టిడిపి అధికారంలోకి రాగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజి, ఎల్ ఈడి వీధి దీపాలు, సిమెంటు రోడ్లు నిర్మిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా బుధవారం నంద్యాల ఎన్ జిఓ కాలనీ వాసులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా కాలనీలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలి. ట్రాఫిక్ సమస్యలు పెరిగి రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. పరిష్కార చర్యలు తీసుకోవాలి. మా కాలనీలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. సమస్యను పరిష్కరించాలి.
కాలనీలో వీధిదీపాలు, పారిశుధ్య నిర్వహణ సరిగా లేదు. తగు చర్యలు తీసుకోవాలి. మీరు అధికారంలోకి వచ్చాక మా కాలనీ సమస్యలు పరిష్కరించాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కొత్త రోడ్ల మాట దేవుడెరుగు, ఉన్న రోడ్ల పాడైతే తట్ట మట్టిపోసే దిక్కులేదు. కనీసం బ్లీచింగ్ పౌడర్, వీధిదీపాలకు కూడా డబ్బుల్లేని దుస్థితికి మున్సిపాలిటీలను చేర్చారు. వాటర్ గ్రిడ్ ఏర్పాటు ద్వారా ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం. రోడ్లను విస్తరించి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు.