- సుస్థిర నగరాల అభివృద్ధికి అవసరమైన అంశాల పరిశీలన
- అక్కడి విధానాలపై మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్రెడ్డి అధ్యయనం
- నామి ఐలాండ్, చియాంగ్ గెచెవోన్ వాగు, హన్ నదిని పరిశీలించిన వైనం
- ఈడీబీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు పర్యటన
దక్షిణ కొరియా/సియోల్ / అమరావతి (చైతన్యరథం): అమరావతితో పాటు రాష్ట్రంలో సుస్థిర నగరాల అభివృద్ధి, రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి సంస్థ(ఏపీఈడీబీ) ఆధ్వర్యంలో మంత్రులు, అధికారులు దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లారు… స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 11.40 గంటలకు ఆ దేశ రాజధాని సియోల్ చేరుకున్నారు… ఆ తర్వాత దక్షిణ కొరియాలోని నామీ ఐ ల్యాండ్ సీఈవో మిన్ క్యోంగ్ వూతో మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు భేటీ అయ్యారు. దక్షిణ కొరియాలో సహజ సిద్ధమైన, సాంస్కృతిక, సాంప్రదాయక పర్యాటక ప్రదేశంగా ఉన్న నామీ ఐలాండ్ ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. సియోల్లో ఉన్న అతి పెద్ద పర్యాటక ప్రాంతం ఇదే కావడం విశేషం. ఇక్కడ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లతో ఏడాది పొడవునా సంగీత ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటమే కాకుండా ఆర్థికంగానూ లాభదాయకంగా ఉంది. నామీ ద్వీపం అభివృద్ధి, పర్యాటకులను ఆకట్టుకునేందుకు తీసుకున్న చర్యలపై అక్కడి సీఈవోతో మంత్రి నారాయణ చర్చించారు. 4,60,000 చ.మీ. విస్తీర్ణంలో అందమైన చెట్లు, పూల మొక్కలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న నామీ ద్వీపంలో అనుసరిస్తున్న విధానాలను అమరావతిని బ్లూ గ్రీన్ సిటీగా రూపుదిద్దడంలో పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి నారాయణ నిర్ణయించారు.
తీవ్ర కాలుష్యం నుంచి…
మధ్యాహ్నం భోజనం తర్వాత సియోల్ లోని చియాంగ్ చెఒన్ వాగును మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. 30 ఏళ్ల క్రితం పూర్తిగా మురుగునీటితో తీవ్ర కాలుష్యకారకంగా ఉన్న చియాంగ్ చెఒన్ వాగు 69 తర్వాత అత్యంత పరిశుభ్రంగా మారిన విధానాన్ని తెలుసుకున్నారు. 2003-2005 మధ్యకాలంలో సియోల్ నగరంలో మెరుగైన వాతావరణం కల్పించడం కోసం “చియాంగ్ గేచెఒన్” పునరుద్ధరణ ప్రాజెక్టును స్థానిక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సియోల్ నగర వాతావరణాన్ని మెరుగుపరచడం కోసం చేసిన ప్రయత్నం ఫలించి నేడు అత్యంత ఆహ్లాదకరంగా చియాంగ్జేచెఒన్ వాగు పరిసర ప్రాంతాలు మారాయి.
ముఖ్యంగా గతంలో అత్యంత మురికిగా, కాలుష్య కారకంగా ఉండే చియాంగ్ చెఒన్ వాగులోని నీరు.. పునరుద్ధరణ తర్వాత ఎంతో స్వచ్ఛంగా మారింది. గాలి నాణ్యత పెరగడం, శబ్ద కాలుష్యం తగ్గడం.. తద్వారా జీవవైవిధ్యం మెరుగుపడటం ఈ వాగు పునరుద్ధరణలో ప్రత్యేకత. ఏపీలో కాలుష్య కారకంగా మారిన నదులు, కాలువలు, వాగులు వంటి వాటిని పునరుద్ధరించే కోణంలో ఈ వాగును మంత్రులు, ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎం.టి. కృష్ణ బాబు, కన్నబాబు పరిశీలించారు.
సియోల్ మధ్యలో హన్ నది
సాయంత్రం హన్ నదిని మంత్రులు పరిశీలించారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరం మధ్యలో ప్రవహించే హన్ నది.. నదీ పరిసర ప్రాంతాలను మంత్రులు పరిశీలించారు. సియోల్ అభివృద్ధిలో అంతర్భాగంగా నిలుస్తూ, నగరవాసులకు ఆహ్లాదకర వాతావరణ కల్పిస్తూ.. పర్యాటకులను ఆకర్షిస్తుండటం హన్ నది ప్రత్యేకత. అమరావతి నిర్మాణంలో సైతం ఇటువంటి ఆహ్లాదకర వాతావరణం కల్పించే కోణంలో హన్ నది తీర ప్రాంతాలను మంత్రులు అధ్యయనం చేశారు. హన్ నది తరీంలో అనేక పార్కులు, వంతెనలు, సైకిల్ మార్గాలు వంటి నిర్మాణాలతో ఆధునిక రాజధానులకు సరికొత్త రూపంగా సియోల్ నిలుస్తోంది. కృష్ణానది తీరంలో రాజధాని అమరావతి నిర్మిస్తున్న క్రమంలో హన్ నది.. తరహాలో ఆధునిక రాజధాని నిర్మాణంలో కృష్ణ తీరంలో అభివృద్ధికి ఉన్న అవకాశాలపై మంత్రులు స్థానిక
అధికారులతో చర్చించారు.
రాత్రికి సియోల్లో భారత రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ నిషికాంత్ సింగ్, షాలిని సింగ్ దంపతుల ఆహ్వానం మేరకు స్థానిక శరవణ భవన్ లో విందుకు మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, ప్రభుత్వ ఉన్నతాధికారులు టి. కృష్ణ బాబు, కాటమనేని భాస్కర్, కన్నబాబు, తదితరులు హాజరయ్యారు.