- మీ కోసం అహర్నిశలు శ్రమిస్తా
- మంగళగిరి ప్రజలకు మంత్రి లోకేష్ హామీ
- నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తా
- భారీ మెజారిటీతో గెలిపించడం వల్లే పెద్దఎత్తున అభివృద్ధి
- జూన్ నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులు ప్రారంభిస్తాం
- 3వ రోజు మనఇల్లు ` మన లోకేష్ కార్యక్రమంలో పేదలకు ఇంటి పట్టాలు అందజేసిన మంత్రి లోకేష్
మంగళగిరి (చైతన్యరథం): దేశంలోనే మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మారుస్తా, మంగళగిరిని నెం.1గా తీర్చిదిద్దేందుకు ప్రజలందరి సహకారం కావాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మన ఇల్లు ` మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా యర్రబాలెం డాన్ బాస్కో స్కూలు ఆవరణలో సోమవారం మధ్యాహ్నం తాడేపల్లి మండల పరిధిలోని పెనుమాక, ఉండవల్లి, ఇప్పటం ప్రజలకు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… నివసిస్తున్న ప్రాంతంలోనే పట్టాలు ఇవ్వాలన్నది దశాబ్ధాలుగా మీ అందరి కల. గతంలో ఒక్కొక్కరికి జిరాక్స్ పేపర్లకే రూ.10వేలకు పైగా ఖర్చయ్యాయి, తిరిగితిరిగి చెప్పులరిగాయి. ఇవన్నీ చూసి మీకు పట్టాలిప్పిస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాను. ఇక్కడ మూడురకాల భూములున్నాయి. తొలివిడతలో 3వేలమంది పట్టాలిస్తున్నాం. 2వ విడతలో ఎండోమెంట్, రైల్వే భూముల్లో నివసించేవారికి పట్టాలిస్తాం. అటవీ, ఇరిగేషన్ భూములకు కొంత టైం పడుతుంది, 3వ విడతలో అందజేస్తాం. ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే గౌరవంగా మీకు ఇంటిపట్టాలు అందజేస్తున్నా. ఇచ్చిన మాట ప్రకారం 3వేల మందికి బట్టలుపెట్టి మరీ పట్టాలను అయిదురోజులపాటు నిలబడి ఇస్తున్నా, అది మంగళగిరి ప్రజలపై తనకున్న చిత్తశుద్ధి, కమిట్‌మెంట్ అని మంత్రి లోకేష్ చెప్పారు.
ఆ నిర్ణయమే నా జీవితాన్ని మార్చేసింది
ఒక నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుందని పెద్దలు అంటారు, నా జీవితాన్ని కూడా ఒక నిర్ణయం మార్చేసింది. ఆ నిర్ణయమే మంగళగిరిలో పోటీచేయడం. 2019 ఎన్నికల్లో 21రోజుల ముందు టీడీపీ అభ్యర్థిగా మీ ముందునిలబడ్డా… ఒకరినొకరు అర్థం చేసుకునేలోపే ఎన్నికలైపోయాయి, 5300 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యా… మొదటిరోజు బాధ కలిగింది. రెండోరోజు నుంచి నాలో కసి పెరిగింది. మంగళగిరి ప్రజలకు సేవచేయాలి, మంగళగిరి ప్రజల మనసు గెల్చుకోవాలన్న లక్ష్యంతో ఆనాటి నుంచి పనిచేశా. మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవని పథకాన్ని ప్రవేశపెట్టాం, ఈం ోజుకు కూడా ఉచితంగా మందులు ఇస్తున్నాం. మహిళలు సొంతకాళ్లపై నిలబడేందుకు కుట్టుశిక్షణ ఇచ్చి, మిషన్లు అందజేసి పని కల్పిస్తున్నాం. పిల్లలు ఆడుకునేందుకు సొంత నిధులతో క్రీడాప్రాంగణం ఏర్పాటు చేయడంతోపాటు మంగళగిరి ప్రీమియం లీగ్ కూడా ప్రవేశపెట్టాం. ఊళ్లలో పేద ఇళ్లలో పెళ్లిళ్లకు జరిగితే బట్టలు పెట్టాం. కోవిద్ సమయంలో ఆక్సిజన్, మందులు అందజేశాం. అమెరికా డాక్టర్లతో టెలిమెడిసిన్ అందజేశాం. ఇలా సొంత నిధులతో 26 సంక్షేమ కార్యక్రమాలు చేశానని మంత్రి లోకేష్ గుర్తు చేశారు.
