- ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటన
- నేను అనుకున్న ఏ ప్రణాళికా ఫెయిల్ అవ్వలేదు
- ఉగాది రోజున ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతమవుతుంది
- ఎన్టీఆర్ స్ఫూర్తితో 47 ఏళ్ళుగా ప్రజా సేవలో ఉన్నా
- నా జీవితం ప్రజలకు అంకితం..
- సుపరిపాలన, మంచి రాజకీయాలనే నమ్మాను
- పని చేయడం తప్ప మరొకటి తెలీదు
- పీ`4 కార్యక్రమంలో పాల్గొన్న పారిశ్రామిక వేత్తలను అభినందిస్తున్నా
- పేదరికం రూపుమాపడమే లక్ష్యంగా పీ`4 కార్యక్రమం ప్రారంభం
- లోగోను ఆవిష్కరించిన సీఎం, డిప్యూటీ సీఎం
అమరావతి (చైతన్యరథం): పేదలను ఆదుకునే మిషన్ పీ`4 అని, సమాజంలో ఈ కార్యక్రమం గేమ్ ఛేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. పీ`4 ఒక మహత్తర కార్యక్రమం అని, చరిత్ర సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఉగాది పర్వదినం రోజున ఆదివారం రాజధాని అమరావతిలో పీ`4 కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్షిప్‌గా ఈ విధానాన్ని తీసుకొచ్చారు. తొలి దశలో దాదాపు 20 లక్షల మందికి లబ్ది చేకూరేలా ప్రణాళికలు రూపొందించారు. వెలగపూడిలోని సచివాలయానికి సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు పారిశ్రామిక వేత్తలు, పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఆర్థికంగా ఉన్నత స్థానాలకు ఎదిగిన వారు.. కిందిస్థాయిలో ఉన్న కుటుంబాలను దత్తత తీసుకునే ఆలోచనతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ‘మార్గదర్శి- బంగారు కుటుంబం’ నినాదంతో పీ-4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాయం చేసేవారిని మార్గదర్శిగా, లబ్ధిపొందే వారిని బంగారు కుటుంబంగా వ్యవహరిస్తారు. ఇద్దరికా మధ్య ప్రభుత్వం సంధానకర్తగా ఉంటుంది. ఈ సందర్భంగా పీ`4 కార్యక్రమం లోగోను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి ఆవిష్కరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
ప్రజాసేవకే నా జీవితం అంకితం
తెలుగువారి తొలి పండుగ ఉగాది రోజున ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతుంది. అందుకే పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన పీ`4 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అట్టడుగున ఉన్న పేదల సాధికారత కోసం ‘పీ-4’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. సమాజంలో సంపద పెరుగుతున్నా, అది పేదవారికి అందని పరిస్థితి. పేదవారిగా వారు మిగిలిపోవటానికి వీలు లేదు. సంపన్నులు వారికి మార్గదర్శకంగా ఉండి, వారిని కూడా పైకి తీసుకు రావాలి. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచించే పవన్ కళ్యాణ్, భారత్ దేశాన్ని అగ్రదేశంగా మార్చే మోదీతో కలిసి ప్రభుత్వంలో ఉన్నాం. సరైన సమయంలో సరైన వ్యక్తి ప్రధానిగా ఉండటం మన అదృష్టం. నా గురించి నేను ఎక్కడా ఎక్కువగా చెప్పుకోను…కానీ ఇవాళ చెపుతున్నాను. 1978లో నేను మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను. మరో 3 ఏళ్లు ఉంటే నేను మొదటిసారి ఎమ్మెల్యే అయ్యి 50 ఏళ్లు అవుతుంది. 5 దశాబ్దాలుగా నన్ను ఆదరిస్తున్న మీకే నా జీవితం అంకితం. 9 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు సీఎం అయ్యాను. 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా, 30 ఏళ్లు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. దేశంలో ఎవరికీ దక్కని గౌరవం నాకు దక్కింది. అది ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రజానీకమే. నా ప్రస్థానాన్ని చూసుకంటే గుండె ఉప్పొంగుతోందని సీఎం చంద్రబాబు భావోద్వేగంతో చెప్పారు.
