- ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
- మంత్రి నారాయణతో కలిసి లాంఛనంగా ప్రారంభం
- ఘనస్వాగతం పలికిన స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల సిబ్బంది
- పాఠశాల మొత్తం కలియతిరిగి విద్యార్థులను ఉత్సాహపరిచిన మంత్రి లోకేష్
నెల్లూరు (చైతన్యరథం): నెల్లూరు నగరంలో వీఆర్(వెంకటగిరి రాజా వారి) మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఎంతోమంది ప్రముఖులు చదువుకున్న వీఆర్ హైస్కూల్ గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురై మూతపడిరది. 1875లో నగరం నడిబొడ్డున 12 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన పాఠశాలలో స్థానికులతో పాటు పొరుగు జిల్లాల నుంచి వచ్చి ఎంతోమంది విద్యార్థులు చదువుకున్నారు. ఈ పాఠశాలలోనే చదువుకున్న పురపాలక శాఖ మంత్రి నారాయణ చొరవ తీసుకుని రూ.15 కోట్ల వ్యయంతో పాఠశాలను ఆధునీకరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దిన వీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌ను పురపాలక శాఖ మంత్రి నారాయణతో కలిసి మంత్రి నారా లోకేష్ సోమవారం ప్రారంభించారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ పి.షరణితో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పీ-4 స్ఫూర్తితో డీఎస్‌ఆర్ గ్రూప్స్ నిధులతో మూలాపేటలో బాలికల ఉన్నత పాఠశాల, వీపీఆర్ ఫౌండేషన్ నిధులతో ఆర్‌ఎస్‌ఆర్ మున్సిపల్ హైస్కూల్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు శంకుస్థాపన చేశారు. ముందుగా కళాశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, పాఠశాల సిబ్బంది ఘనస్వాగతం పలికారు.
భిక్షాటన చేసే ఇద్దరు చిన్నారులకు అడ్మిషన్
వీఆర్ స్కూల్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి లోకేష్ ముందుగా.. పాఠశాలలో తమకు చదువు చెప్పించాలని గత శనివారం కమిషనర్‌ను అభ్యర్థించిన ఇద్దరు చిన్నారులు సీహెచ్ పెంచలయ్య, వి.వెంకటేశ్వర్లకు అడ్మిషన్ ఫాంలు తన చేతుల మీదుగా ఏవో వెంకటరమణకు అందజేశారు. చిన్నారుల విద్యాభ్యాసానికి అండగా నిలుస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. చిన్నారులు కష్టపడి బాగా చదువుకోవాలని, భవిష్యత్‌లో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
పాఠశాల మొత్తం కలియతిరిగి విద్యార్థులను ఉత్సాహపరిచిన మంత్రి లోకేష్
అత్యాధునిక వసతులతో ఏర్పాటుచేసిన వీఆర్ మున్సిపల్ హైస్కూల్ తరగతి గదులను మంత్రి లోకేష్ పరిశీలించారు. పాఠశాల మొత్తం కలియతిరిగి విద్యార్థులను, ఉపాధ్యాయులను ఉత్సాహపరిచారు. యాక్టివిటీ రూమ్, కెమిస్ట్రీ ల్యాబ్, బయాలజీ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, హైడ్రోపోనిక్స్ ల్యాబ్, రోబోటిక్ లాబ్, లైబ్రరీ, డాన్స్, మ్యూజిక్, డ్రాయింగ్ రూమ్‌లు పరిశీలించారు. ఉపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరితో ఫొటో దిగారు. అనంతరం ఆధునిక సదుపాయాలతో ఏర్పాటుచేసిన పాఠశాల క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. క్రికెట్, వాలీ బాల్ ఆడి విద్యార్థులను ఉత్సాహపరిచారు.
పేదరికం నుంచి బయటపడాలంటే విద్య ఒక్కటే ఏకైక సాధనం
పేదరికం నుంచి బయటపడాలంటే విద్య ఒక్కటే ఏకైక సాధనం అని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ప్రపంచాన్ని విద్య ఏ రకంగా మారుస్తుందని ఏడో తరగితి చదివే పర్నీక్ సాయి ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ను ప్రశ్నించారు. ఇందుకు మంత్రి సమాధానం ఇస్తూ.. మంచి ప్రశ్న అడిగావు. పేదరికం నుంచి బయటపడాలంటే విద్య ద్వారానే సాధ్యం. చదువు ద్వారానే ఉన్నతస్థానానికి వెళ్లగలం. ఎడ్యుకేషన్, ఇమ్మిగ్రేషన్ బలమైన సాధనాలు. నువ్వు కంపెనీ ప్రారంభించి పది మందికి ఉద్యోగాలు కల్పించాలని పర్నీక్ సాయిని ఉత్సాహపరిచారు.
వాల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటే ఏమిటి?
తరగతి గదుల పరిశీలన సందర్భంగా ‘వాల్ ఆఫ్ గ్రాటిట్యూడ్’ అంటే ఏమిటని ఐదో తరగతి విద్యార్థినిని మంత్రి లోకేష్ ప్రశ్నించారు. మనం ఈ స్థాయికి రావడానికి కారణమైన వారికి కృతజ్ఞతలు తెలపడం అని వివరించారు. తాను ఈ స్థాయికి రావడానికి తన తల్లి కారణమని ఈ సందర్భంగా చెప్పారు. ఆమే తనకు క్రమశిక్షణ నేర్పించారని, ఆమె వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని మంత్రి భావోద్వేగానికి గురయ్యారు.
విద్యార్థులు తన చిత్రంతో రూపొందించిన ఆటన్ క్రాఫ్ట్‌పై మంత్రి లోకేష్ సంతకం చేశారు. కోయంబత్తూర్ తర్వాత వీఆర్ స్కూల్‌లో ఏర్పాటుచేసిన రెండో హైడ్రోపోనిక్స్ ల్యాబ్‌ను మంత్రి పరిశీలించారు. విద్యార్థులకు హైడ్రోపోనిక్స్ విధానంపై ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. మట్టి లేకుండా నీరు, కొబ్బరి పీచుతో మొక్కలను పెంచడమే హైడ్రోపోనిక్స్ విధానం అంటూ విద్యార్థులు మంత్రి లోకేష్‌కు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కలెక్టర్ ఓ.ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.