- కట్ పేస్ట్ చేసి తప్పుడు ప్రచారం
- పిఠాపురంలో సమస్యలు జీరో చేశామంటే.. వర్మను జీరో చేశామని మార్చారు
- మంత్రి నారాయణ స్పష్టీకరణ
విశాఖపట్నం (చైతన్యరథం): ఎన్డీఏలో పార్టీలన్నీ కలిసే ఉన్నాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను జీరో చేశామనే వ్యాఖ్యలపై మంత్రి నారాయణ స్పష్టత ఇచ్చారు. తన మాటల్ని కట్ పేస్ట్ చేసి తప్పుగా ప్రచారం చేస్తున్నారన్నారు. శుక్రవారం విశాఖపట్నంలో మంత్రి నారాయణను వర్మ కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. టెలీ కాన్ఫరెన్స్‌లో నేను మాట్లాడిన మాటలను కట్ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. నెల్లూరు నాయకులతో మాట్లాడుతూ పిఠాపురంలో ఉన్న సమస్యలను ప్రస్తావించాను. పిఠాపురంలో జనసేన, టీడీపీ ద్వితీయ శ్రేణి మధ్య ఉన్న విభేదాలను చర్చించి ‘జీరో’ చేశామని నేను చెప్పాను. పిఠాపురంలో సమస్యలు జీరో చేశామంటే.. వర్మను జీరో చేశామని మార్చారు. నా వ్యాఖ్యలు వక్రీకరించడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. కంటెంట్ మొత్తం బహిర్గతం చేసి ఉంటే వక్రీకరణలు ఎలా జరిగాయో అర్థం అయ్యేది. వక్రీకరించి విభేదాలు సృష్టించడం ఎవరి వల్ల కాదు. ఎన్డీఏ కూటమి చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇండిపెండెంట్‌గా 50 వేల ఓట్లతో గెలిచిన బలమైన నాయకుడు వర్మ. పిఠాపురంలో జనసేన, టీడీపీ సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయన్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ.. నారాయణ వ్యాఖ్యలపై అభూత కల్పనలు ప్రచారం చేశారన్నారు. పేటీఎం బ్యాచ్ చేసే అసత్య ప్రచారాలను తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. జనసేన, టీడీపీ మధ్య కాకినాడ జిల్లాలో మంత్రి నారాయణ వారధిగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కూటమి మధ్య విబేధాలు సృష్టించడం ఎవరి వల్ల కాదని తేల్చి చెప్పారు.