భారీ మెజారిటీ వల్లే చర్చ లేకుండా ఆమోదం
రచ్చబండలో మీ అందరికీ చెప్పా, నేను ఓడిపోయిన సంఖ్యలో పదిరెట్ల మెజారిటీ 53వేలతో గెలిపించండి, మీ కోసం పోరాడతాను, మీరిచ్చే మెజారిటీ కొండంత బలం ఇస్తుందని చెప్పా. మంగళగిరి అభివృద్ధి కోసం చంద్రబాబు, పవనన్నతో పోరాడతానని హామీ ఇచ్చా. భారీ మెజారిటీతో గెలిపించబట్టే ఈరోజు నేను తీసుకెళ్లే ప్రతిపాదనలకు ఎటువంటి చర్చలేకుండా ఆమోదం తెలుపుతున్నారు. 2వ కేబినెట్ మీటింగ్‌లోనే వందపడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణానికి అప్రూవల్ వచ్చింది, ఈనెల 13వ తేదీన ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నామని మంత్రి లోకేష్ చెప్పారు.
మీ దెబ్బకు అవతలి నుంచి సౌండ్ లేదు
నేను ఓడిపోయినపుడు అందరూ ఎగతాళి చేశారు. ఇటీవల ఎన్నికల్లో మీరు కొట్టిన దెబ్బకు అక్కడనుంచి సౌండ్ లేదు. ఎన్నికలపుడు అందరూ సర్వేలు చేస్తారు. టీడీపీ సర్వేలో కూడా కుప్పంకంటే మంగళగిరి వెనకబడి ఉంది. ఎన్నికలయ్యాక చంద్రబాబును కలిసి మీకన్నా ఒక్క ఓటు అయినా ఎక్కువ వస్తుందని చెప్పా. చెప్పినట్లే అత్యధికంగా 91వేల మెజారిటీతో గెలిచా. ఇంటిపట్టాలతో పాటు భూగర్భ డ్రైనేజి, నీరు, భూగర్భ గ్యాస్, కరెంటు కార్యక్రమాలు కూడా చేపట్టాం, టెండర్లు నడుస్తున్నాయి. జూన్ నుంచి పనులు ప్రారంభమవుతాయి. నియోజకవర్గ వ్యాప్తంగా పార్కులు, చెరువులు అభివృద్ధి చేయాలని నిర్ణయించా. 8వ తేదీన మొదటి పార్కు మంగళగిరిలో ప్రారంభిస్తున్నా. మంగళగిరి నియోజకవర్గంలో 45 పార్కులు, 35 కమ్యూనిటీ హాళ్లు నిర్మించబోతున్నాం, 6 చెరువులు అభివృద్ధి చేయబోతున్నాం. లక్ష్మీనరసింహస్వామి గుడిని కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. మహా ప్రస్థానం పేరుతో శ్మశానాలు కూడా అభివృద్ధి చేస్తున్నాం. పద్ధతి ప్రకారం చేయాలనే ఉద్దేశంతో ఆచితూచి అడుగులు వేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
మంగళగిరిలో ప్రత్యేకహామీలు ఇచ్చాను, ఒక్కొక్క హామీ నెరవేరుస్తూ వెళ్తున్నా. మంగళగిరి పుణ్యమా అని రాష్ట్రమంతటా అభివృద్ధి చెందుతోంది. మంగళగిరి కోసం నేను రూపొందించిన శాశ్వత పట్టాల పంపిణీ కార్యక్రమం రాష్ట్రమంతటా అమలుచేసే పరిస్థితి వచ్చింది. అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులతో వత్తిడి పెరిగిందని రెవిన్యూ మంత్రి చెప్పారు. మీ పట్టాలు రెగ్యులరైజ్ చేస్తామని నేను చెప్పినపుడు అవుతుందా, లేదా అని మీరు అనుమానపడి ఉండవచ్చు. చిత్తశుద్ధితో మీ కోసం పనిచేశాం. ఒక్కరూపాయి తీసుకోకుండా 3వేల కుటుంబాలకు వెయ్యికోట్ల రూపాయల విలువైన భూములకు శాశ్వత హక్కు కల్పిస్తున్నాం. ఇది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ప్రజలంతా దీనిని గుర్తుపెట్టుకోవాలి. భారీ మెజారిటీతో గెలిపించి నాపై బాధ్యత పెంచారు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
నెం.1గా మార్చేందుకు ప్రజల సహకారం కావాలి
స్వచ్చ మంగళగిరి పేరుతో కార్యక్రమం చేపట్టాం. ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికులు ప్రతిగడపకు వచ్చి చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. ఎంటీిఎంసీ పరిధిలో వెయ్యిటన్నుల చెత్త బయటకువచ్చింది. రోడ్లపై చెత్త వేయొద్దని ప్రజలను కోరుతున్నా. స్వచ్ఛతలో మంగళగిరి నెం.1 కావాలి. ఒక ఏడాది ఓపికపడతా. ఆ తర్వాత చెత్తవేసినవారి ఇంటికివెళ్లి నేనే చెత్తఎత్తుతా. అన్నిరంగాల్లో మంగళగిరిని నెం.1గా మార్చేందుకు ప్రజల సహకారం కావాలి. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా. నా గౌరవం నిలబెట్టారు, పరువు కాపాడారు. అందుకే మంగళగిరి ప్రజలను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా, మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతానని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.