హెచ్‌ఎం ఫయాజుద్దీన్, టీచర్లకు కృతజ్ఞతలు
అమరావతి (చైతన్యరథం): కర్నూలు జిల్లా ఆదోనిలోని నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టిన విషయం తెలిసి చాలా ఆనందించానని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. 1,725 మంది విద్యార్థులున్న ఆ స్కూల్లో ఈ ఏడాది అన్ని తరగతుల్లో 400 మందికిపైగా కొత్త విద్యార్థులు చేరడం ప్రభుత్వ విద్య పట్ల ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమన్నారు. ఈ మేరకు మంత్రి లోకేష్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. నో అడ్మిషన్ బోర్డు పెట్టి, అడ్మిషన్లు అయిపోయాయని తల్లిదండ్రులకు నచ్చచెబుతున్నా.. మా పిల్లాడిని ఒక్కడిని చేర్చుకోండి సార్ అని బతిమాలుతుంటే కాదనలేకపోతున్నామంటున్న హెడ్మాస్టర్ ఫయాజుద్దీన్, టీచర్లు, సిబ్బందికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రతి స్కూల్లో ఇలాగే నో అడ్మిషన్ బోర్డులు కనిపించాలి. తల్లిదండ్రుల్లో ప్రభుత్వ విద్య పట్ల నమ్మకం కల్పించిన ఉపాధ్యాయులే ఏపీ మోడల్ ఎడ్యుకేషన్‌ను తీర్చిదిద్దే రథసారథులు అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.