- వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి అర్జీలు స్వీకరణ
- పరిష్కారానికి కృషిచేస్తామని హామీ
విశాఖపట్నం (చైతన్యరథం): ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అండగా నిలుస్తున్నారు. సాక్షి పత్రికపై పరువునష్టం కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం విశాఖ వచ్చిన మంత్రి లోకేష్..సోమవారం ఉదయం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 57వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన మూడేళ్ల కుమార్తెకు బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స అవసరమని, ఇప్పటికే రూ.10 లక్షలు ఖర్చయ్యాయని అనకాపల్లి జిల్లా కసింకోట మండలం కన్నురుపాలెంకు చెందిన రుత్తల ప్రభాకర్.. మంత్రి లోకేష్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న తమకు ఎటూ పాలుపోవడం లేదని, తమ కుమార్తెకు వైద్యసాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వీఎంఆర్డీయేలో 20 సంవత్సరాలు ఎన్ఎంఆర్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేసిన తన భర్త సర్వీసులో ఉండగానే అనారోగ్యంతో మరణించారని, కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని విశాఖకు చెందిన పి.ధనలక్ష్మి.. మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. తన భర్తతో పాటు సేవలందించిన వారిని వీఎంఆర్డీయే క్రమబద్ధీకరించందని, తన భర్త మరణించి 17 ఏళ్లు గడిచినప్పటికీ తనకు ఎలాంటి సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తన తండ్రి సంపాదించిన భూమిని, ఇంటిని బత్తిన అప్పల్ల, బత్తిన సూరిబాబు, బత్తిన దేవి, మైనపు గణపతి, మైనపు ఈశ్వరమ్మ కలిసి కబ్జా చేశారని, విచారించి న్యాయం చేయాలని విజయనగరం జిల్లా లక్కవరపు కోట మండలం ఖాశాపేటకు చెందిన అంగటి లక్ష్మి.. మంత్రి లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. తన తల్లిదండ్రులిద్దరూ మరణించారని, వారు సంపాదించిన ఆస్తి తనకు దక్కకుండా వేధిస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు.
ఆర్టిస్టిక్ స్కేటింగ్‌లో రాణిస్తున్న తనకు శిక్షణ కోసం ఆర్థిక సహకారం అందించాలని విశాఖపట్నం పెదవాల్తేరుకు చెందిన దొంతర గ్రీష్మ కోరారు.
గత వైసీపీ ప్రభుత్వం తొలగించిన వృద్ధాప్య పెన్షన్‌ను పునరుద్ధరించాలని విశాఖపట్నం సీతంపేటకు చెందిన అవ్వకాంతం విజ్ఞప్తి చేశారు.
హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆర్టీఈ యాక్ట్ రూల్ 14 అనుసరించి ఫారమ్ నెం.1ను ఈ నెల 31లోగా సమర్పించాల్సి ఉందని, అయితే ఫారమ్ నెం.1ను సమర్పించేందుకు మరికొంత గడువు ఇప్పించాలని ఏపీ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్(ఏపీపీఎస్ఏ) ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.
విశాఖ మురళీనగర్‌లో సబ్ పోస్టాఫీసు సౌకర్యం కల్పించాలని మురళీగనర్ రెసిడెన్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.
ఆయా అర్జీలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.