– కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు
మంగళగిరి (చైతన్యరథం): ఉద్యోగం కోసం కాంబోడియా వెళ్లి కష్టాల్లో చిక్కుకున్న గుంటూరు జిల్లా మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని పెనుమాక గ్రామానికి చెందిన వేమవరపు చందుకి… రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో విముక్తి లభించింది. పెనుమాకకు చెందిన వేమవరపు చందు ఇంటర్ వరకూ చదివి కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో విజయవాడలో క్యాటరింగ్ నిర్వహించుకుంటూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలల క్రితం వింజనంపాడులో జరిగిన తన సోదరి వివాహ కార్యక్రమంలో పర్చూరుకు చెందిన మోజెస్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ అతడు చెప్పిన మాటలు నమ్మిన చందు ఈ ఏడాది జూన్ 24వ తేదీన కాంబోడియా వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తరువాత మోసపోయినట్లు తెలుసుకున్నాడు. సైబర్ నేరాలు చేయాలంటూ మోజెస్, అతని ముఠా సభ్యులు చందుపై వేధింపులు ప్రారంభించారు. దీనికి చందు అంగీకరించకపోవడంతో చీకటి గదిలో బంధించి తిండి కూడా సరిగా పెట్టకుండా చిత్రహింసలకు గురి చేశారు. దీనికి తోడు అక్కడి వాతావరణ పరిస్థితులకు చందుకు గొంతు నుంచి గుండె వరకూ ఇన్ఫెక్షన్ సోకింది. ఎలాగైనా సైబర్ ముఠా చెర నుంచి బయటపడాలనే ఆలోచనలో ఉన్న చందు హలో డాట్ నారా లోకేష్ సైట్‌కు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించాడు. స్పందించిన మంత్రి లోకేష్.. చందును క్షేమంగా స్వస్థలానికి చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి లోకేష్ ఆదేశాలతో కాంబోడియా ఎంబసీ అధికారులతో మాట్లాడిన అధికారులు.. చందు ను ఈనెల ఒకటవ తేదీన క్షేమంగా స్వస్థలానికి చేరేలా చర్యలు తీసుకున్నారు. కాగా తనను సైబర్ నేరగాళ్ల చెర నుంచి ప్రాణాలతో కాపాడిన మంత్రి లోకేష్ కు చందు, అతడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు..