మండుటెండలు, ఎడారిని తలపించే రాయలసీమ భూములు. అయినా తప్పని బడుగు జీవుల బతుకు పయనం. కొండ గుట్టల్లో గొర్రెలు మేపుతూ జీవనం. ఈ సమయంలో అనుకోని అతిథిలా వచ్చి నారా లోకేష్ గొర్రెల పెంపకం దారులను పలకరించారు. సమస్య సుడిగుండం లాంటి మండుటెండలో ఉన్న పెంపకందారులకు లోకేష్ భరోసా చల్లని నీటి చెలమలా కనిపించింది. శింగనమల నియోజకవర్గం, సోడనంపల్లి క్రాస్ వద్ద నుంచి యువనేత నారా లోకేష్ 66వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. కొద్ది దూరం వెళ్లాక దారికి దూరంగా కనిపించిన గొర్రెల పెంపకందారుల వద్దకి వెళ్లిన నారా లోకేష్ వాళ్ల జీవన స్థితిగతులు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మమ్మల్ని ఆదుకోండి…
సోడనంపల్లికి చెందిన శ్రీను మాట్లాడుతూ లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మా తాతకు టీడీపీ ప్రభుత్వం 18గొర్రెలు సబ్సిడీపై ఇచ్చింది.ప్రస్తుతం అవి 100కు పెరిగాయి. నేను చిన్నప్పటి నుండి గొర్రెల పెంపకం వృత్తిలో ఉన్నాను. మా తాత, మా తండ్రి, నేను గొర్రెల పెంపకాన్నే జీవనోపాధిగా చేసుకుని తుకుతున్నామని చెప్పారు. మాకు టిడిపి ప్రభుత్వంలో గొర్రెలు సబ్సిడీపై ఇచ్చేవారన్నారు. ప్రభుత్వ పశువుల ఆసుపత్రుల్లో గొర్రెలకు ఉచిత వైద్యం అందేది. సమయానికి మందులు అందేవని చెప్పారు. గొర్రెలకు ఇన్సూరెన్స్ కూడా ఇచ్చేవారన్నారు. కానీ నేడు ఇవేవీ మాకు అందడం లేదని చెప్పారు. మాకు సొసైటీలు ఉన్నాయి. వాటిలో ఒక్క పైసా కూడా నిధులు లేవని చెబుతున్నారాన్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు సబ్సిడీపై గొర్రెలను ఇచ్చి ఆదుకోవాలని, గొర్రెలను మేపేందుకు మాకు భూములు కేటాయించాలని, ఇంటివద్ద గొర్రెలకి ఆహారంగా ఇచ్చే పొట్టును అందించాలని, గొర్రెలకు ఇన్సూరెన్స్ కల్పించాలని, ఉచిత వైద్య సదుపాయం అందుబాటులోకి తీసుకురావాలని, గొర్రెల పెంపకం దారులకు భీమా పథకం అమలు చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ స్పందిస్తూ, మీలాంటి కష్టజీవులని కలుసుకుని, మీ సమస్యల్ని తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నట్టు తెలిపారు. గొర్రెల పెంపకందారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గతంలో నా దృష్టికి వచ్చాయని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీపై గొర్రెల యూనిట్లను అందించే ఏర్పాటు చేస్తామని చెప్పారు. సొంతంగా గొర్రెలు కొనుక్కోవాలనుకునే వారికి సబ్సిడీ రుణాలు అందిస్తామన్నారు. వేసవికాలంలో జీవాలకు తాగునీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. చంద్రన్న బీమా పథకాన్ని గొర్రెల కాపరులకు వర్తింపజేస్తామన్నారు. జగన్ రద్దు చేసిన పథకాలన్నీ టిడిపి అధికారంలోకి వచ్చాక పునరుద్దరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.