ఎన్టీఆర్ క్రమశిక్షణలో పెరిగాను
ఎన్టీఆర్ క్రమశిక్షణకు మారుపేరుతో పాటు పట్టుదల గల వ్యక్తి. అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. ఎన్టీఆర్ నీడలో కఠోర క్రమశిక్షణలో పెరిగాను. 47 ఏళ్ల్లుగా ప్రజలే జీవితంగా బతుకుతున్నాను. రాష్ట్రం బాగుండాలని నిత్యం ఆలోచించాను. ప్రజల జీవితాల్లో మార్పు రావాలని కోరుకున్నాను. ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేర్చి నిజాయితీ, అవినీతి రహిత పాలన అందించడమే నాకు తెలిసిన విషయాలు. సుపరిపాలన, మంచి రాజకీయాలనే నమ్మాను. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల జీవితాల్లో మార్పులు రావాలని అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాను. ప్రజల వద్దకే పాలన, జన్మభూమి, ఐటీ విప్లవాన్ని తెచ్చాను. పని తప్ప నాకు మరొకటి తెలియదు…మరో అలవాటు లేదు. నిద్రలేవగానే ప్రజలకు ఏం చేస్తే జీవితాల్లో వారి మార్పు వస్తుందో ఆలోచిస్తాను. రాత్రి పడుకునేటప్పుడు ఈ రోజు ఏం చేశాను, ఎంత మేలు జరిగిందని ఆలోచించి పడుకుంటాను. నేను ఎప్పుడూ తప్పు చేయలేదు, చేయను. నాకు కూడా ఒక కుటుంబం ఉంది. నా కుటుంబానికి రాజకీయాల ద్వారా జీవనోపాధి ఉండకూడదని ఆలోచించి హెరిటేజ్ సంస్థ పెట్టి నా కుటుంబ సభ్యులకు అప్పగించాను. వారు నా మీద ఆధార పడరు…నేనే వారిమీద ఆధార పడతున్నాను. కుటుంబానికి ఆర్థిక స్వావలంబన ఉంటే ధైర్యంగా ఉంటాం…ఆ ధైర్యమే నన్ను ఇప్పుడు నడిపిస్తోంది. నా సతీమణి భువనేశ్వరికి వ్యాపారాలు తెలియవు, వ్యాపారంలోకి నేను వెళ్లనని చెప్పారు. నేను మంత్రిగా, రాజకీయాల్లో ఉన్నాను, నువ్వు వెళ్లకుంటే ఇబ్బందులు వస్తాయని చెబితే హెరిటేజ్ సంస్థ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. అప్పటికి లోకేష్ చిన్న వయసులో ఉండి చదువుకుంటున్నారని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.
మేటైన నగరంగా అమరావతి
టీడీపీ కార్యకర్తలు చాలా మంది ఇబ్బంది పడ్డారు, ప్రాణాలు కోల్పోయారు. నా కోసం జెండా మోసే కార్యకర్తలు చనిపోయారు, వారి పిల్లలు అనాథలు అయ్యారని ఆలోచించి ట్రస్ట్ ఏర్పాటు చేసి చదివించి ప్రయోజకులను చేశాం. దీంతో వారి జీవితాలు బాగుపడ్డాయి. స్కూల్‌కు వెళ్లి వారితో గడిపాను..జీవితంలో ఏం అవుతామని అడిగేవాడిని. మా నాన్నను చంపిన వారిని చంపిన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పేవారు. చంపిన వారు వారి పాపాన వారు పోతారు, మీరు కూడా అదే పని చేస్తే జైలుకు వెళతారు అని చెప్పి చదివించాను. ఈ రోజు బ్రహ్మాండంగా జీవితంలో సెటిల్ అయ్యారు. 1991లో మన తెలుగుబిడ్డ పీవీ నరసింహారావు సంస్కరణలు తెచ్చి దేశ దశ, దిశ మార్చారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాక మానవతా దృక్పథóంతో పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు శ్రీకారం చుట్టారు. జాతీయ రహదారులు ఒక చిన్న ఆలోచన నుంచి వచ్చాయి. 2 కోట్ల జనాభా ఉన్న మలేషియా చిన్నదేశం. 8 వరుసల రహదారులు ఉన్నాయి. మన దేశం చాలా పెద్దది, మనకు హైవేలు లేవు అని నాటి ప్రధాని వాజ్‌పేయ్‌కి చెప్పాను. ఎలా చేద్దామంటే నాకు వదిలిపెట్టమని చెప్పి తొలుత నెల్లూరు నుంచి చెన్నైకి రోడ్డు వేశాం. నేడు దేశంలో రహదారుల దశ మారింది. విద్యుత్, ఎయిర్ పోర్టు, టెలీ కమ్యునికేషన్‌లో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ధనికులకే ఫోన్లు ఉండేవి. ఐటీ తీసుకొచ్చాక గ్రామాల్లో వ్యవసాయం చేసే రైతు, రైతు కూలీలు పిల్లలు నేడు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అమరావతి కూడా ప్రపంచంలో మేటైన నగరంగా తయారవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు.
