- టీడీపీ, జనసేన, బీజేపీ శాశ్వతంగా ఐక్యంగా ఉండాలి
- మూడు పార్టీలు సమిష్టిగావుంటే మరో పార్టీకి అవకాశం రాదు
- అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి..
- ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు
- వైసీపీతో లాలూచీ నేతలను కూటమి దగ్గరకు రానివ్వొద్దు
- కార్యకర్తలు, పార్టీ కోసం పని చేయని వాళ్లు మనకొద్దు
- గోదావరి వృధాజలాలు బనకచర్లకు తీసుకెళ్తుంటే అభ్యంతరం తగదు
- కాళేశ్వరం నిర్మాణానికి ఏపీ అభ్యంతరం చెప్పలేదు…
- రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలనేదే నా కల
- తెలుగుజాతి కోసం పుట్టిన పార్టీ టీడీపీ…
- తెలుగు ప్రజలెక్కడున్నా వారికోసం పార్టీ పనిచేస్తుంది
- పట్టభద్రుల ఎమ్మెల్సీల విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబు
- ఆలపాటి, పేరాబత్తుల ఘనవిజయంపై కూటమి నేతలు, కార్యకర్తలకు అభినందన
అమరావతి (చైతన్య రథం): ‘ఎన్డీయే గెలుపు రాష్ట్ర పునర్‌నిర్మాణానికి సంజీవని’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని అన్నారు. మూడు పార్టీల నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఐకమత్యంతో మెలగాలని, ఒకరినొకరు గౌరవించుకునే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాలని కార్యకర్తలను కోరారు. మూడు పార్టీలు ప్రజల్లోవుంటే భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉండదని, శాశ్వతంగా ఎన్డీయేనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి కృష్ణా- గుంటూరు, ఉమ్మడి తూర్పు -పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో మంగళవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావోద్వేగంగా మాట్లాడారు.
భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్సీలకు అభినందనలు
ఎన్డీయే తరపున విజయం సాధించిన ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తలు రాజశేఖరాన్ని అభినందిస్తున్నా. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 57 శాతం ఓట్లతో, 93 శాతం స్ట్రైక్‌రైట్‌తో గెలిచాం. ఇప్పుడు పోటీ చేసిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఘన విజయం సాధించాం. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన శ్రీనివాసులుకు రెండో ప్రాధాన్యత ఓటు వేయాలని పిలుపునిచ్చాం. 2023లో జరిగిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గెలిచాం. ప్రజలకు మనపైవున్న విశ్వాసంతో గెలిపించారు. పనిచేసే వారినే ప్రజలు గెలిపిస్తారు. పొత్తులో భాగంగా తెనాలి సీటును నాదెండ్ల మనోహర్ కేటాయిస్తున్నామని చెప్పగానే ఆలపాటి రాజేంద్ర ఎదురు మాట్లాడకుండా సహకరించారు. నాదెండ్ల మనోహర్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి భారీ మెజారిటీ తీసుకొచ్చి మాట నిలబెట్టుకున్నారు. పార్టీకోసం కష్టపడి పనిచేస్తున్న పేరాబత్తుల రాజశేఖరానికి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాం.
ఐక్యంగా పనిచేస్తే కూటమికి తిరుగుండదు
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కలిసి పనిచేస్తే కూటమికి తిరుగు ఉండదు. అధికారంలోకి వచ్చాక విజయం కోసం పనిచేసిన వారిని విస్మరించకూడదు. కలిసి పనిచేసినప్పుడే ఫలితాలు ఘనంగా ఉంటాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలందరికీ ఒకే పిలుపిచ్చాం… రాష్ట్రాన్ని పునర్‌నిర్మించాల్సిన అవసరం ఉంది. కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత తీసుకోండని కోరాం. వందకువంద శాతం పని చేశారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిశాం, కూటమి విజయానికి పనిచేయాలని జన సైనికులను పవన్ కళ్యాణ్ కోరితే వారు కూడా బ్రహ్మాండంగా పని చేశారు. పురంధేశ్వరి పిలుపుతో బీజేపీ కార్యకర్తలు క్రమశిక్షణతో పని చేశారు. ఆ ఎన్నికల్లో సమైక్యంగా పనిచేసి విజయం సాధించాం.
