- రివర్ బేసిన్‌కి, రివర్ బెడ్‌కి తేడా తెలియకుండా పిచ్చి మాటలు
- ల్యాండ్ పూలింగ్ సమయంలో రైతుల్లో భయం కలిగించేలా జగన్ తీరు
- రాజధానిపై మిడిమిడి జ్ఞానంతో మతిలేని విమర్శలు
- అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రంతో సీఎం చంద్రబాబు చర్చలు
- రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అమరావతి అభివృద్ధి
- మంత్రి నారాయణ స్పష్టీకరణ
అమరావతి (చైతన్యరథం): జగన్ ఎన్ని కుట్రలు చేసినా రాజధాని అమరావతి నిర్మాణం ఆగదని పురపాలకశాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని అమరావతి విస్తరణ కోసం ల్యాండ్ పూలింగ్ ప్రారంభమైన వేళ మాజీ సీఎం జగన్ మోహనరెడ్డి విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులను భయపెట్టేలా అమరావతి పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ అమరావతిపై జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. అసలు అమరావతిని నదిలో ఎక్కడ కడుతున్నామని ప్రశ్నించారు. నదీ గర్భంలో నిర్మాణాలు చేస్తున్నామని అసత్య ప్రచారం చేస్తున్నారు. కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారు. అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిర్మాణాలు జరగవు. నేతలు పూర్తిగా అవగాహన చేసుకుని మాట్లాడాలి. అమరావతి మాస్టర్ ప్లాన్‌ను అర్థం చేసుకుని మాట్లాడాలి. మిడి మిడి జ్ఞానంతో మాట్లాడం తప్పు. జగన్ ముందుగా రివర్ బేసిన్ కి, రివర్ బెడ్‌కి తేడా తెలుసుకోవాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన నగరాలన్నీ చాలా వరకూ నదీ తీరంలోనే వెలిసాయన్న మంత్రి…చెన్నై, కోల్‌కతాతో పాటు సింగపూర్ కూడా నదీ తీరంలోనే ఉందని స్పష్టత ఇచ్చారు. రాజధానిపై జగన్ మిడిమిడి జ్ఞానంతో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నది వెడల్పు ఎంత ఉంది…నదీ ప్రవాహం ఎంత…కరకట్ట ఎంత ఉండాలి అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని అమరావతి నిర్మాణం చేస్తున్నామన్నారు. కరకట్ట వెడల్పుపైనా ఇరిగేషన్ అధికారులతో నిత్యం సంప్రదింపులు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పట్టా భూములు నదీ గర్భంలో ఎక్కడా లేవని స్పష్టం చేసారు. రెండో విడత భూ సమీకరణకు రైతులు ముందుకు వస్తున్నారు. గంటల వ్యవధిలో వందల ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చారు. ఇది చూసి ఓర్వలేకే జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అమరావతి ముందుకెళ్లిపోతోందన్న అసూయతోనే అవాస్తవాలు మాట్లాడుతున్నారు.
అమరావతిలో ఉన్న గ్రామాల్లో రోడ్లు, నీళ్లు అన్నీ ఉన్నాయన్నారు. విజయవాడ, మంగళగిరి వెళ్లేందుకు సీడ్ యాక్సిస్ రోడ్డు, వెస్ట్ బైపాస్ రోడ్లు కూడా సిద్ధమయ్యాయని మంత్రి నారాయణ చెప్పారు. అపోహలు సృష్టిస్తూ ప్రజలను జగన్ తప్పుదోవ పస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున రైతులు ముందుకు వస్తుండటంతో దాన్ని ఎలాగైనా ఆపేయాలని జగన్ విషపచారం చేస్తున్నారని మండిపడ్డారు..
అమరావతికి చట్టబద్ధత కల్పించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో అమరావతి రైతులు పడిన ఇబ్బందులను కేంద్ర పెద్దలకు సీఎం వివరిస్తున్నారని తెలిపారు….స్వయంగా ప్రధానిని కలిసి విన్నవించడంతో పాటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి అమఅరావతికి చట్టబద్ధత కల్పించాలని సీఎం చంద్రబాబు కోరినట్లు మంత్రి నారాయణ తెలిపారు..
రాష్ట్రానికి రాజధాని అనేది ఉండాలని….సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని ఎలా అయిపోతుందని జగన్‌కు మంత్రి నారాయణ కౌంటర్ వేసారు. ఇవాళ శ్రీకాకుళం వెళ్తే అదే రాజధాని అని….రేపు ఇంకో ప్రాంతం వెళ్తే అది రాజధాని అయిపోతుందా అని ఎద్దేవా చేసారు. ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని ఉంటుంది. ప్రతి జిల్లాకు హెడ్ క్వార్టర్, కలెక్టర్ కార్యాలయం ఉంటాయి. రాజధానిలో మంత్రులు, కార్యదర్శులు, అధికారులు అందరూ ఉండి.. ప్రజల సమస్యలను పరిష్కరిస్తారు. వచ్చే ఏడాదిన్నరలో రాజధానిలో ట్రంక్ రోడ్లు పూర్తి చేస్తాం.. రెండున్నరేళ్లలో లేఔట్ రోడ్లు పూర్తి చేస్తాం. మూడేళ్లలో ఐకానిక్ భవంతుల నిర్మాణం పూర్తవుతుందని మంత్రి నారాయణ తెలిపారు.
వర్షాల సీజన్‌లో పనులు కొంత ఆలస్యం అయ్యాయని…ప్రస్తుతం అమరావతి పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ స్పష్టం చేసారు. ల్యాండ్ పూలింగ్‌కు ముందుకొస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలిపారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అమరావతి అభివృద్ది చేసి తీరుతామని మరోసారి మంత్రి నారాయణ స్పష్టం చేసారు.