గాడి తప్పిన పాలనను గాడిన పెట్టాం
రాష్ట్రంలో గాడి తప్పిన పాలనను గాడిన పెట్టాం. నేను, పవన్, కేంద్రం రాష్ట్రంపై శ్రద్ధ పెట్టి పునర్‌నిర్మాణమే ధ్యేయంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. దీని వల్ల ఫలితాలు వస్తున్నాయి. గాడితప్పిన అమరావతిని తిరిగి పట్టాలెక్కించాం. కేంద్రం చొరవతో పోలవరంను 2027కే పూర్తి చేస్తాం. విశాఖకు రైల్వే జోన్ తెచ్చాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయకుండా కేంద్రం ఆర్థిక సాయం అందించింది. ఎన్నికల్లో కూటమిని 93 శాతం స్ట్రైక్‌రేట్‌తో గెలిపించారు. మీరు గెలిపించిన సీట్లు రాష్ట్ర అభివృద్ధికి సంజీవనిగా పని చేస్తున్నాయి.1995లో ఐటీ గురించి మాట్లాడాను…ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, ఏఐ గురించి మాట్లాడుతున్నా. ఇవి సంసద సృష్టించడానికి ఉపయోగపడతాయి. తెలుగుజాతి బాగుండాలనేది నా కోరిక. తెలుగుదేశం పార్టీ తెలుగుజాతి కోసం పుట్టిన పార్టీ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
పేదలను ఒకదారికి తీసుకొస్తా
పేదల జీవితాలను ఒకదారికి తీసుకొచ్చే వరకు నా ప్రయత్నాన్ని వదిలిపెట్టను. ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం వచ్చింది. డ్వాక్రా సంఘాలు పెట్టి పొదుపు ఉద్యమం నేర్పించాను. మహిళలు ఇబ్బందులు పడకూడదని ఉచితంగా సిలిండర్లు అందించాను…ఇప్పుడు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఆడపిల్లకు విద్యలో 33 శాతం రిజర్వేషన్లు తెచ్చాం. ఈ రోజు ఆడబిడ్డల ఆదాయమే అధికంగా ఉంటోంది. ఆర్టీసీ బస్సుల్లో కండెక్టర్లుగా అవకాశం కల్పించాం. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు.
నా జీవితానికి ఎన్టీఆరే ఆదర్శం
బిల్ గేట్స్ ఇంటర్నెట్ రెవెల్యూషన్ తీసుకొచ్చారు. ఆయన ఒకస్థాయికి వచ్చాక ప్రజాసేవ ముఖ్యం అని గేట్స్ ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ కూడా తన సంపాదనలో కొంత డబ్బును సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్నారు. విప్రో అధినేత ప్రేమ్ జీ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా సీఎస్‌ఆర్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తోంది. స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ చదువుకునేందుకు ఆనాడు అనుకూల పరిస్థితులు లేవు. అంటరాని తనం, అవమానాన్ని ఎదుర్కొన్నారు..కానీ పట్టుదల వదులుకోలేదు. అంబేర్కర్ మేధో శక్తిని గుర్తించి షాయాజీరాజ్ మహరాజ్ అండగా నిలిచి ఆర్థిక సాయం చేశారు. లండన్ వెళ్లి చదువుకోవాలంటే నెలకు 12 డాలర్లు ఇచ్చారు. తిరిగి వచ్చాక అకౌంట్ జనరల్ కార్యాలయంలో ప్రొబేషన్‌గా పెట్టుకున్నారు. తరువాతి కాలంలో న్యాయవాదిగా, ఆర్థిక వేత్తగా, సామాజిక సంస్కర్తగా, భారత రాజ్యాంగాన్ని రాసి భవిష్యత్ తరాలకు ఏం కావాలో నిర్ధేశించిన వ్యక్తిగా అంబేద్కర్ ఎదిరగారు. షాయాజీరాజ్ చేసిన సాయం అంబేద్కర్ ఎదుగుదలకు ఉపయోగపడిరది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విశిష్టమైన వ్యక్తి. దేశం గర్వించేలా మిస్సైల్ కనిపెట్టారు. ముస్లింలు, బ్రాహ్మణులు కలిసి భోజనం చేయకూడదని ఆనాడు మూఢనమ్మకాలు ఉన్నాయి. కానీ రామేశ్వరంలో ఉన్న శివసుబ్రహ్మణ్యం అయ్యర్.. అబ్దుల్ కలాంను దగ్గరకు తీసుకుని సూచనలు ఇచ్చి ఆదరించారు. ఈ మాటలను అబ్దుల్ కలాం ఆయన పుస్తకంలో పొందుపరిచారు. వివేకానంద వెనక రామకృష్ణ పరమహంస ఉన్నారు. వివేకా గుణాన్ని అధ్యయనం చేసిన రామకృష్ణ బోధనలు చేసి, ఆధ్యాత్మిక విద్యను నేర్పించారు. తరువాతి కాలంలో ప్రపంచానికే సందేశం ఇచ్చి ప్రపంచం మెచ్చిన నేతగా వివేకానంద ఎదిగారు. నాడు ఎన్టీఆర్ లేకపోతే నేను కూడా సాధారణ వ్యక్తిని అయ్యేవాడిని. ఆయన దగ్గర నేర్చుకున్న పట్టుదల, క్రమశిక్షణ, దగ్గరకు చేర్చిన విధానం నా జీవితంలో మర్చిపోలేను. తన జీవితానికి ఎన్టీఆర్ ఆదర్శం అని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఆదరణ లేక రాణించలేక..
చాలా మందిలో తెలివితేటలు ఉన్నా ఆదరణ లేక రాణించలేకపోయారు. మనతో పుట్టిన మన బంధువులే పేదరికంలో ఉండి చదువుకోలేకపోతున్నారు. అలాంటి వారిని ఆదుకోవాలి. సంపాదించుకున్న ఆస్తులను చనిపోయినప్పుడు తీసుకెళ్లలేరు. మంచిపని చేశామా, స్వార్థంతో బతికామా అన్నదే మనం చనిపోయిన తర్వాత మిగిలిపోతాయి. మీ శక్తిని ఉపయోగించి ప్రజల జీవితాల్లో వెలుగు తెస్తే దాని వల్ల వచ్చే తృప్తి మరొక దాని ద్వారా రాదు. సమాజంలో ఉన్నత స్థానానికి ఎదిగిన వారు.. మరికొందరికి సాయం చేసి పైకి తీసుకురావాలి. సమాజానికి సేవ చేస్తేనే మీ పేరు చిరస్థాయిగా నిలుస్తుంది. ప్రతి కుటుంబానికీ విజన్ డాక్యుమెంట్ తయారు చేద్దాం. పీ-4 విధానంలో ప్రభుత్వం మెంటార్‌గా ఉంటుంది. ప్రతి ఇంటికీ సౌకర్యాలు కల్పిస్తాం. అందరికీ ఇల్లు, కరెంట్, నెట్, నీళ్లు, మరుగుదొడ్డి, గ్యాస్ సదుపాయాలు అందిస్తాం. సమాజం ఇచ్చినదాన్ని తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మన పిల్లల్ని, తెలుగుజాతిని తెలివైన వారిగా మార్చితే వారే డబ్బులు సంపాదిస్తారు. నన్ను 4 సార్లు సీఎం చేసిన ఈ సమాజం బాగుకోసం ఆలోచిస్తున్నా. ఈ కార్యక్రమం ఒక గేమ్ ఛేంజర్ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఆగస్టు 15కు ఒక రూపానికి తీసుకొస్తాం
స్వర్ణాంధ్ర విజన్-2047 రూపొందించాం. గతేడాది తలసరి ఆదాయం రూ.2,66,995 ఉంటే ఈ ఏడాది రూ.2,98,065 ఉంది. 2028-29 నాటికి రూ.5,42,985 అవుతుంది. 2047 నాటికి రూ.55 లక్షలకు పెరుగుతుంది. ఇవన్నీ సాధ్యం కావాలంటే ప్రజల్లో కూడా ఆలోచన రావాలి. 2047 నాటికి భారతదేశం అగ్రదేశంగా ఉంటుంది. అందులో మన తెలుగుజాతి అగ్రభాగాన ఉండాలన్నది నా తపన. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి. పెరిగిన ఆదాయాన్ని సంక్షేమానికి, అభివృద్ధికి ఖర్చు చేయాలి. నేను అనుకున్న ఏ ప్రణాళికా ఇప్పటి వరకు ఫెయిల్ అవ్వలేదు. మార్గదర్శులు దత్తత తీసుకున్న వారి కుటుంబాల పరిస్థితి డ్యాష్ బోర్డు ద్వారా సమీక్షిస్తాను. ఆగస్టు 15కు దీన్ని ఒక రూపానికి తీసుకొస్తాం. వచ్చే ఉగాదికి సాధించిన ప్రగతి కూడా మీ ముందు పెడతామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, పారిశ్రామిక వేత్తలు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు.