- ర్యాలీకి పోటేత్తిన విజయవాడ ప్రజలు
- ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి ప్రారంభమైన యాత్ర
- బెంజ్ సర్కిల్ వరకు సాగిన వైనం..
- తిరంగా యాత్రలో వెల్లివిరిసిన దేశభక్తి
విజయవాడ (చైతన్య రథం): పహల్గాంలో ఉగ్రదాడులకు ప్రతిగా దేశ ప్రధాని మోదీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో.. దేశవ్యాప్తంగా శుక్రవారం తిరంగా యాత్ర ర్యాలీని భారత్ నిర్వహించింది. అందులో భాగంగా విజయవాడ నడిబొడ్డున బందర్‌రోడ్‌లో పెద్దఎత్తున నిర్వహించిన తిరంగా యాత్రకు ప్రజలు, యువత, మాజీ సైనికులు, విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. దాయాది దేశం పాక్‌పై భారత్ సాధించిన విజయ సంకేతంగా చేతుల్లో జాతీయ జెండాలను చేపట్టి దేశభక్తిని ప్రదర్శించారు. తిరంగా యాత్ర ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ జాతీయ నాయకురాలు పురందేశ్వరి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్దసంఖ్యలో పాల్గొని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి తిరంగా యాత్ర ప్రారంభమైంది. బందర్ రోడ్‌లోని పీవీపీ మాల్, వివంతా హోటల్ మీదుగా బెంజ్ సర్కిల్‌కు చేరుకుంది. తిరంగా యాత్రకు మద్దతుగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు జాతీయ జండాలు చేతబూని ముందుండి ర్యాలీని నడిపించారు. తిరంగా యాత్ర ర్యాలీకి వేల సంఖ్యలో ప్రజలు హజరై శత్రుదేశం దుశ్చర్యలపై భారత్ ప్రతీకారం తీర్చుకోవడాన్ని ప్రశంసించారు. మన దేశం ఒకరి జోలికి వెళ్లదు. ఎవరైనా మన దేశం జోలికి వస్తే చావుదెబ్బ తప్పదని ప్రపంచానికి చాటినట్లయిందని యువత తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ర్యాలీలో భారత మాతాకు జై అంటూ పెద్దపెట్టున నినాదాలు మిన్నంటాయి. బెంజ్ సర్కిల్‌లో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పురందేశ్వరీలు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మన రాష్ట్రానికి చెందిన మురళీనాయక్ అనే సైనికుడు దేశం కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టడం ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు. ముందుగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంవద్ద ఏర్పాటు చేసిన వేదికపై దేశ సౌభ్రాతృత్వాన్ని, సార్వభౌమత్వం చాటిచెప్పే విధంగా దేశభక్తీ గీతాలాపన, సాంస్కృతిక కార్యక్రమాలను విద్యార్థులు ప్రదర్శించారు. దేశభక్తి గీతాలు వీక్షకులను ఉర్రూతలూగించాయి.