- పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగ్గా ఉండాలి
- మున్సిపల్ కమిషనర్లకు క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరి
- సజావుగా అన్న క్వాంటీన్ల నిర్వహణ
- మున్సిపాలిటీల్లో పెరిగిన పన్ను వసూళ్లు
- వర్క్‌షాప్‌లో మున్సిపల్ మంత్రి నారాయణ
విజయవాడ (చైతన్యరథం): మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణలో, ప్రజల అవసరాలు తీర్చడంలో అధికారులు, సిబ్బంది అంకిత భావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో గురువారం మున్సిపల్ కమిషనర్ల రాష్ట్ర స్థాయి వర్క్ షాపును నిర్వహించారు. ఆ వర్క్ పాపుకు ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజల అవసరాలు తీర్చే విధంగా మున్సిపాలిటీలు స్వయం సమృద్ధి సాధించి వారికి కావలసిన నిధులను వారే సంపాదించుకునే విధంగా అన్ని మున్సిపాలిటీల్లో పన్నుల రాబడి పెంచేలా పనిచేయాలన్నారు. మున్సిపల్ శాఖపై ప్రజల్లో సంతృప్తి శాతం పెరిగేలా మున్సిపల్ కమిషనర్లు పనితీరు ఉండాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు శాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్‌లతో పాటు తాగు నీరు, వీధి దీపాలు, రోడ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. పేదలను ఇబ్బంది పెట్టకుండా పన్నుల వసూళ్లు పెరిగేలా కృషి చేయాలన్నారు.
పెరిగిన పన్ను వసూళ్లు
గతేడాది కంటే ఈ సంవత్సరం పన్నుల వసూళ్లు రూ.500 కోట్లు పెరిగాయంటూ మున్సిపల్ సిబ్బందికి మంత్రి అభినందనలు తెలియజేశారు. మున్సిపాలిటీల్లో రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు పన్నుల వసూలు చాలా కీలకం అన్నారు. పన్నుల ఆదాయంతో అనవసరమైన భవనాలు నిర్మించకుండా ఆ నిధులను ప్రజలకు కనీస వసతుల కల్పనకు మున్సిపాలిటీలు ఖర్చు చేయాలన్నారు. మున్సిపాలిటీల ఆదాయాన్ని ఆయా మున్సిపాలిటీలకే ఇచ్చేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. గుంటూరులో కుక్క కరిచి బాలుడు మృతి చెందడం చాలా బాధాకరం అన్నారు. 200 రోజులలోపు కుక్కలకు స్టెరిలైజేషన్ పూర్తి చేసేలా దృష్టి పెట్టాలన్నారు. మున్సిపాల్టీల్లో ఎస్టాబ్లిష్‌మెంట్, మౌలిక వసతుల కల్పన ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. నెల్లూరు మున్సిపాలిటీలో 2014-19 మధ్య పన్నుల వసూళ్లలో కొత్త విధానాన్ని అమలు చేసామన్నారు. దానివల్ల నెల్లూరు మున్సిపాలిటీలో రూ.1,067 కోట్లు రెవెన్యూ ఖర్చు పోగా రూ.40 కోట్ల రూపాయలు మిగుల ఆదాయం అప్పట్లోనే తీసుకురాగలిగామన్నారు. దీన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌గా ఖర్చుపెట్టే వెసులుబాటు నెల్లూరు మున్సిపాలిటీకి లభించిందన్నారు.
ఉత్తమ విధానాల అమలు
2014-19 మధ్య మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా తానే పని చేశానని ఆ సమయంలో రూపాయి కూడా మున్సిపాలీటీల్లో పన్నులు పెంచలేదన్నారు. లీకేజీలను అరికట్టి ఆదాయం పెంచామన్నారు, దానివల్ల 700 కోట్ల రూపాయల ఆదాయం లభించిందన్నారు.. నెల్లూరు మున్సిపాలిటీలో అప్పట్లో రూ.1,500 కోట్ల వరకు ఎస్సీ ఎస్టీ నిధులుఅందుబాటులో ఉన్నాయన్నారు. తాను ఇప్పటికి కూడా నెల్లూరు మున్సిపల్ పన్నుల ఆదాయం ఎంత పెరిగింది, ఎంత వసూలు చేసారు అనేది కూడా సమీక్షిస్తానన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 50 శాతం, మున్సిపల్ శాఖ ద్వారా 50 శాతం యంత్రాలు కొనుగోలు చేస్తామన్నారు. రాబోయే కాలంలో మెకనైజేషన్‌కి వెళ్లాల్సి ఉంటుందన్నారు. తాను విదేశాల్లో తిరిగినప్పుడు ముఖ్యంగా ఈ మధ్య బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా వాళ్లు సాలిడ్, లిక్విడ్ వేస్ట్, రోడ్లు, వాటర్, వీధి దీపాలు ఏ విధంగా ఆపరేట్ చేస్తున్నారో పరిశీలించానన్నారు. అక్కడ ఉన్న ఉత్తమ విధానాలను మన దగ్గర అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో 85 లక్షల టన్నుల వ్యర్థాలను అక్టోబర్ 2 లోపు తొలగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారన్నారు.. మున్సిపల్ కమిషనర్లు అందుకు తగ్గట్లు తమ కార్యాచరణ రూపొందించుకొని పనిచేయాలన్నారు. అమృత్, ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకు పనులకు సంబంధించి టెండర్లను త్వరలోనే పిలుస్తామన్నారు. వేసవి కాలంలో మహిళలు తాగు నీటి కోసం ఇబ్బంది పడకుండా తగిన సౌకర్యాన్ని కల్పించాలన్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణపై కూడా రెగ్యులర్‌గా పరిశీలించేలా స్పెషల్ ఫోకస్ పెట్టాలని మంత్రి నారాయణ ఆదేశించారు.
ఏడాది కార్యాచరణ నిర్దేశించుకోవాలి
పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ రాబోయే సంవత్సర కాలంలో ఏం చేయబోతున్నామో కార్యాచరణ నిర్దేశించుకుకోవాలన్నారు. ప్రస్తుతం నగరాల్లో 1.5 కోట్ల జనాభా ఉందని ఇది రాబోయే కాలంలో 2.5 కోట్లకు పెరుగుతుందని దాని ప్రకారం వసతులను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాపర్టీ టాక్స్ ఏడాదిలో 49 శాతానికి పెంచిన సిబ్బంది కృషి అభినందనీయమన్నారు. దీన్ని 80 శాతం వరకు పెంచేలా కృషి చేయాలన్నారు. గతంలో సక్రమంగా నిధులను ఖర్చు చేయకపోవటం వల్ల ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు విడుదల కాలేదన్నారు.. దేశంలో ఉత్తమ విధానాలు ఎక్కడ ఉన్నా వాటిని రాష్ట్రంలో అమలు చేసే విధంగా ముందుకు వెళ్లాలన్నారు..
స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర ధ్యేయం
పురపాలక పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ శాఖలో సీఎఫ్‌ఎంఎస్ కంట్రోల్ లేకుండా మన పరిధిలో వచ్చే రాబడిని మనమే ఖర్చు చేసుకునేలా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి మన మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, రోడ్లు, పార్కులు, స్ట్రీట్ లైట్స్. ఇలా ప్రాధాన్యతల ప్రకారం మున్సిపల్ నిధులు ఖర్చు చేసేలా ప్రణాళికా బద్దంగా చేయాలన్నారు. మున్సిపాలిటీల ఆదాయం పెంచేందుకు ఒక డ్రైవ్ చేపట్టి రూ. 500 కోట్లు అదనపు ఆదాయం వచ్చేలా కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. స్వచ్ఛాంద్ర, స్వర్ణాంధ్ర లక్ష్య సాధన ధ్యేయంగా పనిచేయాలన్నారు..
వర్క్ షాపులో స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్, మెప్మా ఎండీ తేజ్ భరత్, టిడ్కో ఎండీ సునిల్ కుమార్ రెడ్డి, గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎండీ ఎంకేవీ శ్రీనివాసులు, పట్టణ ప్రణాళికా విభాగం డైరెక్టర్ విద్యుల్లత, పబ్లిక్ హెల్త్ ఈఎన్‌సీ మరియన్న, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.