- నాగరికతల గురించి తెలియని వాళ్లు రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరం
- కూటమి ప్రభుత్వం వచ్చాకే విద్యారంగంలో సంస్కరణలు
- విద్యావ్యాప్తిలో సిద్ధార్థ అకాడమీ విద్యా సంస్థల కృషి అభినందనీయం
- అకాడమీ స్వర్ణోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు
విజయవాడ (చైతన్యరథం): ప్రపంచ ప్రఖ్యాత వర్సిటీలను అమరావతికి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. అమరావతిని ఎవరూ కదపలేరని, నీరు ఉన్న చోటే నాగరికత అభివృద్ధి చెందిందని, అది తెలియని వారు రాజకీయాల్లో ఉండటం బాధాకరమని అన్నారు. విజయవాడలో శనివారం సిద్ధార్థ అకాడమీ విద్యా సంస్థల స్వర్ణోత్సవాల్లో ముఖ్యఅతిథిగా చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…..బదు దశాబ్దాలు పూర్తి చేసుకొని గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్న సిద్ధార్థ అకాడమీ విద్యా సంస్థలకు మనస్పూర్తిగా అభినందనలు తెలపుతున్నానన్నారు. సిద్దార్థ అకాడమీ సిల్వర్, గోల్డెన్ జూబ్లీ వేడుకలు రెండిటికీ హాజరవడం సంతోషంగా ఉంది. క్రమశిక్షణ, విలువలకు ప్రాధాన్యత ఇచ్చి లక్షలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. విజయవాడను విద్యలవాడ చేయడంతో సిద్ధార్థ అకాడమీ ముఖ్య భూమిక పోషించింది. విజయవాడ పేరు చెప్పగానే చదువుల సరస్వతి కొలువైన ప్రాంతం అనిపిస్తుంది. దేశంలో ఎక్కడెక్కడ నుంచో చదువుకోవడానికి విజయవాడ వస్తుంటారు. ఐఐటీ, జేఈఈ, నీట్, లాసెట్ సహా ఏ జాతీయ స్థాయి పరీక్షల్లో ర్యాంక్ రావాలన్నా విజయవాడలో చదవాల్సిందేనని సీఎం చంద్రబాబు అన్నారు.
అగ్రిటెక్ కళాశాల ఏర్పాటుకు సహకరిస్తాం ఒక విద్యా సంస్థ 50 ఏళ్ల ప్రస్థానం అంటే చిన్న విషయం కాదు. సిద్ధార్థ అకాడమీ సంస్థలు అగ్రిటెక్ కళాశాలను ఏర్పాటుచేస్తే ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. పేద, మధ్య తరగతి వాళ్లకు విద్యను అందించాలనే సంకల్పంతో 1975లో నాటి విజయవాడ ప్రముఖులు పిన్నమనేని వెంకటేశ్వరరావు, వైవీ రావు, సుబ్బారావు చేతుల మీదుగా ఈ విద్యాసంస్థలకు బీజం పడింది. సుమారు 28 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా, 4 వేల మంది టీచింగ్-నాన్ టీచింగ్ సిబ్బంది ఈ విద్యాసంస్థల్లో పనిచేస్తున్నారు. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ఇంజినీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్, లా, బీఎడ్, ఫార్మసీ, డెంటల్, హెూటల్ మేనేజ్మెంట్ లో వేల మంది విద్యార్థులు ఇక్కడ నుంచి వెళ్లారు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సూచన మేరకు సిద్ధార్ధ వైద్య కళాశాలను ప్రభుత్వానికి అప్పగించారు. ఆ తర్వాత దేశంలోనే తొలి మెడికల్ యూనివర్సిటీని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.
ప్రపంచంలోనే మేటి నగరంగా అమరావతి కొందరి అసూయకు హద్దు లేకుండా పోతోంది.
