మార్కాపురం (చైతన్య రథం): జనాభా సమతుల్యత గురించి ముఖ్యమంత్రి కొంతకాలంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రానున్న రోజుల్లో దేశం వృద్దాప్య సమస్యను ఎదుర్కోకుండా ఉండాలంటే… యువశక్తితో భారత్ ముందుకు వెళ్లాలంటే కుటుంబ నియంత్రణకు దూరంగా ఉండాలని సీఎం చెపుతున్నారు. ఎక్కువమంది పిల్లలను కనండి అని ఆయన అనేక సందర్భాల్లో ప్రజలకు పిలుపునిచ్చారు. పిల్లల్ని కనకపోవడంవల్ల, మితిమీరిన జనాభా నియంత్రణవల్ల పాశ్చాత్య దేశాల్లో ఎదురుతున్న సమస్యలను ఆయన పదేపదే గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే నిబంధనను తొలగించారు. ఈమేరకు చట్టంలో మార్పులు చేశారు. పిల్లల్ని కనిపెంచే విధానాలను ప్రోత్సహించాలని ఈరోజు మరో కీలక నిర్ణయం ప్రకటించారు. సాధారణంగా ప్రతి మహిళా ప్రభుత్వోద్యోగినికి రెండు కాన్పులకు ప్రభుత్వం ప్రసూతి సెలవులు ఇస్తుంది. ఆరు నెలల చొప్పున జీతంతో కూడిన సెలవులు వారికి ఉంటాయి. అయితే ఎక్కువమంది పిల్లల్ని కనండి అని చెపుతున్న ముఖ్యమంత్రి…. దాన్ని ప్రోత్సహించేందుకు ఇకపై ఎంతమంది పిల్లల్ని కన్నా.. అన్ని కాన్పులకూ ప్రసూతి సెలవులు ఇస్తామని ప్రకటించారు. ఇది అమల్లోకి వస్తే…. ఎన్ని కాన్పులు జరిగినా అన్నింటికీ ఆ ఉద్యోగినికి ప్రసూతి సెలవులు లభిస్తాయి. ఉమెన్స్ డే రోజు సీఎం వారికి ఉపయోగకరమైన నిర్ణయాన్ని వారి కోరిక మేరకు ప్రకటించారు.