- సీఎం చంద్రబాబు ముందు చూపుతో యంత్రాంగం అప్రమత్తం
- తుఫాన్ పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాల నిర్వహణ
- ప్రభుత్వంపై నిందలు మోపాలనేదే జగన్ దుష్ట పన్నాగం
- ఐదేళ్ల పాలనలో నిండా ముంచేసి నేడు అసత్య ప్రచారాలు
- ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి (చైతన్యరథం): మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే 98 శాతానికి పైగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తుఫాను వచ్చే అవకాశం ఉందన్న ముందస్తు హెచ్చరికలు వెలువడినే వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రజా ప్రతినిధులు, ప్రజలతో పాటు అధికార యంత్రాంగం మొత్తాన్నీ అప్రమత్తం చేశారని మంత్రి వెల్లడిరచారు. మూడు డిస్కంల పరిధిలోని సుమారు 1500 మంది సిబ్బందిని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నియమించి ప్రత్యేక విధులు కేటాయించామని తెలిపారు. విశాఖపట్నం, మచిలీపట్నం, బాపట్ల వంటి అత్యధిక తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చేశామన్నారు. తుఫాన్ పునరావాస కేంద్రాల్లో ఎప్పుడూ లేని విధంగా వైద్య శిబిరాలను నిర్వహించి బాధితులను కాపాడామని మంత్రి గొట్టిపాటి తెలిపారు.
12, 500 పైగా కొత్త విద్యుత్ స్తంభాలు….
సముద్ర తీర ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాలు, పట్టణాలలో 80 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచి చాలా విద్యుత్ స్తంభాలు విరిగి పోయాయని, కండక్టర్లు డ్యామేజ్ అయ్యాయని, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. ముందుస్తు జాగ్రత్త చర్యలో భాగంగా విద్యుత్ స్తంభాలను, ట్రాన్స్‌ఫార్మర్లను కూడా అందుబాటులో ఉంచుకున్నామని చెప్పిన ఆయన, ధ్వంసం అయిన ప్రాంతాల్లో మొత్తం 12,500 విద్యుత్ స్తంభాలను కొత్తవి మార్చామని చెప్పారు. అదే విధంగా 2,900 కిలోమీటర్ల మేర కండక్టర్లను, సుమారు మూడు వేల వరకు ట్రాన్స్‌ఫార్మర్లను మార్పిడి చేశామని మంత్రి తెలిపారు. భారీ స్థాయిలో గాలులతో చెట్లు కూలి, స్తంభాలు విరిగిపోవడంతో నష్టం జరిగిందని తెలిపారు. సీఎం చంద్రబాబు ముందస్తు అప్రమత్తతతో రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా., 24 గంటల్లోనే తుఫాన్ ప్రభావం నుంచి బయట పడి సాధారణ స్థితికి వచ్చామని మంత్రి చెప్పారు. అత్యధిక వర్షపాతం నమోదు అయిన నెల్లూరు, కావలితో పాటు మచిలీపట్నం వంటి కొన్ని ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశామన్నారు. పరిస్థితి అనుకూలించిన తరువాత సరఫరా పునరుద్ధరించామని తెలిపారు.
సీఎం చంద్రబాబు దిశా నిర్దేశంతో..
బాపట్ల, పర్చూరుతో పాటు మచిలీపట్నం వంటి కొన్ని ప్రాంతాల్లో సముద్రాన్ని తలపించే విధంగా నీరు నిలిచిపోయిందని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. అయినా సీఎం చంద్రబాబు దిశా నిర్దేశంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా బయట పడ్డామన్నారు. పునరావాస కేంద్రాల్లో మంచి ఆహారంతో పాటు వేడి నీళ్లు కూడా బాధితులకు అందించి వారికి అన్ని విధాలా బాసటగా నిలిచామని తెలిపారు. అదే విధంగా పంటలు నష్టపోయిన రైతులకు సత్వరమే పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని వారికి ధైర్యం చెప్పామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లకు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని, ఆక్వా, అగ్రి కనెక్షన్లతో పాటు మిగిలిన అందరికీ 48 గంటల్లో విద్యుత్ సరఫరా అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన కొన్ని ప్రాంతాల్లో స్థానికులతో పాటు కూటమి కార్యకర్తల సహాయ సహకారాలు తీసుకుని యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని మంత్రి గుర్తు చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా చేసిన పని ఎంతో సంతృప్తి నిచ్చిందన్నారు.
మట్టి అంటకుండా జగన్ రెడ్ కార్పెట్ పరామర్శలు…
ఐదేళ్లు అధికారం ఇచ్చిన ప్రజలను నిండా ముంచి సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డికి.. రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. గతంలో జగన్ తుఫాన్ పరామర్శలకు వెళ్లినప్పుడు కాళ్లకు మట్టి అంటకుండా కార్పెట్ వేయించుకుని నడవటం ప్రజలు మరచిపోలేదని ఎద్దేవా చేశారు. హుద్ హుద్ తుఫాను, బెజవాడ బుడమేరు వరదల సమయంలో సీఎం చంద్రబాబు ఎంత కష్టపడి పని చేశారో ప్రజలు స్వయంగా చూశారన్నారు. ప్రజలను దోచేసిన జగన్‌కు., పేదలకు సేవ చేసే చంద్రబాబుకు తేడాను అప్పుడే గమనించారన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కూడా జగన్‌కు కనబడటం లేదన్నారు. ప్రజల మన్ననలు పొందుతూ పని చేస్తున్న చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంపై నిందలు వేయాలనే ఆలోచనతో జగన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నాడని మంత్రి గొట్టిపాటి మండిపడ్డారు.
ప్రాణాలకు తెగించి…
మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ శాఖకు చెందిన వేలాది మంది ఉద్యోగులు రాత్రనకా, పగలనకా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వారిని అభినందించారు. చాలా ప్రాంతాల్లో 24 గంటల్లోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారని ఆయన గుర్తు చేశారు. జోరు వానలో సైతం 48 గంటలు నిద్రాహారాలు మాని కర్తవ్య దీక్షలో మునిగిన అందరికీ హేట్స్ ఆఫ్ అంటూ మంత్రి ధన్యవాదాలు తెలిపారు. విపత్కర సమయంలోనూ విధులు నిర్వహించడం విధుల పట్ల వారికి ఉన్న అంకిత భావానికి నిదర్శమని ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.