గత పాలనలో అమరావతిని ఆపేయాలని కుట్రలు చేస్తే ఏమయ్యారో చూశాం. అయినా బుద్ధి రాలేదు. అమరావతి.. నదీ గర్భంలో నిర్మిస్తున్నారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ, చెన్నై, విశాఖ, నెల్లూరు, రాజమండ్రి ఎక్కడున్నాయో వారికి తెలియదా? ఎక్కడ నీరు ఉంటే అక్కడ నాగరికత అభివృద్ధి చెందుతుంది. నాగరికతల గురించి తెలియని వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరం. అమరావతి ప్రజా రాజధాని, దీనిని ఎవరూ ఆపలేరు. పవిత్ర జలాలు, మట్టితో పునీతు చేశాం. భవిష్యత్లో విజయవాడ, గుంటూరు, మంగళగిరి కలిసి ఉత్తమ నివాస ప్రాంతంగా తయారవుతుంది. ఆరు నెలల్లో అమరావతిలో
క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ వస్తుంది. రాబోయే రెండేళ్లలో క్వాంటమ్ కంప్యూటర్లు తయారుచేసి ప్రపంచానికి సరఫరా చేయబోతున్నాం. క్వాంటం
అల్గారిథమ్స్ నేర్పేందుకు విద్యార్థులకు, నిపుణులకు శిక్షణ అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
విద్యారంగంలో సంస్కరణలు
విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. నేను ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి కిలోమీటర్కు ఒక ఎలిమెంటరీ స్కూల్, మూడు కిలోమీటర్లకు అప్పర్ ప్రైమరీ స్కూలు, ఐదు కిలోమీటర్లకు హైస్కూల్, ప్రతి మండలంలో జూనియర్ కాలేజీ, ప్రతి రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజీ, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఏడాదికి రెండుసార్లు మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు నిర్వహిస్తున్నాం. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. విభజన చట్టం ద్వారా వచ్చిన ప్రతిష్టాత్మక కేంద్ర విద్యా సంస్థలను రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేశాం. ఐఐటీ తిరుపతి, ఐఐఎం-విశాఖపట్నం, ఐఐఎస్ఈఆర్ – తిరుపతి, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురం, ఐఐఐటీడీఎం-కర్నూలు, ఎన్ఐటీ- తాడేపల్లిగూడెం, ఎయిమ్స్ -మంగళగిరి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ-విశాఖపట్నం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్-కాకినాడ, గిరిజనుల విశ్వవిద్యాలయం-విజయనగరం జిల్లా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్- అమరావతిలో ఏర్పాటు చేశాం. ప్రపంచ ప్రసిద్ధ యూనివర్సిటీలను అమరావతి తీసుకొస్తామని సీఎం తెలిపారు.
అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి
విశాఖకు గూగుల్ వస్తోంది. ఇప్పటికే కాగ్నిజెంట్ వచ్చింది. టిసిఎస్ సహా అనేక ప్రతిష్టాత్మక సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు మొదలు పెడుతున్నాయి. రాయల సీమలో స్పేస్ సిటీ, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. కర్నూలు జిల్లా ఓర్వకల్లు డ్రోన్ హబ్ గా మారబోతోంది. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరుల చెంతకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వ సమాచారం మొత్తంలో ఆన్ లైన్లో అందుబాటులో పెడుతున్నాం. ఆరోగ్య రంగాన్ని ఏఐతో అనుసంధానించి చేసి అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు ఇంటి వద్దనే అందించే ఆలోచన చేస్తున్నాం. ఇప్పటికే టాటా సంస్థ సహకారంతో డిజిటల్ నెర్వ్ సెంటర్ సంజీవని కేంద్రాలనే మంచి ప్రాజెక్టును తీసుకొచ్చాం.. తిరుమలలో ఎన్టీఆర్ ప్రారంభించిన అన్నదాన కార్యక్రమం నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది. స్విమ్స్ ప్రాణదానం కార్యక్రమాన్ని ప్రారంభించాను. టీటీడీలో శ్రీవారి సేవకులు కార్యక్రమాన్ని ప్రారంభిస్తే నేడు సేవ చేసేందుకు లక్షలాదిమంది స్వచ్ఛందంగా వస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో శ్రీవారి దేవాలయాలను నిర్మిస్తాం. ప్రపంచంలో హిందువులు ఉన్న చోట్ల కూడా ఏర్పాటు చేస్తాం. ప్రధాని మోదీ సమర్థ పాలనలో 2047 నాటికి ప్రపంచంలోనే భారత్ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటుంది. అదే సమయానికి ఏపీ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు.
















