- విశ్వయోగి రాకకు ఎదురుచూస్తున్న ఏపీ ఆత్మ!
- అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన
- స్వాగతం పలకనున్న సీఎం, డిప్యూటీ సీఎం
- 20 అడుగుల ఎత్తయిన ‘ఏ’ పైలాన్ ఆవిష్కరణ
- రూ.58వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
- 5 లక్షలమంది ఆహూతులతో బహిరంగ సభ
- 24 గంటలముందే ఎస్పీజీ ఆధీనంలో సభా ప్రాంగణం
- అటు భద్రతా ఏర్పాట్లు.. ఇటు ట్రాఫిక్ మళ్లింపు
- చారిత్రక దినంగా మిగిలిపోనున్న మే 2
అమరావతి (చైతన్య రథం): అమరావతి పనుల పునర్నిర్మాణ ప్రారంభోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శుక్రవారం రాజధాని పనులు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిలో దాదాపు రూ.58 వేల కోట్లకు పైగా పనులకు ప్రధాని శ్రీకారం చుట్టబోతున్నారు. పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి సూచికగా సుమారు 20 అడుగుల ఎత్తైన పైలాను ఆవిష్కరించనున్నారు. ఈ సభకు దాదాపు 5 లక్షల మందికి పైగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో అధికారులు.. రవాణా, భోజనం, పార్కింగ్, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.
ఎస్పీజీ ఆధీనంలోకి సభా ప్రాంగణం
సభా ప్రాంగణాన్ని ఇప్పటికే ప్రధాని భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించే ఎస్పీజీ తన ఆధీనంలోకి తీసుకుంది. ప్రధాని వేదికకు ఇరువైపులా రెండు వేదికలు ఏర్పాటు చేసి ఒకదానిపై మంత్రులు, మరో దానిపై అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఆశీనులయ్యేలా తొలుత ఏర్పాట్లు చేశారు. అయితే భద్రతా కారణాల రీత్యా ఈ రెండు వేదికలనూ తొలగించారు. ప్రధాన వేదికపై కేవలం 14 మందిని మాత్రమే అనుమతించారు. ప్రధాని మోదీతోపాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌తోపాటు కేంద్రమంత్రులను మాత్రమే ప్రధాన వేదికపైకి అనుమతించనున్నారు.
మోదీ షెడ్యూల్ ఇదే..
మోదీ శుక్రవారం మధ్యాహ్నం 2.55 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. మంత్రులతో పాటు కూటమి నేతలు ఆయనకు స్వాగతం పలకనున్నారు. అక్కడినుంచి హెలికాప్టర్లో సభాప్రాంగణానికి ప్రధాని చేరుకుంటారు. అక్కడ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయనను సాదరంగా ఆహ్వానిస్తారు. అక్కడినుంచి కారులో సభావేదిక వద్దకు ప్రధాని చేరుకొని అమరావతి పునర్నిర్మాణానికి సూచికగా పైలాన్ ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. తిరిగి సాయంత్రం 4.55 గంటలకు మోదీ ఢల్లీికి బయల్దేరి వెళ్లనున్నారు.
‘ఏ’ ఫర్…
అమరావతి పునర్నిర్మాణ పనుల్ని ప్రతిబింబించేలా ప్రభుత్వం ప్రత్యేకంగా పైలాన్ ఏర్పాటు చేస్తోంది. మే 2న అమరావతికి రానున్న ప్రధాని మోదీ ఈ పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. అమరావతిని సూచించేలా ఆంగ్ల అక్షరం ‘ఏ’ ఆకృతిలో పైలాన్‌ను రూపొందించడం విశేషం. అలాగే ఆంధ్రప్రదేశ్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌ను రిప్రజెంట్ చేసేలా ఈ పైలాన్‌ను తీర్చిదిద్దడం విశేషం. రాష్ట్రానికి గుండెలాంటి రాజధానికి ప్రత్యేక గౌరవం కల్పిస్తూ.. ‘ముకుళిత హస్తాలు’ సింబల్ స్ఫురించేలా కూడా ‘ఏ’ పైలాన్‌ను తీర్చిదిద్దుతున్నారు. బహిరంగ సభ వెనక వైపున ఈ పైలాన్‌ను ఏర్పాటు చేశారు. పైలాన్ మధ్యలో ప్రధాని మోదీ సహా ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరుల పేర్లను గ్రానైట్ రాళ్లపై చెక్కారు. దాదాపు 20 అడుగుల పొడవనున్న ఈ పైలాన్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
కట్టుదిట్టమైన భద్రత
ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. భద్రత, రవాణా, పార్కింగ్ ఏర్పాట్లను మంత్రుల కమిటీ ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి సుమారు 8వేల బస్సులు, 5వేలకు పైగా కార్లలో దాదాపు 5 లక్షల మందికిపైగా ప్రజలు బహిరంగ సభకు తరలిరానున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ప్రత్యేక వైద్య బృందాలను సైతం అందుబాటులో ఉంచారు. తాడికొండ నుంచి వెలగపూడి వరకు రాజధాని రైతులు ర్యాలీ చేపట్టనున్నారు. రైతుల కోసం ప్రత్యేకంగా ఐదు గ్యాలరీలను ఏర్పాటు చేశారు.
అందరికీ ఆహ్వానం
అలాగే, అమరావతి బహిరంగ సభకు రావాలంటూ ప్రత్యేకంగా 5వేల మంది పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. రాజధాని ప్రాంతవాసులకు ఇంటింటికీ వెళ్లి కుటుంబ సమేతంగా తరలిరావాలని అధికారులు కోరారు. వైకాపా అధినేత జగన్‌ను సైతం ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు జగన్ పీఎస్‌కు అధికారులు ఆహ్వానపత్రికను అందజేశారు. రాష్ట్ర ప్రజలందరినీ పేరుపేరున సీఎం ఆహ్వానించినట్టు అధికారులు తెలిపారు. ప్రధాని సభకు అందరూ హాజరు కావాల్సిందిగా సచివాలయ ఉద్యోగులకు సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ట్రాఫిక్ మళ్లింపు
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో విజయవాడ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీ వాహనాలు నగరంలోకి రాకుండా మళ్లింపు చేపట్టారు. ముఖ్యమైన నేతలు సభాప్రాంగణానికి చేరుకొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా డ్రోన్లు, అస్త్రం యాప్ పోలీస్ శాఖ పర్యవేక్షిస్తోంది.
50 వైద్య బృందాలు, అడ్వాన్స్డ్ అంబులెన్సులు
అమరావతి సభకు వైద్య ఆరోగ్యశాఖ వైద్య సేవలు ఏర్పాటు చేసింది. 50 వైద్య బృందాలు, అత్యాధునిక అంబులెన్సులు, మూడు తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు చేశారు. అలాగే, సభప్రాంగణంలో ఎమర్జెన్సీ స్పందనకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. సూపర్ స్పెషాలిటీ, స్పెషాలిటీ వైద్యులతో 50 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. అడ్వాన్స్డ్ లైఫ్ సిస్టమ్స్ ఆరు, బేసిక్ లైఫ్ సిస్టమ్స్ 21 అంబులెన్సులు సిద్ధంగా ఉంచారు. విమానాశ్రయం, హెలిప్యాడ్ వద్ద అంబులెన్సులతో కూడిన వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. కాన్వాయ్ మార్గం, గ్యాలరీలు, పార్కింగ్ ప్రాంతాల్లో ఈ వైద్య బృందాలను అందుబాటులో ఉంచారు. అలాగే, సభాస్థలి వద్ద ఒక్కోటి 10 పడకలతో మూడు తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు చేశారు.