- బాబు ష్యూరిటీ… జాబు గ్యారెంటీ నినాదాన్ని నిజం చేశాం
- అత్యంత పారదర్శకంగా డీఎస్సీ ప్రక్రియ నిర్వహించాం
- విద్యార్థులకు టీచర్లు నైతిక విలువలు బోధించాలి
- ఉపాధ్యాయులూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి
- మెగా డీఎస్సీ విజేతల సభలో సీఎం చంద్రబాబు పిలుపు
- సమర్థ నిర్వహణపై మంత్రి లోకేష్ టీంకు అభినందనలు
- కొత్త టీచర్లకు నియామక పత్రాలు అందించిన ముఖ్యమంత్రి
అమరావతి (చైతన్య రథం): ఇక ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షాతిరేకాల మధ్య ప్రకటించారు. నిరుద్యోగులు, ఈ ఏడాది డీఎస్సీలో క్వాలిఫై కానివారంతా ప్రిపరేషన్ ఆపొద్దని సూచించారు. ఇకపై ప్రతి ఏడాదీ డీఎస్సీ నిర్వహిస్తామని… దాని కోసం ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యా మంత్రి నారా లోకేష్కు సీఎం చంద్రబాబు సూచించారు. మెగా డీఎస్సీలో విజేతలకు ఉపాధ్యాయ పోస్టుల నియామక పత్రాలను జారీ చేసే కార్యక్రమం గురువారం రాష్ట్ర సచివాలయం సమీపంలో పండువ వాతావరణంలో జరిగింది. వినూత్నంగా నిర్వహించిన కారక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు.. డీఎస్సీలో టీచర్లుగా ఎంపికైన 15,941మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. అన్ని జిల్లాలనుంచి నియామక పత్రాలు అందుకునేందుకు కుటుంబీకులతో సహా కొత్తగా రిక్రూట్ అయిన టీచర్లు తరలి రావడం విశేషం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… “సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్పైనే పెట్టాను. అవినీతిలేకుండా పారదర్శకంగా డీఎస్సీ ప్రక్రియ చేపట్టాం. టీచర్లను నియమించాం. 150 రోజుల్లో ఈ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టిన మంత్రి నారా లోకేష్ బృందాన్ని అభినందిస్తున్నాను. ఇక టీచర్లుగా నియామక పత్రాలు తీసుకున్న ఉపాధ్యాయులను అభినందిస్తున్నాను. ఎన్నికల్లో హామీ ఇస్తూ -బాబు ష్యూరిటీ… జాబు గ్యారెంటీ అని చెప్పాను. దాన్ని నిజం చేశాను. రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకున్నాం. 10 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. పదిహేనేళ్లలో 14 సార్లు డీఎస్సీని పెట్టాం. 1,96,619 ఉద్యోగాలిచ్చాం. ఇకపైనా ప్రతి ఏడాది డీఎస్సీ ఉంటుంది” అని సీఎం చంద్రబాబు ఆనందోత్సాహాల మధ్య ప్రకటించారు.
చదువు చెప్పడంలో మహిళలే బెస్ట్
“సూపర్ సిక్స్ హామీల్లో మొదటి హామీ యువతకు 20 లక్షల ఉద్యోగాలివ్వడమే. దాంట్లో భాగంగా మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశాను. మెగా డీఎస్సీని సూపర్ హిట్ చేశారు. ఉద్యోగం సంపాదించాలన్న మీ కోరిక తీరింది. పేదరికంలేని సమాజం చూడాలనేది నా కోరిక. పేదరికంలేని సమాజాన్ని చూడాలంటే… విద్యతోనే సాధ్యం. దాన్ని టీచర్లే నెరవేర్చాలి. మగవాళ్లకంటే మహిళలే మంచిగా చదువు చెప్పగలరు. ఇంటిని కూడా మహిళలే చక్కగా తీర్చిదిద్దుతారు. అందుకే సంక్షేమ కార్యక్రమాలు అందించే విషయంలో మహిళలకే ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నాం. మహిళలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెచ్చాం. స్త్రీశక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. దీపం పథకం అమలు చేస్తున్నాం. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలున్నా.. వారందరికీ రూ.15 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. సూపర్ సిక్స్ సూపర్ హిట్టయ్యింది. ప్రధాని సూపర్ జీఎస్టీ తెచ్చారు. ధరలు తగ్గించారు. దసరా, దీపావళి పండుగలను ఆనందంగా జరుపుకోవాలి. అభివృద్ధితో ఉద్యోగాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. సంక్షేమం సజావుగా సాగించవచ్చు” అని చంద్రబాబు ఉత్సాహంగా ప్రకటించారు.
