చరిత్ర అన్నగారిది. ఆంధ్రాలో మాదిరిగా తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వమే వస్తుందని
టిడి జనార్ధన్ అన్నారు.
నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ… యజ్ఞనారాయణపురంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఎండల్ని లెక్క చేయకుండా ఎంతోమంది ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కృతజ్ఞతలు. అలాగే ఖమ్మం జిల్లా టీడీపీ నాయకులు, యజ్ఞనారాయణపురం నేతలు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. సినీరంగంలో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్, తెలుగు రాజకీయాలను కొత్త మలుపు తిప్పారు. నటుడిగా ఉన్నప్పుడే ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు, ఇండియా పాకిస్థాన్ యుద్ధం జరిగినప్పుడు విరాళాలు సేకరించి ప్రజలకు, సైనిక సంక్షేమ నిధికి అందజేశారు. ప్రాంతాలకు అతీతంగా తెలుగు జాతి మొత్తం ఒక్కటేనని చాటిన మహానుభావుడు ఎన్టీఆర్. ఆయన ఆశయాల స్ఫూర్తితో మనమంతా ముందుకు వెళ్లాలని అన్నారు.