- ఆ తరువాతే చంద్రబాబు సభను బహిష్కరించారు
- జగన్ రెడ్డి కుటుంబం గురించి మేం ఏనాడూ మాట్లాడలేదు
- గతంలో చంద్రబాబు సభకు రాలేదంటూ అవాస్తవాలు మాట్లాడుతున్నారు
- మండలిలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం
అమరావతి (చైతన్యరథం): గత వైసీపీ పాలనలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రతిరోజూ అసెంబ్లీకి వచ్చారని, నా తల్లిని అవమానించిన తర్వాతే సభను బహిష్కరించారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శాసనమండలిలో వైసీపీ సభ్యుల దుష్ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలిలో గురువారం మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబునాయుడు పారిపోయారని వైసీపీ సభ్యులు అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు సభకు వచ్చారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. దీంతో కౌరవ సభ.. గౌరవ సభగా మారిన తర్వాతే వస్తా అని చంద్రబాబు శపథం చేసి సభను బహిష్కరించారు. ఆ రోజు నిండు సభలో నా తల్లిని అవమానించారు. ఈ రోజు కావాలనే సోషల్ మీడియాలో కూడా అదే విధంగా పోస్టులు పెడుతున్నారు. వైసీపీ సభ్యులకు ఇవన్నీ గుర్తులేవా. అవమానించలేదని మీరు ఏ విధంగా చెబుతారు. అప్పుడు సభలో మీరున్నారా? జగన్ తల్లి విజయలక్ష్మిని, చెల్లెలు షర్మిలని అవమానిస్తారు.
నా తల్లిని అవమానిస్తారు. నేను కూడా మాట్లాడవచ్చు. కానీ మేం ఏనాడూ ఆ విధంగా మాట్లాడలేదు. జగన్ రెడ్డి కుటుంబం గురించి మేం ఏనాడూ మాట్లాడలేదు. మా సభ్యులు కూడా మాట్లాడలేదు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించినా సభలో కూర్చోమంటారా? మేము మాట్లాడవద్దా. మేం మనుషులం కాదా? తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. 2022 వరకు చంద్రబాబునాయుడు ప్రతి రోజూ సభకు వచ్చారు. ప్రతి రోజూ సభలో నిలబడ్డారు. సింహంలా సింగిల్‌గా నిలబడి పోరాడారు. నా తల్లిని అవమానించారు గనుకనే బాధ తట్టుకోలేక సభను బహిష్కరించి బయటకు వెళ్లారు. మా ఎమ్మెల్యేలు సభలోనే ఉన్నారు. అదీ మా చిత్తశుద్ధి. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు ఎందుకు రావడం లేదు. జగన్ రెడ్డి కాకుండా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు కూడా రావటం లేదు. అయితే ఎవరిని అవమానించినా ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సమర్థించడం లేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ స్పందిస్తూ.. సమర్థించడం లేదని బొత్స మాట్లాడుతున్నారు. అయితే ఎవరైతే ఆ రోజు అవమానించారో వారికి మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు కదా. అది సమర్థించడం కాదా? మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స ఆలోచించాలి. రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారు. అన్నీ రికార్డెడ్‌గానే ఉన్నాయి. బొత్స ఎందుకు సమర్థిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని మంత్రి లోకేష్ తిప్పికొట్టారు.