మూడుముక్కలాటతో సర్వనాశనం చేశారు
రాజధాని అమరావతిని స్మశానం అన్నారు. మూడు రాజధాననుల పేరిట మూడు ముక్కలాటలాడి అభివృద్ధి చేయకుండా సర్వనాశనం చేశారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.15 వేల కోట్లు ప్రపంచబ్యాంకు ద్వారా అందించింది. మేం 72 శాతం పనులు పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు. 2019లో మళ్లీ మన ప్రభుత్వం వచ్చివుంటే 2020కి పోలవరం పూర్తయ్యేది. కానీ గత ప్రభుత్వం చేతకానితనంవల్ల డయాఫ్రంవాల్ కొట్టుకుపోయింది. విచ్ఛిన్నమైన ప్రాజెక్టును చూసి బాధపడ్డ మొదటి వ్యక్తిని నేను. పండుగపూట కూడా కేంద్రమంత్రిని కలిసి ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని ఒత్తిడి తెచ్చాను. ఇటీవల కేంద్రం ముందుకొచ్చి రూ.12,150 కోట్లు కేటాయించి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందకు సహకారం ఇచ్చింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ మళ్లీ రాదనుకున్నారు. ప్రధానమంత్రి, ఆర్థికమంత్రి, కార్మికశాఖ మంత్రితో ఒకటే చెప్పాను. స్టీల్‌ప్లాంట్ ఏపీ సెంటిమెంట్. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రాజెక్టు కోసం ప్రాణత్యాగం చేశారని, నిర్లక్ష్యం చేయొద్దని కోరా. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం రూ.11,400 కోట్లు కేటాయించింది. విశాఖ రైల్వే జోన్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. రైల్వేజోన్‌కు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. రాష్ట్రానికి 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం. తద్వారా 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి.
ప్రజలు మనల్ని నమ్మితే వదిలిపెట్టరు
ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఆలోచించాలి. మీరు శాశ్వతంగా ప్రజాప్రతినిధులుగా ఉండటం మీ చేతుల్లో ఉంది. వన్‌టైం ప్రతినిధిలుగా ఉండాలనుకుంటే మీ ఇష్టం. సాధారణంగా ప్రధాన పార్టీలు పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసేవి కాదు. స్వతంత్రులు నిలబడేవారు. కానీ రాయలసీమ పశ్చిమతో ప్రారంభించి ఐదు స్థానాలు గెలిచేదాకా వచ్చాం. ఏ వ్యక్తైనా రాజకీయాల్లో ప్రజలకు మంచి చేస్తే, మనం ఉన్నామని నమ్మితే ప్రజలు వదిలిపెట్టరు. కుప్పంలో నేను ఎనిమిదిసార్లు గెలిచాను. ప్రజలకు అందుబాటులో ఉండి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే నిత్యం గెలుస్తాం. మనపై చాలా బాధ్యతలున్నాయి. నాల్గవసారి సీఎం అయ్యా. గత పాలకుల విధ్వంసంతో అన్ని విధాలా దోపిడీకీ గురైన రాష్ట్ర పరిస్థితి తలుచుకుంటే నిద్ర పట్టడం లేదు. ప్రజలకు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చాం. ఖజానా చూస్తే దిక్కుతోచడం లేదు. క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎన్డీయే అనునిత్యం ఆలోచిస్తోంది. అధికారంలోకి రాగానే మొదటి నెలలోనే రూ.4 వేలు పింఛన్ ఇచ్చాం. అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశాం. త్వరలోనే తల్లికి వందనం కింద రూ.15 వేలు, అన్నదాత కింద కేంద్రం ఇచ్చేవి కలుపుకుని రూ.20 వేలు, మత్య్సకారులకు వేట నిషేధ సమయంలో రూ.20 వేలు ఇస్తాం. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చదువుకున్న వాళ్లు మనల్ని గెలిపించారు. గత ఎన్నికల్లో 57శాతం ఓట్లు వస్తే ఇప్పుడు 63 శాతానికి ఓటు శాతం పెరిగింది. ప్రజల్లో మరింత నమ్మకం పెరిగింది. పట్టభద్రులకు కూటమి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నా.
9 నెలల్లోనే తలసరి ఆదాయం పెరిగింది
డబుల్ ఇంజన్ సర్కారు ఉంటేనే అభివృద్ది ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రం కోసం పని చేస్తాయి. కేంద్రంలో ఏ చిన్న ఇబ్బంది ఉన్నా వెంటనే పరిష్కరించుకుని ముందుకెళ్లే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాం. భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీ కీలక పాత్ర పోషించబోతోంది, నాలెడ్జ్ ఎకానమిలో యువత, ఉద్యోగులు కీలక పాత్ర పోషించాల్సిన అవసరముంది. 2047నాటికి దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ ఉండాలనేది నా ఆకాంక్ష. 9 నెలల్లోనే 12.9 వృద్ధిరేటు సాధించాం. దీనిద్వారా తలసరి ఆదాయం పెరిగింది. హెల్తీ, వెల్దీ, హ్యాపీ సమాజమే లక్ష్యంగా ఎన్డీయే ముందుకెళ్తుంది. ఆదాయం ఉంటే చాలదు ఆరోగ్యం, ఆనందం ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే దానికి తగ్గ వేదిక ఉండాలి. సమాజంలో పేదరికం లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఆర్థిక అసమానతలు లేకుండా చేస్తామని మాటిస్తున్నా.
