- 80వ రోజు ప్రజల నుంచి అర్జీల స్వీకరణ
- ప్రతిఒక్కరికీ అండగా ఉంటామని హామీ
విశాఖపట్నం(చైతన్యరథం): నగరంలోని టీడీపీ కార్యాలయం లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 80వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రి లోకేష్‌ను కలిసేందుకు విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారి నుంచి అర్జీలు స్వీకరించారు. విశాఖ 83వ డివిజన్ పరిధిలోని ఏఎంసీ కాలనీలో 192 కుటుంబాలకు రెండు దశాబ్దాల క్రితం ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన అపార్ట్‌మెంట్లు శిథిలావస్థకు చేరుకు న్నాయని, ఇళ్లు తిరిగి నిర్మించి తమను ఆదుకోవాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేశారు. తలసేమియా వ్యాధిగ్రస్థుల పిల్లల కోసం విశాఖలో కేర్ సెంటర్ నిర్మాణానికి స్థలం కేటాయింపుతో పాటు తగిన నిధులు మంజూరుకు చర్యలు తీసుకోవాలని విశాఖ కారుణ్య స్వచ్ఛాంధ్ర సేవా సంస్థ ప్రతినిధులు కోరారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం ముషిడిపల్లిలో యాదవ సామాజిక వర్గానికి ఇళ్ల స్థలాలు కేటాయింపుతో పాటు కమ్యూనిటీ భవనం నిర్మించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ఆధారం లేని తనకు కార్యకర్తల సంక్షమ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని విశాఖ మద్దిలపాలెం కేఆర్‌ఎమ్ కాలనీకి చెందిన వెంపాడ స్తుతయ్య విజ్ఞప్తి చేశారు. వారసత్వంగా సంక్రమించిన భూమి మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేయగా వీఆర్వో తిరస్కరించా రని, విచారించి తగిన చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం రామయోగి అగ్రహారానికి చెందిన నాగిరెడ్డి గొంగలయ్య కోరారు. అర్జీలను పరిశీలించి సమస్యల పరిష్కా రానికి కృషిచేస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు.















