టిడిపి అధికారంలోకి రాగానే అరటి రైతులకు గతంలో ఇచ్చిన సబ్సిడీలను అందిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం తాడిపత్రి నియోజకవర్గం టి కొత్తపల్లి గ్రామంలో అరటి రైతులు లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. టిడిపి అధికారంలోకి రాగానే రైతులకు బోరాన్, జింక్, జిప్సం వంటి రసాయనాలు సబ్సిడీపై అందిస్తామని లోకేష్ చెప్పారు.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయిందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం చేయాలంటే రైతులు భయపడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొని వున్నదని చెప్పారు. టిడిపి హయాంలో ప్రత్యేక రైతు బడ్జెట్ ప్రవేశపెట్టి వ్యవసాయరంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు.
అరటి సాగు చేసుకున్న రైతులకు 5ఎకరాల వరకు సబ్సిడీ అందించినట్లు చెప్పారు. నష్టపోయిన అరటి రైతులకు టిడిపి ప్రభుత్వం హెక్తారుకు రూ. 12 వేల సాయం అందిస్తే, వైసీపీ ప్రభుత్వం దానిని రూ.10 వేలకు కుదించిందన్నారు. చంద్రబాబు అసెంబ్లీలో నిలదీసే వరకు పంటల బీమా ప్రీమియం ను జగన్మోహన రెడ్డి చెల్లించలేదని ఆరోపించారు.