- మంత్రి నారాయణ స్పష్టీకరణ
- అది ముమ్మాటికీ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టే
- జగన్, వైసీపీ నేతలవి పిచ్చి ప్రేలాపనలు
నెల్లూరు (చైతన్యరథం): రాజధాని అమరావతి నిర్మాణంలో ఒక్క పైసా కూడా ప్రజల సొమ్ము ఖర్చు పెట్టేదిలేదని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మరోసారి స్పష్టం చేసారు. గత రెండు రోజులుగా మాజీ సీఎం జగన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్సీలు అమరావతిపై చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి నారాయణ మండిపడ్డారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి నారాయణ గురువారం మీడియాతో మాట్లాడారు. అమరావతిపై జగన్‌తో పాటు ఆయన పార్టీ నాయకులు సైకోల్లా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ చూసి వైసీపీ నాయకులు ఫ్రస్ట్రేషన్‌లో మునిగిపోయారని ఎద్దేవా చేసారు. అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడిన జగన్…చివరికి ఏ ఒక్క నగరాన్ని కూడా అభివృద్ది చేయలేదని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ రాజధానిపై ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. హడ్కో, ఏడీబీ, ప్రపంచ బ్యాంకు ద్వారా రుణాలు తీసుకుని మాత్రమే అమరావతి నిర్మాణం చేస్తున్నామనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు..
అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం అవుతుండటంతో వైసీపీ నేతలు సైకో మెంటాలిటీతో మాట్లాడుతున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. ఇప్పటికే అమరావతిలో రూ.50 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని, వాటిలో 27 టెండర్లు తెరిచి కాంట్రాక్టు సంస్థలను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. రాజధానిలో రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ పైప్ లైన్లు, పార్కులు పూర్తి కాగానే భూముల విలువ పెరుగుతుందన్నారు. ప్రభుత్వం వద్ద మిగిలిన భూమిని ధర పెరిగినప్పుడు అమ్మడం ద్వారా వచ్చే డబ్బులతో రుణాలు తీరుస్తామన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం వద్ద ఉన్న ల్యాండ్‌బ్యాంక్‌ను కక్ష పూరితంగా ఆర్ – 5 జోన్‌గా మార్చివేసారని దుయ్యబట్టారు. సీఎం చంద్రబాబు అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్‌గా డిజైన్ చేసారని మంత్రి నారాయణ గుర్తుచేసారు.
అమరావతిపై వైసీపీ నేతలు ఎంత గింజుకున్నా ప్రయోజనం లేదన్నారు. మూడేళ్లలో అమరావతిలో ప్రభుత్వ భవనాలు పూర్తవుతాయన్నారు. జగన్ డ్రామాలతోనే ఆయనను ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసారని. దీన్నిబట్టే ఆయన పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చాన్నారు. బడ్జెట్‌లో అమరావతికి కేటాయించిన రూ.6 వేల కోట్లు ప్రజలు కట్టిన పన్నుల నుంచి వచ్చే నిధులు కాదన్నారు. సీఆర్డీఏకు కేంద్రం గ్యారంటీ ఇచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వస్తాయని, వాటిని మాత్రమే బడ్జెట్‌లో చూపించారు తప్ప, ప్రజల పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కాదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.