- ఆకస్మికంగా ఇంటికి వెళ్లిన మంత్రి లోకేష్
- సదరు కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరణ
- అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి లోకేష్
- ఇంటిని పరిశీలించి, కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి
- కుటుంబ బాధ్యత తీసుకుంటానని, ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ
- మంత్రి లోకేష్ రాకతో ఆనందంలో ముస్లిం మైనార్టీ కుటుంబం
మంగళగిరి (చైతన్యరథం): పవిత్ర రంజాన్ వేళ మంగళగిరి బస్టాండ్ సమీపంలోని పేద ముస్లిం మైనార్టీ సోదరుడు షేక్ షహెన్షా నివాసాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. షహెన్షా కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి లోకేష్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముందుగా షహెన్షా నివాసానికి చేరుకున్న మంత్రి లోకేష్ వుధూ(కాళ్లు, చేతులు కడుక్కోవడం) నిర్వహించి ముస్లింత సంప్రదాయ కుఫీ టోపీ ధరించారు. అనంతరం సదరు ముస్లిం సోదరుడితో పాటు కుటుంబ సభ్యులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు.
కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి లోకేష్
ఇఫ్తార్ విందు సందర్భంగా షహెన్షా నివసిస్తున్న ఇంటిని పరిశీలించి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను మంత్రి నారా లోకేష్ అడిగి తెలుసుకున్నారు. షెహెన్షా తల్లిదండ్రులు షేక్ జమాలుద్దీన్, రెహ్మతున్నీసాలను ఆప్యాయంగా పలకరించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఏం పనిచేస్తారని జమాలుద్దీన్‌ను మంత్రి ప్రశ్నించగా తాను టైలర్ నని, 50 ఏళ్లుగా టైలరింగ్ వృత్తి చేసుకుని కుటుంబాన్ని పోషించానని, ఇప్పుడు తన వయసు 70 ఏళ్లు పైబడటంతో ఆరోగ్యం సహకరించక ఇంటివద్దనే ఉంటున్నానని బదులిచ్చారు. కూటమి ప్రభుత్వం సకాలంలో అందించే రూ.4వేల వృద్ధాప్య పెన్షన్‌తో ఎంతో భరోసా లభిస్తోందని చెప్పారు. పెన్షన్ ఒకటో తేదీనే అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని, దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా కూటమి ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్‌ను రూ.4వేలు అందిస్తోందని మంత్రి లోకేష్ చెప్పారు. ఎంతమంది సంతానం అని మంత్రి ప్రశ్నించగా.. తనకు ఆరుగురు కుమార్తెలు, ఒక కుమారుడని బదులిచ్చారు. అందరికీ వివాహాలు పూర్తయి, మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారని బదులిచ్చారు. తన నలుగురు కుమార్తెలు మంగళగిరి పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటారని, ఇద్దరు కుమార్తెలు గుంటూరులో నివసిస్తారని బదులిచ్చారు. కుమారుడు షహెన్షా కష్టపడి పనిచేస్తాడని, అతనికి ముగ్గురు కుమార్తెలని చెప్పారు.
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం
జమాలుద్దీన్ మనవళ్లు, మనవరాళ్లను ఏం చదువుతున్నారని మంత్రి వాకబు చేశారు. తాము దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నామని బదులిచ్చారు. ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటని ప్రశ్నిచంగా.. ఇంగ్లీష్ అని బదులిచ్చారు. అందరూ గర్వపడేవిధంగా చదవాలని మంత్రి వారిని ప్రోత్సహించారు. పిల్లలను చదివించే ఆర్థిక స్థోమత లేదని జమాలుద్దీన్ బదులివ్వగా.. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్నాయని, పిల్లలను బాగా చదివించాలని, కనీసం 12వ తరగతి వరకు చదివిస్తే.. వృత్తి విద్య శిక్షణ ద్వారా హెల్త్ కేర్, పర్యాటక రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి వివరించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని, ఇంటర్ విద్య కరిక్యులమ్ లోనూ అనేక మార్పులు తీసుకువస్తున్నామని చెప్పారు. స్వచ్ఛతలో మంగళగిరిని నెం.1గా తీర్చిదిద్దుతామని.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ వాటర్ పనులు మే నెల నుంచి ప్రారంభిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు.
కుటుంబ బాధ్యత తీసుకుంటా, ఇల్లు నిర్మించి ఇస్తా
షహెన్షా నివసిస్తున్న ఇంటిని మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. సెంటు స్థలంలో ఇప్పుడుంటున్న రేకుల ఇంటిని తన తండ్రి నిర్మించి ఇచ్చారని, ఇరుకుగా మారడంతో ఇబ్బందులు పడుతున్నామని మంత్రి లోకేష్ దృష్టికి జమాలుద్దీన్ తీసుకొచ్చారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ.. కుటుంబ బాధ్యత తాను తీసుకుంటానని, నూతన ఇల్లు నిర్మించి ఇస్తానని, దిగులుపడవద్దని హామీ ఇచ్చారు. పిల్లలను బాగా చదివించాలని, ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ అని, ఈ మాసంలో ముస్లిం సోదరులు కఠిన ఉపవాస దీక్షలు ఆచరిస్తారన్నారు. తాను పుట్టిపెరిగింది హైదరాబాద్ లోనని, హలీమ్‌ను ఇష్టంగా తింటామని చెప్పారు. తమ ఇంటిని సందర్శించి.. మంత్రి నారా లోకేష్ ఇఫ్తార్ విందు స్వీకరించడంపై షహెన్షా, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం షహెన్షా కుటుంబానికి మంత్రి నారా లోకేష్ పవిత్ర ఖురాన్ గ్రంథంతో పాటు రంజాన్ బహుమతిని అందజేశారు.