- దేశం కోసం అంతా ఏకతాటిపైకి రావడం గొప్ప విశేషం
- ప్రపంచాన్ని పీడిస్తున్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదం
- ఉగ్రవాదంపై పోరులో త్రివిధ దళాలకు మద్దతుగా ఉందాం
- భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ శుభపరిణామం
- దేశ సమగ్రతకు ప్రధాని, కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తెలుగుజాతి అండగా ఉంటుంది
- ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటన
- రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆధ్వర్యంలో జరిగిన సర్వమత కార్యక్రమానికి హాజరైన సీఎం
అమరావతి (చైతన్యరథం): మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా నేషన్ ఫస్ట్ (దేశమే ప్రధానం) అనే నినాదంతో దేశాన్ని కాపాడుకోవాల్సి ఉందని, దేశ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరూ సంఘటితంగా ఉండాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవటంలో అందరం కలిసికట్టుగా ఉండాలన్నారు. ప్రపంచ శాంతిని ఉగ్రవాదం పట్టి పీడిస్తోందని, తీవ్రవాదం, ఉగ్రవాదం దేశంలో అనిశ్చిత పరిస్థితులకు, ఆర్థిక ఇబ్బందులకు కారణం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రాజ్ భవన్‌లో శనివారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ ఫెయిత్ (సర్వమత) కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.
పహల్గాంలో మారణకాండ సృష్టించారు
పహల్గాంలో ఉగ్రవాదులు మారణకాండ సృష్టించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదు… దేశ శాంతి, సుస్థిరతలను దెబ్బతీసే అంశం. మనందరం కులమతాలకు అతీతంగా ముక్తకంఠంతో ఉగ్రదాడిని ఖండిరచాం. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల బాధను ఎవరూ తీర్చలేరు. ఉగ్రవాదుల కాల్పుల్లో మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు పర్యాటకులు చనిపోయారు. మన దేశం ఉగ్రవాదంపై పోరాడుతోంది. పహల్గాం కాల్పుల తర్వాత సరిహద్దుల్లో ఐదారు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఈ సమయంలో మన త్రివిధ దళాలు వీరోచితంగా పోరాడాయి. ఈ పోరాటంలో కొందరు సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధంలో మన రాష్ట్రానికి చెందిన వీర సైనికుడు మురళీ నాయక్ ప్రాణాలు వదిలారు. 25 ఏళ్ల వయసులో దేశ రక్షణ కోసం ప్రాణాలు వదిలారు. తన దేహంపై జాతీయ జెండా కప్పుకుని చనిపోతానని చెప్పి వీరోచితంగా పాకిస్తాన్‌తో పోరాడి మురళీనాయక్ చనిపోయారని సీఎం చంద్రబాబు ఉద్వేగంతో చెప్పారు.
ప్రజల్ని బాధపెట్టే ఉగ్రవాదాన్ని ఉపేక్షించం
ఇతర దేశాలను దెబ్బతీసే ఆలోచన భారతదేశం చేయదు. మనదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూనే ఎవరైనా మనమీదకు వస్తే గట్టిగా సమాధానమిస్తాం. ప్రజల్ని బాధపెట్టే తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని ఎప్పటికీ ఉపేక్షించం. దేశంలోని ప్రతి కులం, ప్రాంతం, మతం దేశంకోసం పని చేస్తామని చెప్పాయి. ప్రజాస్వామ్యంలో విభేదాలు ఉండొచ్చు. అభిప్రాయలు, సిద్ధాంతాలను ఏకీభవించకపోవచ్చు. కానీ రాష్ట్ర, దేశ భవిష్యత్ కోసం ఎప్పుడూ వెనకడుగు వేసిన సందర్భాలు లేవు. మత విద్వేషాలు లేని రాష్ట్రం ఏపీ. అందుకే ఇక్కడ అన్ని మతాల ప్రతినిధులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దేశ రక్షణలో ప్రాణాలు పొగొట్టుకున్న సైనికుల త్యాగాన్ని మనం గుర్తు చేసుకుని సంఫీుభావంగా ఉండాలి. భారతదేశం చేసే పోరాటానికి సంఫీుభావాన్ని తెలియజేయాలి. సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రజలు ఐదారు రోజులు బాంబుల మోతతో ఇబ్బందులు పడ్డారు. చదువుకునే విద్యార్థులు స్వరాష్ట్రాలకు తిరిగొచ్చారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
కాల్పుల విరమణ శుభపరిణామం
శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు భారత్-పాక్ దేశాల ఆర్మీ ఉన్నతాధికారులు మాట్లాడుకుని కాల్పుల విరమణ చేయాలని నిర్ణయించారు. ఈ పిలుపు కూడా ముందు పాకిస్తాన్ నుంచి రావడంతోనే భారత్ అంగీకరించింది. మన దేశానికి యుద్ధం చేయాలనే ఆలోచన లేదు. కానీ ఉగ్రవాదం, తీవ్రవాదంపై రాజీలేని పోరాటం చేస్తామని కేంద్రం తెలిపింది. రెండు దేశాల ప్రతినిధులు 12వ తేదీన సమీక్ష చేసుకుంటామని ప్రకటించాయి. యుద్ధంలో నష్టపోయిన వారందరికీ సంతాపం తెలుపుతూ తీర్మానం చేద్దాం. దేశ సమగ్రతకు ప్రధాని, కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తెలుగుజాతి, ఏపీ ప్రజలు అండగా ఉంటారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.