- చేనేతల వర్క్‌షెడ్లతో పాటు సోలార్ లైటింగ్ యూనిట్లు
- బీసీ హాస్టల్ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ
- ఖాదీ గ్రామీణాభివృద్ధి బోర్డు ద్వారా స్వయం ఉపాధి యూనిట్లు
- ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ యువతకు ఉపాధి
- అధికారులతో సమావేశంలో మంత్రి సవిత
అనకాపల్లి (చైతన్యరథం): రాష్ట్రంలో చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత వెల్లడిరచారు. మంగళవారం అనకాపల్లి పట్టణంలో నిర్వహించిన సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో వచ్చిన మంత్రి సవితను బీసీ వెల్ఫేర్, బీసీ కార్పొరేషన్, చేనేత, జౌళి శాఖల అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. అనంతరం మంత్రి సవిత డిపార్ట్‌మెంట్ల వారీగా అధికారులతో మాట్లాడారు. చేనేత రంగ అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. చేనేత సహకార సంఘాలను బలోపేతం చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా త్వరలో చేనేత సహకార సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని తెలిపారు. ఆప్కో, లేపాక్షి షోరూమ్‌ల ద్వారా అమ్మకాలు పెంచాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. అర్హులైన నేతన్నలకు వర్క్ షెడ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. వర్క్ షెడ్లలో సోలార్ లైటింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని మంత్రి సవిత ఆదేశించారు.
హాస్టల్ విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడండి
వర్షాకాలం నేపథ్యంలో బీసీ హాస్టల్ విద్యార్థుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని బీసీ సంక్షేమ శాఖాధికారులను మంత్రి సవిత ఆదేశించారు. వేడి తాజా ఆహారం అందించాలన్నారు.హాస్టళ్ల అభివృద్ధికి సీఎస్సార్, డీఎమ్మార్ ఫండ్స్ సేకరణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఎంపీలను కలిసి ఎంపీ ల్యాండ్స్ నుంచి నిధుల సమీకరించాలన్నారు. రాబోయే పదో తరగతి పరీక్షల్లో ఫలితాల శాతం పెంపుదలకు ఇప్పటి నుంచే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత ఆదేశించారు.
యువత ఉపాధికి యూనిట్లు నెలకొల్పండి
ఖాదీ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా యువతకు ఉపాధి కల్పనకు సబ్సిడీ రుణాలతో కూడిన యూనిట్లు నెలకొల్పాలని మంత్రి సవిత ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఖాదీ గ్రామీణ బోర్డు ద్వారా ఏర్పాటు చేసే స్వయం ఉపాధి యూనిట్ల గురించి స్థానిక ఎమ్మెల్యేలకు తెలియజేయాలన్నారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ అవకాశాలను అత్యధిక మంది యువతకు వినియోగించుకునే అవకాశం కలుగుతుందని మంత్రి సవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి శ్రీదేవి, ఖాదీ గ్రామీణాభివృద్ధి బోర్డు ఏడీ పద్మ, లేపాక్షి మేనేజర్ కార్తీక్, ఆప్కో మేనేజర్ రమణమూర్తి, ఎంజేపీ స్కూళ్ల కన్వీనర్ వెంకటేశ్వర్లు, బీసీ కార్పొరేషన్ ఎండీ పెంటోజీరావు, చేనేత, జౌళి శాఖ జిల్లా అధికారి ఆర్వీ మురళీకృష్ణ, పలువురు అధికారులు పాల్గొన్నారు.