- ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో తగిన వైద్య సేవలు, ఔషదాలు
- అవసరం మేరకు ఇమ్యునోగ్లోబిన్ ఇంజక్షన్లు
- ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది
- వ్యాధి నియంత్రణకు తగు చర్యలు
- రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి (చైతన్యరథం): గులియన్ బారీ సిండ్రోమ్ (జి.బి.ఎస్.) విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, అన్ని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల (జి.జి.హెచ్.)ల్లో తగిన వైద్య సేవలు, ఔషదాలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య, వైద్య విద్య శాఖల మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జీబీఎస్‌పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ వ్యాధి ప్రబలడానికి గల ప్రధాన కారణాలను నిశితంగా పరిశీలిస్తోందన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించి గతంలో నమోదు అయిన జీబీఎస్ కేసుల వివరాలను పూర్తి స్థాయిలో విశ్లేషించి, ఈ వ్యాధి సోకడానికి, విస్తరించడానికి గల కారణాలను గుర్తించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ఈ వ్యాధి లక్ష మందిలో ఒకరిద్దరికి మాత్రమే వచ్చే అవకాశం ఉందన్నారు.
శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున పెరిఫెరల్ నరాలపై దాడి చేయడంతో కండరాల బలహీనత, తిమ్మిర్లు రావడం, కాళ్లు చచ్చుబడిపోవటం వంటి సమస్యలు తలెత్తుతాయన్నారు. ఎటువంటి చికిత్స అవసరం లేకుండానే 85 శాతం వరకూ ఈ వ్యాధి తగ్గిపోయే అవకాశం ఉందని, మిగిలిన 15 శాతం మందికి మాత్రమే ఇమ్యూనోగ్లోబిన్ ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇటు వంటి అనారోగ్య సమస్యలు ఏ మాత్రం బయపడినా, వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించి తగు వైద్య సేవలు పొందాలని ఆయన సూచించారు.
రాష్ట్రంలో గత ఏడాది పది ప్రభుత్వ ఆసుపత్రుల్లో 301 కేసులు నమోదుకాగా, వీటిలో అధిక మొత్తంలో 115 కేసులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నమోదవ్వడానికి కారణం ఆ ఆసుపత్రిలో న్యూరాలజీకి సంబందించిన అన్ని రకాల వైద్య సేవలు, ఔషదాలు అందుబాటులో ఉండటమేనన్నారు. అదే విధంగా ఈ ఏడాది జనవరిలో 43 కేసులు నమోదు కాగా వారిలో 17 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో జీబీఎస్ వ్యాధి బారిన పడిన వారికి తగిన వైద్య సేవలు అందజేసేందుకు అవసరమైన ఇమ్యూనోగ్లోబిన్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని, ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఒక పేషంట్‌కి రోజుకి ఐదు ఇంజక్షన్ల చొప్పున ఐదు రోజుల పాటు ఇవ్వాల్సి ఉంటుందని, బహిరంగ మార్కెట్‌లో ఈ ఇంజక్షను ఖరీదు దాదాపు రూ.20 వేల వరకూ ఉందని, అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో దీన్ని ఉచితంగా ఇస్తున్నారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇంజెక్షన్లు సరఫరా చేస్తున్నాం. అనంతపురం, గుంటూరు, కడప, కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖ జీజీహెచ్‌ల్లో 749 ఇంజెక్షన్లు ఉన్నాయి. అదనంగా మరో 469 ఇంజెక్షన్లు ఉన్నాయి. వీటిలో 425 ఇంజెక్షన్లను లభ్యత లేని ఇతర జీజీహెచ్‌లకు తరలిస్తున్నాం. ఖర్చుకు వెనుకాడకుండా ప్రజల అరోగ్య సంరక్షణే ధ్యేయంగా అవసరం మేరకు అదనంగా ఈ ఇంజెక్షన్లను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఎన్.టి.ఆర్.వైద్య సేవ పథకం కింద కూడా ఈ వ్యాధి కవర్ అవుతున్నదన్నారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ సీఎస్ ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ పూనే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 181 మందిలో ఈ జీబీఎస్ వ్యాది లక్షణాలను గుర్తించడంతో ప్రభుత్వం అప్రమత్తమైందన్నారు. ఈ వ్యాధి వ్యాప్తికిగల కారణాలను ఐసీఎమ్‌ఆర్ బృందం పరిశీస్తోందని, జీవ కాలుష్యం ఈ వ్యాధి ప్రబలడానికి ప్రధాన కారణం కావచ్చనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ జీబీఎస్ వ్యాధి కాళ్లలో ప్రారంభమై పైవరకు వ్యాపిస్తోందని, తిమ్మిర్లు, నడవలేని స్థితి సంభవిస్తుందన్నారు. ఇటువంటి లక్షణాలు బయపడిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి తగిన వైద్యసేవలు పొందితే ఎటు వంటి ప్రమాదం ఉండదన్నారు. చికిత్స తీసుకోకుండానే చాలావరకు వ్యాధి తగ్గిపోతోందని, జీబీఎస్ రోగులకు సరిపడా ఇమ్యునోగ్లోబిలిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని, రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం మరింత కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1,200 ఇమ్యునోగ్లోబిలిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని, మరో 6,000 ఇంజెక్షన్లను సమకూర్చుకునేందుకు చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎన్.వి.సుందరాచారి మాట్లాడుతూ 1834 లోనే ఈ వ్యాధిని గుర్తించారని, ఇది చాలా పురాతనమైన వ్యాధే అని, పలు రకాల ఇన్ఫెక్షన్ల వల్ల ఈ వ్యాధి ప్రబలే అవకాశం ఉందన్నారు. సాధారణ జలుబుగా ఈ వ్యాధి ప్రారంభమై అజాగ్రత్తగా ఉంటే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందన్నారు. కాబట్టి ఈ వ్యాధి లక్షణాలు ఏమాత్రం బయపడినా సరే వెంటనే వైద్యులను సంప్రదించి తగు వైద్య సేవలు పొందాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డా.నరసింహం కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.