టిడిపి అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లోనే పెద్ద ఎత్తున కంపెనీలు రాష్ట్రానికి వస్తాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా సోమవారం ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం సంజీవపురం లో వివిధ రాష్ట్రాలలో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు లోకేష్ ను కలిసి వారి సమస్యలపై విన్నవించారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం లేకుండా అన్నిరకాల పరిశ్రమలను పెద్ద ఎత్తున రాష్ట్రానికి తీసుకొస్తామని చెప్పారు. బాబు అంటే బ్రాండ్ హైదరాబాద్ లో చేసి చూపించాం. ఐటిలో ఎపిని ఇతర రాష్ట్రాలకు దీటుగా నిలబెడతామని వెల్లడించారు. టిడిపి హయాంలో ఐటి కంపెనీలు రాష్ట్రానికి తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డామని చెప్పారు. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకను కాదని మీ రాష్ట్రానికి ఎందుకు రావాలి అని అడిగే వారు.
వాళ్ళకి నేను ఒకటే చెప్పేవాడిని, మీ కంపెనీల్లో పనిచేస్తున్న ఎక్కువ శాతం మంది ఏపి వాళ్ళే ఉన్నారు కాబట్టి, మా రాష్ట్రంలో సెంటర్ ఏర్పాటు చెయ్యాలని అడిగేవాడిని అని వివరించారు. కంపెనీ ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు, రాయితీలు అన్ని వేగంగా ఇవ్వడం వల్లే హెచ్ సిఎల్, జొహో, కాండ్యుయెంట్, పై డేటా సెంటర్ లాంటి పెద్ద కంపెనీలు వచ్చినట్టు తెలిపారు. టిడిపి హయాంలో భౌగోళికంగా ఉన్న ప్రయోజనాల దృష్ట్యా ఒక్కో జిల్లాకి సంబంధిత పరిశ్రమలు తీసుకొచ్చాం.రాయలసీమ ను ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ హబ్ గా ప్రమోట్ చేసాం. ఉత్తరాంధ్ర లో ఎక్కువగా ఐటి కంపెనీలను ప్రోత్సహించాం.అని లోకేష్ వారికి వివరించారు.