- అధికారులతో పనులు పూర్తి చేయించే బాధ్యత మీదే
- పనులు చేయించినపుడే సామర్థ్యం తెలుస్తుంది
- కేబినెట్ ఆమోదించిన సంస్థలను సమన్వయం చేసుకోండి
- సాధించిన పెట్టుబడుల ఫలాలు ప్రజలకు చెప్పండి
- మంత్రులకు సీఎం చంద్రబాబు హితబోధ
అమరావతి (చైతన్య రథం): మంత్రులు డ్రైవింగ్ ఫోర్సుగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు హితబోధ చేశారు. అధికారులు నిబంధనలు, సలహాలు ఇచ్చినప్పటికీ శాఖను నడిపించాల్సింది మంత్రులేనని తేల్చి చెప్పారు. పనిచేయని అధికారులను పిలిచి మాట్లాడో.. మందలించో వారితో పనిచేయించినప్పుడే మంత్రుల సామర్థ్యం బయటపడుతుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాల్సింది మంత్రులేగానీ.. అధికారులు కాదనే విషయం గుర్తెరగాలని హితవుపలికారు. మంత్రివర్గ సమావేశం అజెండా అంశాలు పూర్తయ్యాక తాజా పరిణామాలపై చంద్రబాబు మంత్రులతో చర్చించారు. 15ఏళ్లు తాను ముఖ్యమంత్రిగా పనిచేసినా.. గత 15నెలల్లో వేగంగా సాధించినన్ని పెట్టుబడులు గతంలో రాలేదని సంతృప్తి వ్యక్తం చేశారు. పెట్టుబడులకు ఆమోదంతోపాటు సంస్థలు గ్రౌండ్ అయ్యేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. కేబినెట్లో ఏయే సంస్థలకు ఆమోదం తెలుపుతున్నామో సంబంధిత శాఖ మంత్రి.. పనులు ప్రారంభమయ్యేలా సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఎంతో కష్టపడి రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు తెస్తున్నప్పుడు ‘ రాజకీయంగాను వాటి ఫలాలు
ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని సీఎం సూచించారు. గూగుల్, టీసీఎస్వంటి దిగ్గజ సంస్థల రాకతో విశాఖ ఐటీ హబ్ అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు తెలిపారు. 2028 నాటికి విశాఖలో వేలాది ఐటీ ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. భవిష్యత్తులో ప్రత్యేక నగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. పశ్చిమలో
ముంబయి ఎలాంటి మహానగరమో.. తూర్పులో విశాఖ అంతటి మహానగరంగా అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే 15ఏళ్లలో విశాఖ మహా
నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందుతుందని తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోంలో భాగంగా ప్రస్తుతం 4. 7 లక్షలమంది ఉన్నారని… ఈ సంఖ్యను 10 లక్షలకు పెంచాలని అభిప్రాయపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడటంతోపాటు రైల్వే జోన్ సాధనవంటి అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. గూగుల్ డేటా సెంటర్ మనకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడంపై పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.