- 17 నెలల్లోనే మాట నిలబెట్టుకున్న కూటమి సర్కారు
- ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే పెట్టుబడులు వస్తాయా?
- భోగాపురం ఎయిర్ పోర్ట్ప జగన్ వాదన బొత్సకు గుర్తు లేదా?
- భూములివ్వొద్దని రైతుల్ని రెచ్చగొట్టింది జగన్ కాదా?
- ప్రజలు ఛీకొడుతున్నా.. మీకు బుద్ధిరావడం లేదు
- వైసీపీ నేతల తీరుపై మంత్రి డోలా ఆగ్రహం
అమరావతి (చైతన్య రథం: ప్రజలకిచ్చిన హామీలతోపాటు అదనపు హామీలూ 17 నెలల్లోనే అమలు చేశామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ…. రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు కట్టబెడుతున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడడం.. గురివింద సామెతను గుర్తు చేస్తోందని ఎద్దేవా చేశారు. “జగన్లా మేము భూదోపిడీకి పాల్పడడం లేదు. పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వడం తప్పా? రాయితీలిస్తేనే కదా రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి యువతకు ఉపాధి లభించేది. భోగాపురం ఎయిర్పోర్టు వైసీపీ ఘనత అని బొత్స వ్యాఖ్యనించడం సిగ్గుచేటు. విశాఖకు 40 కిలోమీటర్ల దూరంలో మరో ఎయిర్పోర్ట్ ఎందుకని ఆనాడు జగన్ వ్యతిరేకించడం బొత్స విస్మరించారా? భూములు ఇవ్వొద్దని రైతుల్ని రెచ్చగొట్టడం తప్ప భోగాపురం ఎయిర్పోర్టుకు జగన్ చేసిందేమీ లేదు” అని మంత్రి డోలా ధ్వజమెత్తారు. “రైతు భరోసా ఏడాదికి రూ.12,500 ఇస్తానని చెప్పి కేవలం రూ.7500 ఇచ్చి రైతులను వంచించింది జగన్ కాదా? ఇచ్చిన మాట ప్రకారం రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.20 వేలు అందిస్తోంది కూటమి ప్రభుత్వం. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్నదాతల బాధలు వర్ణనాతీతం. నేడు కూటమి పాలనలో రైతుకు విత్తనంనుంచి విక్రయం వరకు ప్రతి దశలో అండగా ఉంటున్నాం. జగన్లా ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి ప్రజలను మోసం చేయలేదు.రాజకీయాలకతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. వైసీపీ నేతల అబద్ధాలు, అసత్యాల్ని ప్రజలు చీత్కరించుకుంటున్నా వారి తీరు మారలేదని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు.












