అజయ్ రెడ్డి, సాక్షిలపై లోకేష్ మరో న్యాయపోరాటం
అసత్యకథనాలపై క్రిమినల్ కేసులు దాఖలు
పాదయాత్రకి 4న విరామం… మంగళగిరి కోర్టులో వాంగ్మూలం
అసత్య కథనాలు ప్రచురించిన సాక్షి, కట్టుకథలతో ఆరోపణలు చేసిన అప్పటి స్కిల్ డెవలప్మెంటు చైర్మన్ అజయ్ రెడ్డిలపై టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు మంగళగిరి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులను దాఖలు చేసిన లోకేష్, వాంగ్మూలం నమోదుకు శుక్రవారం(4-8-2023)న కోర్టుకు హాజరు కానున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాగుతున్న యువగళం పాదయాత్ర నుంచి గురువారం రాత్రి ఉండవల్లి నివాసానికి చేరుకుని, శుక్రవారం ఉదయం మంగళగిరి కోర్టుకి లోకేష్ హాజరవుతారు.
స్కిల్ డెవలప్మెంటులో భారీ స్కాం అంటూ అప్పటి చైర్మన్ అజయ్ రెడ్డి 2022లో ప్రెస్ మీట్ పెట్టి నారా లోకేష్‌పై అసత్య ఆరోపణలు చేశారు. తనకు సంబంధంలేని అంశంలో చేసిన ఆరోపణలపై లోకేష్ తన న్యాయవాదులతో అజయ్ రెడ్డికి నోటీసులు పంపారు. ఆటునుంచి ఎటువంటి సమాధానం లేకపోవడంతో తన పరువుకి భంగం కలిగించిన అజయ్ రెడ్డిపై తగు చర్యలు తీసుకోవాలని మంగళగిరి కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. “స్కిల్ స్కాంపై ఈడీ కొరడా“ పేరుతో 2022 డిసెంబర్ నెలలో సాక్షిలో ఓ కట్టుకథతో కథనం వేశారు.
వాస్తవంగా జీఎస్టీ అవకతవకలకి పాల్పడిన కంపెనీలకి ఈడీ నోటీసులు ఇస్తే, దానిని స్కిల్ డెవలప్మెంట్ స్కాం పేరుతో అప్పటి టిడిపి ప్రభుత్వం, నాటి మంత్రి లోకేష్‌కి ఆపాదిస్తూ అసత్యాలు అచ్చువేసి వదిలేశారు. దీనిపై సాక్షికి తన న్యాయవాదులతో నోటీసులు పంపారు. నోటీసులు అందుకున్న సాక్షి పత్రిక ఎటువంటి వివరణ వేయకపోవడం, తిరుగు సమాధానం ఇవ్వడం గానీ చేయలేదు. తన పరువు ప్రతిష్టలకి భంగం కలిగించిన సాక్షిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ఈ రెండు కేసుల్లోనూ మంగళగిరి కోర్టులో లోకేష్ వాంగ్మూలం ఇవ్వనున్నారు.