టిడిపి అధికారంలోకి వచ్చాక గ్రామసీమలకు గత వైభవం తెస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా శుక్రవారం బనగానిపల్లి నియోజకవర్గం టంగుటూరు గ్రామరైతులు యువనేత లోకేష్ ను కలిసిన తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో శనగపంట అధికంగా పండిస్తాం. కానీ గిట్టుబాటు ధర రావడం లేదు. గ్రామంలో సచివాలయాన్ని పూర్తిస్థాయిలో నిర్మించలేదు. హౌసింగ్ స్కీమ్ కింద ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు. టీడీపీ పాలనలో మంజూరైన పెన్షన్లను వైసీపీ నాయకులు రద్దు చేశారు.
రోడ్డు సమస్యపై అధికారులకు ఎన్ని అర్జీలు పెట్టినా ఫలితం లేదు. వైసిపి ప్రభుత్వం వచ్చాక ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. వ్యవసాయంపై అవగాహన లేని ముఖ్యమంత్రి రైతాంగాన్ని నట్టేట ముంచారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3,500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని చెప్పిన జగన్ నాలుగేళ్లుగా ముఖం చాటేశారు. 30 లక్షల ఇళ్లు కడతానని డబ్బాలు కొట్టిన జగన్. నాలుగేళ్లలో 5 ఇళ్లు మాత్రమే కట్టారు.
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కుంటిసాకులతో 6 లక్షల పెన్షన్లు తొలగించి తీరని అన్యాయం చేశారు. గత నాలుగేళ్లుగా గ్రామీణాభివృద్ధి పూర్తిగా పడకేసింది. రోడ్ల పై తట్టమట్టి పోసే దిక్కులేదు. పెట్టుబడులను తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం. ఇళ్లులేని పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించే బాధ్యత రాబోయే టిడిపి ప్రభుత్వం తీసుకుంటుంది అని లోకేష్ హామీ ఇచ్చారు.