లాలూచీ పడి వైసీపీ నేతలకు పనులు చేయొద్దు
కొందరు టీడీపీ, కూటమి నేతలు వైసీపీకి పని చేస్తున్నారు. మీరు చేయాల్సింది… ఎన్డీయే నేతలకు, కార్యకర్తలకు. రాష్ట్రంలోని అర్హులందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాం. ప్రజలందరికీ అభివృద్ధి చేస్తాం. కార్పొరేషన్ చైర్మన్లు, ట్రస్ట్ బోర్డుల్లో ఎన్డీయే నాయకులుంటారు. ఆ గౌరవం ఎన్డీయే నాయకులకే దక్కాలి. వైసీపీతో లాలూచీపడే నాయకులకు చెప్తున్నాం. మొన్న ఈ మాట చెప్పినందుకు వైసీపీ నేతలు గింజుకుంటున్నారు. వైసీపీ నేతలు లంచాలిచ్చి అవినీతి పనులు చేసుకోవాలని చూస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. మీ ఆటలు సాగనివ్వను. మళ్లీ చెప్తున్నా, సంక్షేమ కార్యక్రమాలు అర్హులందరికీ ఇస్తాం. దబాయించాలని చూస్తే పగటి కలలే మిగులుతాయి. గత పాలకులు రాజకీయాలను కలుషితం చేశారు. రాజకీయ ముసుగులో నేరాలు, ఘోరాలు చేశారు. తప్పు చేసిన వారిపట్ల చట్టం తన పని తాను చేసుకుపోతుంది.
వృధా జలాలు బనకచర్లకు తరలిస్తే అభ్యంతరం చెప్పొద్దు
తెలుగుజాతికి విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ ప్రజలను కూడా కోరుతున్నా. పోలవరం నీళ్లు బనజకచర్లకు తీసుకెళ్తాం. సముద్రంలోకి పోయే వృథానీటిని సీమకు తీసుకెళ్తామంటే అభ్యంతరం చెప్పొద్దు. తెలుగుదేశం పార్టీ తెలుగుజాతి కోసం పెట్టిన పార్టీ. నాడు, నేడు తెలుగుజాతి కోసమే పనిచేస్తాం. రాష్ట్ర విభజన సమయంలోనూ రెండు ప్రాంతాలు సమానమని, రెండుకళ్లని, సమన్యాయం చేయమని అడిగాను. రెండుచోట్లా నమ్మారు. తెలంగాణలో 20 స్థానాలిచ్చారు. ఇక్కడ అధికారమిచ్చారు. సముద్రంలోకి వెళ్లే నీటిని తీసుకెళ్తామంటే హక్కు లేదంటున్నారు. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును నేను ఎక్కడా, ఎప్పుడూ వ్యతిరేకించలేదు, స్వాగతించాను. గోదావరిపై ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకోమని చెప్పా. గోదావరి తెలుగువారికి శ్రీరామ రక్ష. ఏటా వెయ్యి టీఎంసీ నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. రాజకీయ నేతలు పాజిటివ్‌గా ఆలోచించాలి.
తెలుగుజాతి ప్రయోజనాలే… నా ప్రయోజనాలు
మోదీ దేశాన్ని నడిపిస్తే… తెలుగుజాతిని అగ్రజాతిగా చేయాలన్నది నా కోరిక. 45 ఏళ్లుగా నన్ను తెలుగు ప్రజలు ఆరాధించారు. జాతి ప్రయోజనాలే నా ప్రయోజనాలు. తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నా, కరువు ప్రాంతానికి నీళ్లు తీసుకెళ్తే బాధపడొద్దు. అవకాశముంటే మీరు మరిన్ని నీళ్లు తీసుకోండి.. మిగిలిన నీళ్లే మేం వాడుకుంటాం. గోదావరి నీళ్లు రాజమండ్రి దాటితే సముద్రంలోకి వెళ్తాయి తప్ప ఎవరూ వినియోగించుకోలేరు. తెలంగాణలో పడే వర్షాలతో నీళ్లు నిలబెట్టుకోలేకపోవడంతో నీరొచ్చి పడి విజయవాడ మునిగింది. పోలవరం నీళ్లు బనకచర్లకు తీసుకెళ్తే తెలంగాణ ప్రజలు కూడా 20నుంచి 30 టీఎంసీ ద్వాకా వాడుకోవచ్చు. ఏపీలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా తెలుగు ప్రజల కోసమే తెలుగుదేశం పార్టీ పని చేస్తుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.