విద్యారంగాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు…
“తొలిసారిగా సీఎం అయినప్పటినుంచి విద్యపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాను. ఐటీ చదవమని ఆ రోజుల్లో చాలామందికి చెప్పాను. కొందరు నా మాటపై నమ్మకంతో పట్టణాలకు వచ్చి చదువుకున్నారు. ఆ రోజు చక్కగా చదువుకున్నవారు… ఇప్పుడు విదేశాలకు వెళ్లారు. బాగా స్థిరపడ్డారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రులందరూ కలిసి ఎంతమంది టీచర్లను నియమించారో… నేను ఒక్కడినే అంత మంది టీచర్లను నియమించాను. ఇదీ నేను విద్యారంగానికి ఇచ్చే ప్రాధాన్యత. విద్యారంగాన్ని నేను ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు. నిర్లక్ష్యం చూపలేదు. టీచర్లుగా బాధ్యతలు తీసుకున్న మీరంతా బాగా పని చేయాలి. మంచి పేరు తీసుకురావాలి. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేలా టీచర్లంతా పని చేయాలి. విద్యారంగంలో సంస్కరణలు తెస్తున్నాం. సన్న బియ్యంతో రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. పేరెంట్- టీచర్ మీటింగులు నిర్వహిస్తున్నాం. మన బడి-మన భవిష్యత్ పేరుతో మౌలిక సదుపాయాల కల్పన చేపడుతున్నాం. టీచర్ల బదిలీల చట్టంతో పారదర్శకంగా ఒక్క ఫిర్యాదు కూడా లేకుండా టీచర్ల బదిలీలు పూర్తి చేశాం. నారా లోకేష్ నో బ్యాగ్ డే విధానం తెచ్చారు. ఇది వినూత్నంగా ఉంది. స్కూళ్లు తెరిచేలోగానే స్కూల్ కిట్లు, పుస్తకాలు ఇచ్చాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
విలువలతో కూడిన విద్యనందించాలి
“విలువలతో కూడిన విద్యను అందించేలా టీచర్లంతా పని చేయాలి. పిల్లల్లో నైతిక విలువలను పెంచేలా టీచర్లు పాఠాలు చెప్పాలి. పిల్లల్లో నైపుణ్యాలు పెంచే బాధ్యత టీచర్లు తీసుకోవాలి. భవిష్యత్తులో విద్యారంగంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయోననేది టీచర్లు ఊహించగలగాలి. మారిన పరిస్థితులకు అనుగుణంగా టీచర్లు అప్డేట్ అవుతూ ఉండాలి. నేను నిత్య విద్యార్థిని. కొత్త విషయాలు నేర్చుకుంటాను. ప్రజలకు ఉపయోగపడే అంశాలుంటే వాటిని అమలు చేస్తాను. కూటమి ప్రభుత్వం వచ్చాకే విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చాయి. నో అడ్మిషన్లు బోర్డులు పెట్టేస్థాయికి ప్రభుత్వ పాఠశాలలను తెచ్చారు. ఇది మరింతగా పెరగాలి. విద్యాశాఖ కఠినంగా ఉంటుందని చెప్పాను.. అయినా లోకేష్ ఛాలెంజ్ తీసుకున్నారు. ప్రాథమిక విద్య బాగుంటే ఉన్నత చదువులూ అద్భుతంగా ఉంటాయి. దీంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుంది” అని సీఎం చంద్రబాబు టీచర్లకు దిశానిర్దేశం చేశారు. మంచి చేయరు… చేస్తే ఓర్వలేరు
“ఏపీలో ఓ చేతకాని పక్షముంది. ఆ చేతకాని పక్షం మంచి చేయదు. మంచి జరుగుతుంటే ఓర్వలేదు. డీఎస్సీని అడ్డుకునేందుకు 106 కేసులు వేశారు. కానీ ఇబ్బందులను అధిగమించి డీఎస్సీ నిర్వహించారు. పోస్టింగుల కోసం పైరవీలు చేసే పరిస్థితి గతంలో ఉండేది. కానీ టీడీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ ప్రతిభఆధారంగానే పోస్టింగులు ఇచ్చాం. 2019-24 మధ్యకాలం విద్యా వ్యవస్థకు ఓ శాపం. 10 లక్షలమంది పిల్లలు గత పాలకుల హయాంలో ప్రభుత్వ స్కూళ్లనుంచి ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లిపోయారు. ఏపీ విద్యారంగాన్ని 19వ స్థానానికి దిగజార్చారు. ఇంగ్లిష్ మీడియం పేరుతో ప్రాథమిక విద్యా వ్యవస్థను నాశనం చేశారు. తెలుగు మీడియంను రద్దు చేశారు. ఇంగ్లిష్ మీడియం అంటూ కొందరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. రాజకీయాల కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు” అని ముఖ్యమంత్రి గత ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు.
టీచర్లతో ముఖాముఖి
గతంలో జరిగిన కార్యక్రమాలన్నింటికంటే భిన్నంగా జరిగిన ఈ సభలో కొత్తగా నియమితులైన టీచర్లతో సీఎం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తనను రాజకీయాల్లో ప్రోత్సహించిన ఎకనామిక్స్ ప్రొఫెసర్ డీఎల్ నారాయణను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. పిల్లలను ప్రొత్సహిస్తే.. ఎంతటి కష్టమైన పనినైనా సులభంగా సాధిస్తారని సీఎం అన్నారు. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను గమనించాలని… సమాజానికి మంచి పేరు తెచ్చేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు, బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు.