అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయంటూ మంత్రులవద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు నేరస్థుల్ని రాజకీయ నాయకులు కలవాలంటేనే భయపడేవారన్న చంద్రబాబు.. ఇప్పుడు నేరస్థుల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నేరస్థులకు తాము అండగా ఉన్నామని ప్రజలకు సందేశమిస్తూ రాజకీయాల్ని ఎటు తీసుకుపోతున్నారో అర్థం కావట్లేదని పరోక్షంగా వైసీపీ నేత వైఎస్ జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది పరిపాలన అంతా బాగుందన్నారు. అయితే, మంత్రులు మరింత సమర్థంగా పనిచేయాలని సూచించారు. ప్రజాసమస్యల పరిష్కారమే అజెండా కావాలని పిలుపునిచ్చారు. మరింత దూకుడుపెంచి ప్రజలతో మమేకం కావాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. తప్పు చేసిన వారు శిక్షనుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.
పోలవరం, బనకచర్ల ప్రాజెక్ట్‌లకు కేంద్రం సాయం చేస్తుందన్నారు. కేంద్రం సానుకూలంగా స్పందిస్తోందని.. ఆలస్యం అయితే ప్రతీ ఏడాది వ్యయం పెరుగుతుందన్నారు. నిధుల సమీకరణ కూడా జరుగుతోందన్నారు. పోలవరం, బనకచర్లకు కేంద్రం, రాష్ట్రం, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు, హైబ్రిడ్ అన్యూటీ మోడల్లో కూడా నిధులు వస్తాయన్నారు. క్వాంటం వ్యాలీని చేయాలని.. 2026 జనవరికి కార్యరూపం తీసుకురావాలని వెల్లడిరచారు. క్వాంటం వ్యాలీ బిల్డింగ్ డిజైన్స్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు చూపించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఈ నెల 15న తిరుపతిలో సినిమా సెలబ్రిటీలతో యోగా నిర్వహించాలని తెలిపారు. టూరిజం మంత్రి వెళ్లి సెలబ్రెటీలను ఆహ్వానించాలని.. తాను కూడా కొంతమందికి ఫోన్లు చేసి చెబుతానని సీఎం అన్నారు. 1983లో మహానాడుకు షర్ట్‌లు పసుపునీళ్లలో ముంచుకుని అటెండ్ అయ్యారని.. అప్పటినుంచి మహానాడు నిర్వహిస్తున్నారని గుర్తు చేసుకున్నారు. ఈసారి వాతావరణం బాగా అనుకూలించిందని, ఇదివరకు సమ్మర్‌లో అందరూ అల్లాడిపోయేవారమని గుర్తు చేసుకున్నారు. ఈసారి మహానాడు బాగా జరిగింది… కార్యకర్తల హాజరు బాగుందని చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు.
సీఎంకు మంత్రుల అభినందనలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా సీఎంకు మంత్రులు అభినందలు తెలిపారు. కూటమిలోని పక్షాల మధ్య సమన్వయం బాగా ఉందని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పీ`4కు సంబంధించి ప్రతి జిల్లాలో ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలని సూచించారు. నియోజకవర్గాలకు వెళ్ళాలని మంత్రులకు సూచించారు. విజయమాల్యలాంటి వాళ్ళు డబ్బులు తిని వెళ్ళిపోయారని.. రాజకీయ ముసుగులో ఉండి జగన్ నేరాలు చేస్తున్నారని విమర్శించారు. నేరస్థులను కూడా ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. జగన్, మిథున్‌రెడ్డి ఇద్దరిలో ఎవరు ముందు జైలుకు వెళ్తారనే అంశంపై వైసీపీలో చర్చ జరుగుతోందన్నారు. తప్పులు చేసిన వారు ఎవరు కూడా తప్పించుకోకూడదని స్పష్టం చేశారు. చట్టం, న్యాయ ప్రకారం వెళ్ళాలని సీఎం తెలిపారు. నేరస్థుడు నేరం చేసి బయటకు వెళ్లిన తరువాత అతను ఏం చేస్తున్నాడనేది తెలుసుకోవాలన్నారు. ఆ సిస్టం వెంటనే అమలు చేయాలని చెప్పారు. నదుల అనుసంధానంపై కేంద్రం సానుకూలంగా ఉందంటూ సీఎం సంతోషం వ్యక్తం చేశారు. పోలవరం, బనకచర్లను చేపట్టి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలన్నారు.
కేబినెట్‌లో యువగళం గురించి మంత్రి లోకేష్ ప్రస్తావిస్తూ.. యువగళం ప్రభుత్వానికి బ్రేక్ త్రూ అని వ్యాఖ్యానించారు. అధికారంలోకి రావడానికి, అధికారాన్ని అనుభవించడానికి యువగళం పాత్ర కూడా ఉందని సీఎం అన్నారు. గత ఏడాది ఇదే రోజు మనం ఊహించని విజయం లభించిందన్నారు. ప్రజలు ఆశయాలకు, అంచనాలకు అనుగుణంగా పని చేయాలని ఈ సందర్భంగా మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు.
గత వైకాపా ప్రభుత్వంలో తప్పులు చేసిన పెద్దలు ఇంకా బయటే తిరగటం సబబు కాదని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. ఏ తప్పూ చేయకుండానే తెలుగుదేశం నాయకుల్ని గత ప్రభుత్వంలో జైలుకు పంపారని మంత్రి సంధ్యారాణి గుర్తు చేయటంతో.. మనల్ని అన్యాయంగా వేధించారని మనమూ వేధించటం సరికాదన్న చంద్రబాబు.. గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై పారదర్శకంగా విచారణ జరుపుతామన్నారు. నేరం రుజువైతే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రాజకీయ కక్ష సాధింపులు మన ధోరణి కాదని.. ఈ తేడాను ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. పోలవరం -బనకచర్లపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తోందని, ప్రాజెక్టుకు నిధుల సమీకరణ జరుగుతోందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.