కుప్పం (చైతన్య రథం): కుప్పం ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వివిధ సంస్థలతో ఆరు ఎంఓయూలు కుదుర్చుకున్నారు. కుప్పం పరిధిలో వ్యర్ధాలనుంచి సంపద సృష్టించే ప్రాజెక్టు కోసం ఏజీఎస్- ఐటీసీతో ఒప్పందం కుదిరింది. వ్యర్ధాల సుస్థిర నిర్వహణపై ఇంటింటి ప్రచారం, పాఠశాలల్లో అవగాహనా కార్యక్రమాలను 15 ఏళ్లపాటు నిర్వహించేలా ఒప్పందం చేసుకున్నారు. కుప్పంలో మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయటం, మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు గ్రామీణ ప్రాంతాల్లో మార్కెటింగ్ అంశాలపై షీలీడ్స్ సంస్థతో ఒప్పందం కుదిరింది. కుప్పం నియోజకవర్గంలో 10వేలమంది మహిళల్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంతోపాటు గ్రామీణ మార్కెట్లను అందిపుచ్చుకునేలా శిక్షణ ఇచ్చేందుకు ఎంఓయూ కుదుర్చుకున్నారు. కుప్పంలో ఫైబర్ బోర్డు ఉత్పత్తి కోసం కింగ్స్ వుడ్ డెకార్ ప్రైవేట్ లిమిటెడ్తో ఎంఓయూ కుదుర్చుకున్నారు. రూ.1,100 కోట్ల పెట్టుబడితో మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డును కింగ్స్ వుడ్ సంస్థ ఉత్పత్తి చేయనుంది. ఈ యూనిట్ ఏర్పాటుతో 2012 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
కుప్పంలో 2 సీటర్ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ యూనిట్ ఏర్పాటుకు పయనీర్ క్లీన్ యాంప్స్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.150 కోట్ల పెట్టుబడితో ఏడాదికి 70నుంచి 100 మంది శిక్షణకు ఉపయోగించే 2 సీటర్ విమానాలను పయనీర్ యాంప్స్ లిమిటెడ్ తయారు చేయనుంది. మొత్తం 250 మందికి పయనీర్ క్లీన్ యాంప్స్ లిమిటెడ్ ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. బెంగుళురుకు చెందిన స్పేస్ టెక్నాలజీ సంస్థ ఎత్రేయాల్ ఎక్స్ ప్లోరేషన్ గిల్డ్ సంస్థతో అవగాహనా ఒప్పందం కుదిరింది. మీడియం లిఫ్ట్ లాంచింగ్ రాకెట్ రేజర్ క్రెస్ట్ ఎంకె-1 తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎత్రేయాలో ఒప్పందం చేసుకున్నారు. రూ.500 కోట్ల పెట్టుబడిని మూడు దశల్లో పెట్టేలా కార్యాచరణ, మొత్తం 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ఆగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ ఏర్పాటుకు రెడ్ బెర్రీ ఫుడ్ లాజిస్టిక్స్ ఒప్పందం కుదిరింది. రూ.300 కోట్ల పెట్టుబడితో 15 వేలమందికి ఉపాధి కల్పించేలా రెడ్ బెర్రి ఫుడ్ లాజిస్టిక్స్ సంస్థ ప్రతిపాదన సమర్పించింది. మామిడి, జామ, టమాటో పల్పింగ్ యూనిట్లను రెడ్ బెర్రీ ఫుడ్ లాజిస్టిక్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది.